ఆసియా క్రీడల స్వర్ణాల వేటలో కాస్త వెనుకబడ్డా పతకాల రేసులో మాత్రం భారత్ జోరు కొనసాగుతున్నది. అథ్లెటిక్స్‌లో భారత క్రీడాకారులు సత్తాచాటిన వేళ ఆటల తొమ్మిదోరోజు దేశానికి నాలుగు రజతాలు, మూడు కాంస్యాలు దక్కాయి. పసిడి పతకాలపై ఆశలు రేపిన స్కాష్ ప్లేయర్లు అనాహత్, అభయ్ రజతాలతోనే సరిపెట్టుకున్నారు. అథ్లెటిక్స్‌లో సోజన్, సర్వేశ్ వెండి వెలుగులు పంచగా తేజస్విని, హరిత, పారుల్ కాంస్యాలు సాధించారు.
నగోయా: అథ్లెట్ల అదిరిపోయే ప్రదర్శనతో ఆసియా క్రీడల తొమ్మిదో రోజు భారత్ పతకాల మోత మోగించింది. ఆదివారం దేశానికి ‘పసిడి మురిపెం’ తీరకపోయినా ఇద్దరు స్కాష్ ప్లేయర్లు, మరో ఇద్దరు అథ్లెట్లు వెండి వెలుగులు పంచగా వేర్వేరు క్రీడాంశాల్లో ముగ్గురు అథ్లెట్లు కంచు మోత మోగించారు. మహిళల లాంగ్ జంప్‌లో ఆన్సీ సోజన్ ఎడాప్పిళి తృటిలో స్వర్ణం కోల్పోగా మెన్స్ హైజంప్‌లో 51 ఏండ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ సర్వేశ్ కుశారె రెండో స్థానంతో రజతం గెలుచుకుని చరిత్ర సృష్టించాడు. డెకథ్లాన్లో తేజస్విని చరిత్రాత్మక పతకంతో సత్తాచాటగా మహిళల 3 వేల మీటర్ల స్టీపుల్ ఛేజ్‌లో పారుల్ చౌదరి, విమెన్స్ 200 మీటర్ల పరుగు పందెంలో హరిత బాద్రా సైతం బ్రాంజ్ గెలుచుకున్నారు.
రెండు సెంటిమీటర్ల తేడాతో స్వర్ణం దూరం..
మహిళల లాంగ్‌జంప్‌లో సోజన్ 6.53 మీటర్ల జంప్‌తో రజతం గెలిచింది. చైనా అమ్మాయి హువాంగ్ 6.55 మీ.తో స్వర్ణం సాధించింది. వాస్తవానికి పోటీ చివరిదాకా ఈ కేరళ అమ్మాయిదే అగ్రస్థానం. తొలి జంప్‌లో 6.49 మీటర్లతో ప్రారంభించిన ఆమె ఐదో జంప్‌ను 6.53గా నమోదుచేసి అగ్రస్థానానికి చేరుకుంది. అయితే హువాంగ్ ఐదో ప్రయత్నంలో 6.55 మీ. దూకింది. ఆఖరి ప్రయత్నంలో సోజన్ 6.49 మీ.కే పరిమితమవడంతో ఆమె పసిడి ఆశలు అడియాసలయ్యాయి. ఇదే పోటీలో మరో భారత అథ్లెట్ శైలి సింగ్ (6.42 మీ.)తో నాలుగో స్థానంలో ముగించి కొద్దిలో పతకం కోల్పోయింది. 6.46 మీ.తో చైనాకు చెందిన మెంగ్యి కాంస్యం నెగ్గింది.
సర్వేశ్ రికార్డు జంప్

