న్యూఢిల్లీ, మే 26: అక్రమ వలసలు, ఇతర కారణాల వల్ల సంభవిస్తున్న అసహజ జనాభా మార్పును పరిశీలించడానికి ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా మంగళవారం ప్రకటించారు. ఈ సమస్య భారతదేశ సార్వభౌమత్వానికి, జాతీయ భద్రతకు, సామాజిక సమతుల్యతకు, గిరిజన సమూహాల పరిరక్షణకు ఒక పెద్ద సవాలని ఆయన అభివర్ణించారు.
గత ఏడాది స్వాతంత్య్ర దినోత్సవం నాడు ప్రధాని నరేంద్ర మోదీ కమిటీ ఏర్పాటుపై వాగ్దానం చేశారని ఎక్స్ పోస్టులో హోం మంత్రి పేర్కొన్నారు. చొరబాట్లు, అసహజ జనాభా మార్పునకు కారణమయ్యే ఇతర అంశాలు ఏ దేశానికైనా వర్తమాన, భవిష్యత్తుకు చాలా ముఖ్యమైన సవాలును విసురుతున్నాయి.
ఈ సవాలును ఎదుర్కోవడానికే 2025 ఆగస్టు 15న ప్రధాని నరేంద్ర మోదీ జనాభా మార్పుపై ఉన్నత స్థాయి కమిటీని ప్రకటించారు. ప్రభుత్వం ఇప్పుడు ఈ కమిటీని ఏర్పాటుచేసింది అని హోం మంత్రి తన పోస్టులో పేర్కొన్నారు. ఈ కమిటీకి సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి ప్రకాశ్ ప్రభాకర్ నావ్లేకర్ సారథ్యం వహిస్తారని, ఇందులో సభ్యులుగా మాజీ ఐఏఎస్ అధికారి దుర్గా శంకర్ మిశ్రా, మాజీ ఐపీఎస్ అధికారి బాలాజీ శ్రీవాస్తవ, ఆర్థికవేత్త డాక్టర్ షర్మికా రవి, సెన్సస్ కమిషనర్ ఉంటారని ఆయన తెలిపారు.
మరోవైపు తాము వెళ్లగొట్టకముందే బెంగాల్ నుంచి పారిపోవాలని అక్రమ వలసదారులను ఆ రాష్ట్ర సీఎం సువేందు అధికారి హెచ్చరించారు. బంగ్లా ప్రజలు స్వచ్ఛందంగా వెళ్లకపోతే కఠిన చర్యలు తీసుకొంటామన్నారు.