సిటీబ్యూరో, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ) : మూడు ముక్కలైన మహా నగరంలో పారిశుధ్య నిర్వహణ ఒక ప్రైవేటు సంస్థ రాంకీ చేతుల్లో బందీగా మారింది. పరిపాలన సౌలభ్యం పేరుతో జీహెచ్ఎంసీని మూడు ముక్కలు (జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజిగిరి) చేసిన ప్రభుత్వం చెత్త నిర్వహణలో మాత్రం ప్రత్యామ్నాయ మార్గాలైన డంపింగ్ యార్డులు (ప్రాసెసింగ్ యూనిట్లు, లక్డారం, ప్యారానగర్, ఖానాపూర్) నెలకొల్పకుండా.. సదరు రాంకీపై ఆధారపడిన తీరు ప్రస్తుతం తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రధానంగా నిబంధనలను తుంగలో తొక్కి ఏకపక్షంగా రాంకీ సంస్థకు ప్రయోజనం చేకూర్చేలా అధికార యంత్రాంగం పావులు కదిపిన తీరు చర్చనీయాంశంగా మారింది. ప్రాసెసింగ్ యూనిట్ లేదన్న కారణంతో రాంకీ వైపే మొగ్గు చూపడం వెనుక భారీ స్థాయిలో ‘ అదృశ్య హస్తం’ ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా ఉమ్మడి రాష్ట్రం 2009లో జరిగిన 25 ఏళ్ల సుదీర్ఘ ఒప్పందాన్ని అడ్డం పెట్టుకుని, అటు జీహెచ్ఎంసీ ఖజానాను ఖాళీ చేస్తూ.. ఇటు కొత్తగా ఏర్పడిన మల్కాజిగిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లపై కూడా పెత్తనం చెలాయించేందుకు రాంకీ సంస్థ సిద్ధం కావడం గమనార్హం.
గత ఒప్పందాల ప్రకారం సదరు నిర్వహణ సంస్థపై ఇప్పటికే అనేక ఆరోపణలు, జరిమానాలు విధించిన దాఖలాలు ఉన్నాయి. జవహర్ నగర్ డంపింగ్ యార్డు వద్ద కాలుష్య నియంత్రణలో వైఫల్యం, సెకండరీ బిన్ల ఏర్పాటు, తరలింపులో జాప్యం వంటి అంశాల్లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ (ఎన్జీటీ), హైకోర్టు సైతం మొట్టికాయలు వేసినా ప్రభుత్వ పెద్దల వైఖరిలో మార్పు రాకపోకవడం గమనార్హం. ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోకపోతే జవహర్ నగర్ పరిసర ప్రాంతాలు మరింత భరించలేని భయాందోళనకర పరిస్థితులు నెలకొననున్నాయని స్థానికులు చెబుతున్నారు. చెత్త కుప్పల నుంచి వస్తున్న లీచేట్ (విషతుల్యమైన ద్రవం) భూగర్భ జలాలను పూర్తిగా కలుషితం చేసింది. చుట్టు పక్కల 10 కిలోమీటర్ల మేర నీరు తాగడానికి పనికి రాకుండా పోయింది.
వేల టన్నుల చెత్తతో వచ్చే భయంకరమైన దుర్వాసనతో ప్రజలు శ్వాసకోస వ్యాధుల భారిన పడుతున్నారు. ఇప్పటికే రోజూ వివిధ ప్రాంతాల నుంచి వచ్చే దాదాపు 9వేల మెట్రిక్ టన్నుల చెత్తతో పరిస్థితి ఇలా ఉంటే కొత్త కార్పొరేషన్లతో అదనంగా వచ్చే చెత్తతో వచ్చే ప్రమాదంపై ఆందోళన చెందుతున్నారు. మూడు కార్పొరేషన్లుగా విడగొట్టి రాజకీయ లబ్ధి పొందడంలో ఉన్న శ్రద్ద నగరాన్ని చెత్త నుంచి విముక్తం చేయడంలో పాలకులకు లేదన్న విమర్శలు వస్తున్నాయి. కేవలం కాంట్రాక్ట్ సంస్థలకు కొమ్ముకాస్తూ జవహర్ నగర్ వాసుల ప్రాణాలను ఫణంగా పెడుతున్నారన్న చర్చ జరుగుతున్నది.
