నిజామాబాద్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైన ప్రజల తీర్పు నేడు వెలువడనుంది. మున్సిపల్ ఎన్నికల్లో గెలిచేదెవరో? ఓడేదెవరో? మరికొద్ది గంటల్లో తేటతెల్లం కానుంది. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల్లో ఎడతెగని ఉత్కంఠ నెలకొంది. ఫలితాల కోసం ఆతృతగా ఎదురు చూస్తున్న వారంతా తమ ఇష్ట దైవానికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఓట్ల లెక్కింపునకు ఎన్నికల యంత్రాంగం పకడ్భందీ ఏర్పాట్లు చేసింది. ఉదయం 8గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతోంది.
ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు కొనసాగుతుంది. ముందుగా పోలింగ్ బూత్‌ల నుంచి వచ్చిన బ్యాలెట్ బాక్సుల సీల్‌ను కౌంటింగ్ ఏజెంట్లు సమక్షంలో పరిశీలన చేసి బ్యాలెట్ పత్రాలను బయటకు తీస్తారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తారు. బ్యాలెట్ పేపర్‌పై సరిగా స్వస్తిక్ మార్క్ లేకపోతే, ఒకరి కంటే ఎక్కువ మందికి స్వస్తిక్ మార్కింగ్ చేస్తే చెల్లని ఓట్లుగా పరిగణిస్తారు. నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ నగరపాలక సంస్థ, ఆర్మూర్, బోధన్, భీమ్‌గల్ మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 4,95,485 మంది ఓటర్లకు 3,06,697 మంది మాత్రమే ఓటు హక్కును వినియోగించుకున్నారు.
కామారెడ్డి జిల్లాలో కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, బిచ్కుంద మున్సిపాలిటీల్లో మొత్తం 1,49,543 మంది ఓటర్లకు 1,03,895 మంది ఓటు వేశారు. ఆయా మున్సిపాలిటీ పరిధిల్లో ఓట్ల లెక్కింపునకు పటిష్ట ఏర్పాట్లను యంత్రాంగం పూర్తి చేసింది. పోలింగ్ రోజు చాలా చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా కౌంటింగ్ సందర్భంగా అవాంఛనీయ ఘటనలు వెలుగు చూడకుండా ఎన్నికల అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
శత శాతం వైఫల్యత…
ఎన్నికల్లో శత శాతం పోలింగ్ నమోదు కాకపోవడానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. ఓ వైపు రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్లక్ష్యం, జిల్లా యంత్రాంగం నిర్లీప్తత తోడవ్వగా మరోవైపు ఓటర్లలో బాధ్యతారాహిత్యం కూడా కలిసి వస్తోంది. నిజామాబాద్ నగరంలోని 60 డివిజన్లలో పోలింగ్ సరళిని పరిశీలిస్తే చిత్ర, విచిత్రాలు వెలుగు చూశాయి. నగరంలోని కోర్ ప్రాంతంలో 50శాతం వరకే పోలింగ్ జరిగింది. శివారు ప్రాంతాల్లో 70 నుంచి 80శాతం ఓటింగ్ చేరువైంది.
ముబారక్ నగర్, బోర్గాం, కాలూర్, ఖానాపూర్, గూపన్పల్లి, అర్సపల్లి వంటి గ్రామీణ వాతావరణం కలిగిన ఏరియాల్లో పెద్ద ఎత్తున జనాలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఖిల్లా ప్రాంతంలోనూ సుమారుగా 15 డివిజన్లలో భారీగా పోలింగ్ శాతం నమోదైంది. నగరంలోని అభివృద్ధి చెందిన ప్రాంతాలు, అక్షరాస్యత ఎక్కువగా ఉన్న ఏరియాలోనే పోలింగ్ ఆశించిన స్థాయిలో జరగలేదు. ఓటర్లను ఆకర్షించేందుకు ఆదర్శ పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసిన బూత్‌లలోనూ ఓటింగ్ శాతం తక్కువగానే నమోదైంది.
ఉద్యోగ, పోలీస్ సంఘాల మౌనమేలా…?
ఎన్నికల విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులపై చిందులు తొక్కిన బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ తీరుపై ఉద్యోగ సంఘాలు స్పందించకపోవడంపై సర్వత్రా చర్చ నడుస్తోంది. పారదర్శకంగా, పార్టీలకు అతీతంగా పని చేయాల్సిన ప్రభుత్వ సంఘాలు ఏ కారణంతో మౌనం వహించాయని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఎంపీ అర్వింద్‌కు భయపడి ఖండనలు ఇవ్వడం లేదా? వేరే ఇతర కారణాలు ఉన్నాయా? అనే కోణంలో పలువురు మాట్లాడుకుంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగులపై నోరు పారేసుకోవడం ముమ్మాటికి తప్పు.
ఉద్యోగ సంఘాలు ఈ విషయంలో బాసటగా నిలిచి పోలింగ్ విధుల్లో పాల్గొన్న సిబ్బందికి ఆత్మైస్థెర్యాన్ని అందివ్వాల్సి ఉండగా అదేది జరగలేదు. ఎన్నికల విధుల్లో సర్కార్ టీచర్లు, ఇతర శాఖలకు చెందిన వారున్నప్పటికీ టీఎన్జీవో, టీజీవో, ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘాలు ప్రేక్షక పాత్రకే పరిమితం అయ్యాయి. పోలీసులపై బీజేపీ ఎంపీ బూతులు తిట్టడంతో వన్‌టౌన్‌లో కేసులు నమోదు చేశారు. ఎంపీ వైఖరిని ఎండగడుతూ పోలీస్ సంఘాలు సైతం నోరు విప్పలేదు. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు, నాయకులు దూషిస్తే మౌనం వహించడం, అధికారంలో లేని పార్టీలకు చెందిన నేతలు మాట జారితే మరో విధంగా స్పందించడం ఎంత వరకు సబబు? అని ప్రజలు అడుగుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగ సంఘాల ద్వంద వైఖరి సరైంది కాదని జనాలు అనుకుంటున్నారు.