మున్నేరు మీద నిర్మిస్తున్న ‘కేబుల్ బ్రిడ్జి’ నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఖమ్మం నగరానికి మణిహారం కాబోతున్న ‘తీగల వంతెన’ పనుల్లో జాప్యంపై నగరవాసులు, ప్రజలు మండిపడుతున్నారు. మున్నేరుపై కాల్వొడ్డు ప్రాంతం నుంచి జలగంనగర్ వరకు నిర్మిస్తున్న ఈ కేబుల్ బ్రిడ్జి పనుల్లో గుత్తేదారు తన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు తీవ్రమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా తీగల వంతెనకు ఇరువైపులా నిర్మించే ర్యాంపు నిర్మాణానికి అవసరమైన మట్టి విషయంలో గుత్తేదారు నాసిరకం మట్టిని నింపినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బ్రిడ్జి నిర్మాణాన్ని నిత్యం పరిశీలిస్తున్న కొందరు ప్రజలు ర్యాంపుల నిర్మాణంలో వినియోగిస్తున్న బురద మట్టి ఫొటోలను తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ ర్యాంపు భవిష్యత్తులో ఎక్కువకాలం నిలిచేనా..? అంటూ ప్రశ్నించిన పోస్టులు వైరల్ అయ్యాయి. దీంతో చేసిన తప్పిదాన్ని కప్పి పుచ్చుకునేందుకు సదరు గుత్తేదారు, పనులు పర్యవేక్షణ చేస్తున్న ఆర్అండ్బీ సైట్ ఇంజినీర్లు వెంటనే ఆ బురదమట్టిపై ఎర్రమట్టిని కప్పి మమ అనిపించారు.
– మామిళ్లగూడెం, ఆగస్టు 18

నాటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఆధ్వర్యంలో హైదరాబాద్ తరహాలో ఖమ్మం మున్నేరు మీద కేబుల్ బ్రిడ్జి నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. ఇప్పటికే ఉన్న బ్రిటీష్‌కాలం నాటి పాత వంతెనకు వందేళ్లు పూర్తికావడంతోపాటు కొంతమేరకు బలహీనపడటంతో దానికి ప్రత్యామ్నాయంగా హైదరాబాద్ దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జి తరహా ఆధునిక డిజైన్లతో నిర్మాణానికి నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం 2023లో రూ.180 కోట్ల నిధులు మంజూరు చేసింది. నాటి మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్ 2023 సెప్టెంబర్ 30వ తేదీన శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. అనంతరం జరిగిన సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టడంతో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో పనులు కొనసాగుతున్నాయి. రెండున్నరేళ్లు కావొస్తున్నప్పటికీ బ్రిడ్జి నిర్మాణం ఇంకా 75 శాతం కూడా పూర్తికాలేదు. పనులు పర్యవేక్షణ చేస్తున్న ఆర్అండ్బీ అధికారులు మాత్రం ఈ ఏడాది డిసెంబర్ తరువాతనే ప్రజలకు అందుబాటులోకి రావచ్చనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పనులు ప్రారంభించిన నాటినుంచి ఆ రహదారిలో రాకపోకలను కొనసాగిస్తున్న ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
పురాతన వంతెన భద్రత గాలికి..
మున్నేరు మీద ఉన్న పురాతన రాతి వంతెన భద్రతను ఆర్అండ్బీ అధికారులు, గుత్తేదారు గాలికి వదిలేశారు. కేబుల్ వంతెన నిర్మాణ పనులు దక్కించుకున్న అశోక్ బిల్డ్‌కాన్ లిమిటెట్, ఏఎస్సీ ఇన్ఫోటెక్ నిర్మాణ సంస్థ పురాతన వంతెన పక్కనే సమాంతరంగా పనులను ప్రారంభించింది. పురాతన వంతెనకు రెండుపక్కలా ఉన్న ర్యాంపును కొంతమేరకు ధ్వంసం చేసి కేబుల్ బ్రిడ్జి పనులు సాగిస్తున్న నిర్మాణ సంస్థ భవిష్యత్తులో ఈ పురాతన వంతెన చారిత్రాత్మక కట్టడంగా మిగలకుండా ధ్వంసం చేస్తున్నది. మున్నేరుకు వరద వస్తే పురాతన వంతెనకు ఇరువైపులా ర్యాంపుల పక్కన తొలగించిన మట్టిగుంతల్లో నీరు చేరి కూలిపోయే ప్రమాదం ఉందని స్థానిక ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తు తరాలకు ఒక గుర్తింపుగా ఉండే ఈ పురాతన వంతెనను భద్రంగా ఉంచాలని, తగినరీతిగా పటిష్ట పరచాలనే డిమాండ్ ప్రజల నుంచి వినిపిస్తున్నది. అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పరిహారం చెల్లించడంలో నిర్లక్ష్యం..
మున్నేరు కేబుల్ బ్రిడ్జి నిర్మాణంలో భూములు, ఇండ్లు కోల్పోయిన వారికి పరిహారం చెల్లించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పనులు ముందుకు సాగడం లేదు. ఖమ్మం నగరంలోని కాల్వొడ్డు ప్రాంతంలో హిందూ శ్మశానవాటిక నుంచి మజీద్ వరకు కొంతమేరకు ప్రభుత్వ భూమి ఉన్నప్పటికీ మజీద్‌కు చెందిన కాంప్లెక్స్ పూర్తిస్థాయిలో రోడ్డు విస్తరణలో పోయింది. దీంతో అక్కడ దుకాణాలు నిర్వహిస్తూ ఉపాధి పొందుతున్న వారు వీధినపడ్డారు. దీంతో మజీద్‌కు నష్టపరిహారం చెల్లించకపోవడంతో అటువైపు పనులు ముందుకు కదలడంలేదు. అదేవిధంగా మంచికంటినగర్, నయాబజార్ పాఠశాల వరకు రోడ్డు విస్తరణలో ఇండ్లు కోల్పోతున్న బాధితులకు నష్టపరిహారం చెల్లించడంలో ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నది. దీంతో ఖమ్మం కాల్వొడ్డు ప్రాంతంలో పనులు ఆశించినంత వేగంగా ముందుకుసాగడం లేదు.