వాస్తవంగా జీహెచ్ఎంసీ, రాంకీ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం జీహెచ్ఎంసీని భవిష్యత్లో విస్తరించిన ప్రాంతాల్లోనూ (60 కిలోమీటర్ల వరకు) రాంకీ ఆధ్వర్యంలోనే పారిశుద్ధ్య నిర్వహణ ఉండేలా నిబందన పెట్టినట్టు అధికారులు చెబుతున్నారు. ఒప్పందంలో విస్తరణ గురించిన ప్రస్తావించారే తప్ప విభజనపై రాంకీ సంస్థకే ఇవ్వాలనే ప్రతిపాదన లేదని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అయితే కొత్తగా ఏర్పడిన మరో రెండు మున్సిపల్ కార్పొరేషన్లను సైతం తమకు ఇవ్వాలనే ప్రతిపాదనలతో పాటు ఒప్పందంలో మిగిలిపోయిన ఇంటింటి చెత్త సేకరణ కూడా ఇవ్వాలంటూ సదరు రాంకీ సంస్థ అడ్డదారిలో దక్కించుకున్నది. సుదీర్ఘకాలం పాటు శానిటేషన్ విభాగంలో పనిచేసిన ఓ సీనియర్ ఇంజినీర్ డైరెక్షన్లో రాంకీకి జీహెచ్ఎంసీపై ఒత్తిడి పెంచి కొత్త కార్పొరేషన్లకు కూడా తమ ఖాతాలో వేసుకున్నట్లు ప్రచారంలో ఉన్నది.
ఒప్పందానికి తూట్లు
జీహెచ్ఎంసీ విభజన నేపథ్యంలో నగరంలో కొత్తగా రెండు మున్సిపల్ కార్పొరేషన్లు ఏర్పడ్డాయి. అయితే, అసలు ఒప్పందంలో విస్తరణ అనే పదాన్ని తమకు అనుకూలంగా మార్చుకుని, విభజన తర్వాత ఏర్పడే కొత్త సంస్థల పరిధిలోనూ తామే చెత్త సేకరిస్తామని రాంకీ పట్టుపట్టి మరీ సాధించుకున్నది. ఒప్పంద వివరాల్లోకి వెళితే 25 ఏండ్ల ఒప్పందంలో రాంకీ నిత్యం ఉత్పత్తయ్యే చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలించాలి. డంపింగ్ యార్డు నిర్వహణ, సైంటిఫిక్ డిస్పోజల్ వంటి కార్యక్రమాన్ని నిర్వహించాలి. మొదటి దశలో డంపింగ్ యార్డు, సైంటిఫిక్ డిస్పోజల్ 40 శాతం ఫీజు మాత్రమే ఇచ్చేశారు.
కానీ క్రమంగా చెత్త రవాణా 20 శాతం, డంపింగ్ యార్డులో చెత్త నిల్వ, శాస్త్రీయ విధానంలో నిర్వహణకు 40 శాతం, రోడ్లపై ఉన్న చెత్తను సైతం తరలించాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. దీనికి 30 శాతం..మొత్తం 90 శాతం రాంకీ చేతికి వెళ్లిపోయింది. 2009లో మెట్రిక్ టన్నుకు రూ.1800తో మొదలైన ఈ ఒప్పందం, ఇప్పుడు రూ.2,110 (90 శాతం చెల్లింపులు) వద్ద కొనసాగుతోంది. 100 శాతం పనులు పూర్తి చేస్తే రూ.2,345 చెల్లించాల్సి ఉంటుంది. మెరుగైన నిర్వహణ లేకుంఆనే రవాణా, డంపింగ్ యార్డు నిర్వహణ పేరుతో భారీగా బిల్లులు డ్రా చేస్తుండడం, కొందరు అధికారులు సైతం రాంకీకి అండగా నిలబడుతున్నారన్న ఆరోపణలు లేకపోలేదు.
జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ నిర్వహణలో వైఫల్యాలు కనిపిస్తూనే ఉన్నాయని, సైంటిఫిక్ డిస్పోజల్ (శాస్త్రీయ వ్యర్థాల నిర్వహణ) సరిగా జరగడం లేదని స్థానికులు గగ్గోలు పెడుతున్నారు. కేవలం నిధులను గుంజుకోవడమే తప్ప, అకడ కాలుష్య నివారణపై సంస్థ దృష్టి సారించడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడు కొత్త కార్పొరేషన్లు కూడా ఆ సంస్థకే ఇవ్వడం ద్వారా నగర శివారు ప్రాంతాలు మరో జవహర్ నగర్లుగా మారే ప్రమాదం ఉందని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారు. పారిశుద్ధ్య నిర్వహణలో పోటీ తత్వం పెంచి, ప్రాసెసింగ్ యూనిట్లు పెంచి ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని కోరుతున్నారు.