లక్నో: ఒక వ్యక్తి చికెన్ కొనుగోలు చేసి ఇంటికి చేరుకున్నాడు. అయితే చికెన్ వండే విషయంలో భార్య, అతడి మధ్య తీవ్ర గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో తల్లిదండ్రుల ఘర్షణ చూసిన ఆరేళ్ల కుమార్తె షాక్కు గురై మరణించింది. ఆ బాలిక మృతిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. (parents fight) ఉత్తరప్రదేశ్లోని గోండా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. హతిహి గ్రామానికి చెందిన 35 ఏళ్ల ప్రమోద్ గౌతమ్, తన భార్య లక్ష్మి, ఇద్దరు కుమారులు, ఆరేళ్ల కుమార్తెతో కలిసి నివసిస్తున్నాడు. మద్యం సేవించిన అతడు చికెన్ కొనుగోలు చేసి ఇంటికి చేరుకున్నాడు.
కాగా, చికెన్ వండే విషయంలో ప్రమోద్ గౌతమ్, అతడి భార్య లక్ష్మీ మధ్య వివాదం తలెత్తింది. ఈ నేపథ్యంలో ప్రమోద్ తన భార్యను కొట్టాడు. అయితే తల్లిదండ్రుల ఘర్షణ చూసి వారి ఆరేళ్ల కుమార్తె అయిన మహక్ తీవ్ర ఆందోళన చెందింది. ఉన్నట్టుండి ఆ బాలిక కుప్పకూలిపోయింది. కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే ఆ బాలిక మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
మరోవైపు ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ బాలిక మృతదేహాన్ని పరిశీలించారు. ఆ చిన్నారి శరీరంపై ఎలాంటి గాయాల గుర్తులు లేవు. సంఘటనా స్థలంలో కూడా రక్తపు మరకల ఆనవాళ్లు కనిపించలేదు. ఫోరెన్సిక్ బృందం కూడా ఘటనా స్థలాన్ని సందర్శించింది. ఈ నేపథ్యంలో తల్లిదండ్రుల గొడవ చూసి తట్టుకోలేక షాక్తో ఆ బాలిక మరణించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
అయితే బాలిక మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్ట్మార్టం నివేదిక వచ్చిన తర్వాతే ఆ చిన్నారి మరణంపై స్పష్టత వస్తుందని పోలీస్ అధికారి తెలిపారు. బాలిక తండ్రి
ప్రమోద్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు వెల్లడించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.