న్యూఢిల్లీ, మే 26: బీజేపీకి చెందిన ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా షేర్ చేసిన ఒక ఫొటో ఇప్పుడు సామాజిక మాధ్యమంలో చర్చకు దారితీసింది. నటుడు రాకేశ్ గుప్తాతో సీఎం సమావేశమైన ఫొటోను షేర్ చేయగా, ఆమె ఆసీనులైన ఖరీదైన ప్రీమియం మోడల్ కుర్చీపై సామాజిక మాధ్యమంలో విస్తృతంగా చర్చ నడుస్తున్నది. రోడ్ ఓక్ ఇంపీరియో ఎగ్జిక్యూటివ్ చైర్‌గా పిలిచే దాని ఖరీదు సుమారు రూ. 66 వేల నుంచి రూ.82,600 ఉంటుంది. ఎలక్ట్రానిక్ మసాజ్, రిైక్లెనింగ్ సెట్టింగ్‌లు, ఆటోమేటిక్ ఫుట్‌రెస్ట్, ఫోమ్ కుషనింగ్ వంటి సౌకర్యాలు అందులో ఉంటాయి.
ఒక వైపు ఖర్చులు, దుబారాను తగ్గించాలని సుద్దులు చెబుతున్న బీజేపీ నేతలు ఇంత ఖరీదైన కుర్చీ ఎలా వాడుతున్నారు? ఇది ప్రభుత్వ నిధుల దుర్వినియోగం కాదా? అని పలువురు నెటిజన్లు ప్రశ్నించారు. మాజీ సీఎం కేజ్రీవాల్ ఉంటున్న గృహాన్ని శీష్‌మహల్ అంటూ విమర్శలు చేసిన బీజేపీ అధికారంలోని రాగానే అవన్నీ మర్చిపోయినట్టుందని కొందరు విమర్శించారు. అయితే రేఖాగుప్తా చర్యను పలువురు బీజేపీ మద్దతుదారులు సమర్థిస్తూ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తన నివాసానికి కోట్ల రూపాయలతో చేసుకున్న ఆధునిక హంగులతో పోలిస్తే ఇదేపాటి అని ఎదురు దాడికి దిగారు.