Mahendragiri varahi | సుమంత్ హీరోగా, దర్శకుడు సంతోష్ జాగర్లపూడి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక సోషియో ఫాంటసీ చిత్రం ‘మహేంద్రగిరి వారాహి’ విడుదలకు సిద్ధమైంది. ఇప్పటికే కాన్సెప్ట్ పోస్టర్లు, ప్రచార చిత్రాలతో ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచిన ఈ సినిమా విడుదల తేదీని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. సెప్టెంబర్ 11న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు సోమవారం నిర్వహించిన ప్రెస్మీట్లో వెల్లడించారు. ఈ సందర్భంగా హీరో సుమంత్ మాట్లాడుతూ, ఈ సినిమా కోసం దాదాపు రెండున్నరేళ్ల పాటు కృషి చేసినట్లు తెలిపారు. మధ్యలో కొన్ని కారణాల వల్ల ప్రాజెక్ట్ ఆలస్యమైనప్పటికీ, చివరకు అనుకున్న స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నామని చెప్పారు.
కథలో ఎన్నో ఊహించని ట్విస్టులు ఉంటాయని, దర్శకుడు సంతోష్ జాగర్లపూడి ప్రేక్షకులకు పూర్తిగా కొత్త అనుభూతిని అందించేలా సినిమాను రూపొందించారని అన్నారు.ఈ సినిమాలో కీలక పాత్ర కోసం నటి ఐశ్వర్యా రాజేశ్‌ను సంప్రదించగా, కథ నచ్చి వెంటనే అంగీకరించారని సుమంత్ వెల్లడించారు. అయితే ఆమె వారాహి అమ్మవారి పాత్రలో కనిపిస్తారా? లేక మరో ప్రత్యేకమైన పాత్రలో ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తారా? అనే విషయాన్ని మాత్రం ఇప్పుడే చెప్పలేమని తెలిపారు. ఆ సర్ప్రైజ్ను ప్రేక్షకులు థియేటర్లలోనే ఆస్వాదించాలని కోరారు. సినిమా బడ్జెట్ గురించి మాట్లాడుతూ, మొదట రూ.10 కోట్లలో సినిమా పూర్తి చేయాలని భావించామని, కానీ కథకు తగ్గట్టుగా విజువల్ ఎఫెక్ట్స్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడంతో ఖర్చు గణనీయంగా పెరిగిందన్నారు. ముఖ్యంగా వీఎఫ్ఎక్స్ వర్క్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని, ప్రేక్షకులకు గూస్బంప్స్ వచ్చేలా విజువల్స్ రూపొందించామని వెల్లడించారు.
దర్శకుడు సంతోష్ జాగర్లపూడి మాట్లాడుతూ, ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించాలని భావిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆయనను సంప్రదించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, అధికారికంగా ఖరారైన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. చిత్రంలో ఓ ప్రముఖ స్టార్ హీరో దాదాపు 20 నిమిషాల పాటు ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారని నిర్మాత మధు వెల్లడించారు. అయితే ఆ స్టార్ హీరో ఎవరు అనే విషయాన్ని మాత్రం గోప్యంగా ఉంచడంతో సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. ఆ సర్ప్రైజ్ను త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.