కోదాడ, ఆగస్టు 11 : విద్యార్థులు తమ విద్యార్థి దశలో చదువుతో పాటు సామాజిక స్పృహ అలవర్చుకుని దేశం గర్వించే మంచి పౌరులుగా ఎదగాలని ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ గంపా నాగేశ్వరరావు అన్నారు. కోదాడ పట్టణంలోని ఎన్ ఆర్ ఎస్ ఇనిస్టిట్యూషన్స్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసంపై నిర్వహించిన తల్లిదండ్రుల సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు మంచి నడవడికతో మంచి పౌరులుగా తయారుకావాలన్నారు. విద్యార్థులు లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించేందుకు కృషి చేయాలని సూచించారు. ప్రతి ఒక విద్యార్థిలో అసమాన ప్రతిభ దాగి ఉంటుందని, వాటిని సమయానుసారంగా ప్రదర్శించినపుడే విజయం వరిస్తుందన్నారు. విద్యార్థులకు ఎన్ ఆర్ ఎస్ విద్యాసంస్థలు అత్యుత్తమ సౌకర్యాలు కల్పిస్తున్నారని వాటిని సద్వినియోగం చేసుకొని విజేతలుగా నిలవాలని కోరారు.
ఎన్ఆర్ఎస్ ఇనిస్టిట్యూషన్స్ చైర్మన్ వడ్డే రాజేష్ చౌదరి మాట్లాడుతూ.. తమ విద్యా సంస్థలలో చేరిన ప్రతీ ఒక్కరిపై ప్రత్యేక దృష్టి పెట్టి వారికి ఆసక్తి ఉన్న రంగాలలో నిష్ణాతులుగా తయారు చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో భారతీ విద్యాసంస్థల కరస్పాండెంట్ కట్టా సత్తిరెడ్డి, ఎన్ ఆర్ ఎస్ ఇనిస్టిట్యూషన్ డైరెక్టర్ మనోహర్ రెడ్డి, కరస్పాండెంట్ వేణుగోపాలరావు, ప్రిన్సిపాల్ గంధం వెంకటరమణ (జీ వీ), వైస్ ప్రిన్సిపాల్ పీ ఎన్ ఆర్, పీ ఆర్ వో మల్లికార్జున రావు, పలువురు టీచర్లు, కాలేజీ లెక్చరర్లు, సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

విద్యార్థులు సామాజిక స్పృహ అలవర్చుకోవాలి : గంపా నాగేశ్వరరావు