Sarvesh
పురుషుల హైజంప్‌లో సర్వేశ్ 2.25 మీటర్ల జంప్‌తో రజతం సాధించాడు. 31 ఏండ్ల ఈ మహారాష్ట్ర అథ్లెట్ 1970 తర్వాత ఈ క్రీడలో దేశానికి పతకం గెలిచిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. 1954లో అజిత్, 1966, 1970 క్రీడల్లో భీమ్ సింగ్ పతకాలు గెలిచిన తర్వాత హైజంప్‌లో దేశానికి ఇదే ఫస్ట్ మెడల్. తాజా ఎడిషన్‌లో సర్వేశ్‌తో పాటు చైనీస్ తైపీ అథ్లెట్ చావొ సువాన్-ఫు సైతం 2.25 మీటర్లే దూకగా అతడికి స్వర్ణం దక్కింది. అయితే చావొ ఫస్ట్ అటెంప్ట్‌లోనే దూకగా సర్వేశ్ రెండో ప్రయత్నంలో దూకడంతో వెండితో సంతృప్తిపడ్డాడు. ఇక పది క్రీడలు ఉండే డెకథ్లాన్లో తేజస్విని శంకర్ (7,934 పాయింట్లు) ఈ క్రీడల్లో భారత్‌కు మొదటి పతకాన్ని అందించాడు. జపాన్ (8,123), చైనా (8,012) అథ్లెట్లు తొలి రెండు స్థానాల్లో నిలిచారు. మహిళల 3 వేల మీటర్ల స్టీపుల్ ఛేజ్‌లో పారుల్ చౌదరి (9:08.67 నిమిషాలు)తో కాంస్యం గెలుచుకుంది. మహిళల 200 మీటర్ల రన్నింగ్ రేసులో హరిత 23.20 సెకన్లలో లక్ష్యాన్ని పూర్తి చేసి కాంస్యం సాధించింది. సింగపూర్ (22.78), చైనా (22.93) అథ్లెట్లకు స్వర్ణ, రజతాలు దక్కాయి.
ఆశలు రేపినా..

Abhay
స్కాష్‌లో రెండు పసిడి పతకాలపై ఆశలు రేపిన యువ సంచలనం అనాహత్ సింగ్, అభయ్ సింగ్ వెండికే పరిమితమయ్యారు. ఇంతవరకూ ఈ గేమ్‌లో స్వర్ణం దక్కని నేపథ్యంలో ఈ ఇద్దరూ ఫైనల్ చేరడంతో కొత్త చరిత్రను లిఖిస్తారని భావించినా తుది పోరులో ఈ ఇద్దరూ మలేషియా ప్లేయర్ల చేతిలో ఓడారు. మొదట అభయ్.. 0-3 (9-11, 5-11, 5-11)తో డిఫెండింగ్ చాంపియన్ ఇయాన్ యోవ్ చేతిలో ఓడాడు. మహిళల సింగిల్స్‌లో అనాహత్ సైతం 4-11, 4-11, 7-11తో ప్రపంచ ఐదో ర్యాంకర్, భారత సంతతికి చెందిన శివసంగరి సుబ్రహ్మణియమ్ చేతిలో ఓటమిపాలైంది. కాగా ఫైనల్లో గెలిచినవారికి 2028 లాస్ఏంజెల్స్లో నేరుగా బెర్త్ దక్కించుకునే అవకాశం ఉన్నా భారత ప్లేయర్లు ఆ సదావకాశాన్నీ చేజార్చుకున్నారు.
సెమీస్కుఆర్చర్ల్లు

Archery Team
ఆర్చరీలో కాంపౌండ్, రికర్వ్ ఆర్చర్లు గురి తప్పని లక్ష్యాలతో క్వార్టర్స్ మెట్టు దాటి సెమీస్ చేరుకున్నారు. తొలుత మెన్స్ కాంపౌండ్ సెక్షన్లో కుశాల్ దలాల్, సాహిల్ జాదవ్, గణేశ్ మణిరత్నం త్రయం ప్రిక్వార్టర్స్‌లో 235-215 స్కోరుతో యూఏఈని ఓడించి, ఆ తర్వాత క్వార్టర్స్‌లో 235-232తో భూటాన్‌ను చిత్తు చేసింది. విమెన్స్ కాంపౌండ్ కేటగిరీలో తెలంగాణ అమ్మాయి తానిపర్తి చికిత, జ్యోతి సురేఖ వెన్నం, ప్రతీకతో కూడిన భారత్.. క్వార్టర్స్‌లో 233-230తో కజకిస్థాన్‌ను ఓడించింది. మెన్స్ రికర్వ్ సెక్షన్లో బొమ్మదేవర ధీరజ్-సంజయ్ జోడీ 5-1తో ఫిలిప్పీన్స్‌పై గెలిచి సెమీస్‌కు అర్హత సాధించింది. విమెన్స్ రికర్వ్ టీమ్‌లో కృతి-కుంకుమ్ జంట 6-0తో చైనీస్ తైపీని మట్టికరిపించింది. రికర్వ్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో ధీరజ్-కుంకుమ్ 6-0తో వియత్నాంపై గెలిచారు. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చికిత-సాహిల్ ద్వయం 160-146తో మంగోలియాపై గెలిచి సెమీస్ బెర్తను ఖాయం చేసుకుంది.
మెడల్‌కు రెండడుగుల దూరంలో..

Parul Chaudary
హాకీలో మన మహిళా జట్టు పూల్ దశలో ఆడిన చివరి మ్యాచ్‌లో 7-0తో సింగపూర్‌ను ఓడించి పతకానికి రెండడుగుల దూరంలో నిలిచింది. సునెలిత (22, 24వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేయగా కెప్టెన్ సలీమ టెటె (17)తో పాటు లాల్రెమ్సియామి (26), రుతుజ (29), నిక్కీ (35), దీపికా (55) తలా ఓ గోల్ కొట్టారు.
పతకాలు ఖాయం చేసిన ‘పంచ్’లు

Boxing
ప్రత్యర్థులకు తమ ‘పంచ్’ పవర్ చూపుతూ పతక రేసులోకి వస్తున్న భారత బాక్సర్లు దేశానికి మూడు మెడల్స్ ఖాయం చేశారు. పలు కేటగిరీల్లో జరిగిన క్వార్టర్స్ బౌట్స్‌లో ముగ్గురు బాక్సర్లు సెమీస్ చేరుకుని కనీసం కాంస్యం ఖాయం చేసుకున్నారు. మహిళల 65 కిలోల విభాగంలో పర్వీన్ హుడా 5-0తో ఖమిదొవ (ఉజ్బెకిస్థాన్)పై ఏకపక్ష విజయం సాధించగా మెన్స్ 80 కిలోల క్వార్టర్స్‌లో అంకుశ్ 5-0తో తజకిస్థాన్ బాక్సర్ సలిమోవ్పై గెలిచాడు. ఈ ఇద్దరితో పాటు పురుషుల 90+కిలోల విభాగంలో నరేందర్ బెర్వాల్.. థాయ్‌లాండ్‌కు చెందిన సయెంగ్టెప్ను ఓడించాడు
మహిళా షట్లర్లు ఉత్తచేతులతోనే..

Pv Sindhu
బ్యాడ్మింటన్‌లో భారత మహిళా షట్లర్లకు తీవ్ర నిరాశ మిగిలింది. జట్టుగా విఫలమైన మన ప్లేయర్లు.. వ్యక్తిగత విభాగాల్లోనూ తేలిపోయారు. సింగిల్స్ విభాగాల్లో పీవీ సింధు, ఉన్నతి హుడా క్వార్టర్స్‌లోనే ఇంటిబాట పట్టారు. మొదట సింధు 21-11, 18-21, 10-21తో చెన్ యు ఫీ (చైనా) చేతిలో పోరాడి ఓడింది. మరో పోరులో ఉన్నతి 16-21, 21-14, 17-21తో మూడు సార్లు వరల్డ్ చాంపియన్ అకానె యమగుచి (జపాన్) జోరు ముందు నిలువలేకపోయింది. అంతకుముందు విమెన్ డబుల్స్‌లో ట్రీసా-గాయత్రి జోడీ, మిక్స్డ్ డబుల్స్‌లో ధృవ్ కపిల-తనీషా క్రాస్టొ సైతం నిరాశపరిచారు.