జో ఖో జాతాహై జిందగీమే గజల్ హై నామ్ ఉస్కా షాయరీ మే’ అంటాడు గజల్ గురించి ఉర్దూ కవి నిదా ఫాజలీ. ‘జీవితంలో దేనిని కోల్పోతామో, కవిత్వంలో అదే గజల్’ అని. ఉర్దూ గజల్ మినార్లు గోల్కొండలో లేచి విశ్వ వ్యాప్తమయ్యాయి. తెలుగు గజల్స్‌కి సృష్టికర్త దాశరథి. వాటిని మిన్నంత పతాకగా ఎగరేసిన గజల్ చక్రవర్తి సినారె. ఉర్దూలో చదువుకున్న ఈ మహాకవులు ఇద్దరు తెలుగు గజల్‌కు తెరచాపలెత్తారు.
సినారె “ఒక కమనీయ కవితాలహరి. ఒక గులాబీ గుచ్ఛం. ఒక మత్తకోకిల రసాత్త కూజితం” అంటారు గజల్‌ను. ఇటు ఉర్దూలోనూ, అటు తెలుగులోనూ గజల్స్ రచించి గానం చేశారు. అనేక చలనచిత్రాల్లో జావళి, గజల్స్‌ని సందర్భానుసారంగా పొందుపరిచారు. అనేక గీతాలను గజల్, రుబాయి లక్షణాలతో నడిపించారు కూడా. ‘పరుల కోసం పాటుపడని నరుని బ్రతుకు దేనికని/ మూగనేలకు నీరందివ్వని వాగు పరుగు దేనికిని’, ‘అమ్మ ఒకవైపు, దేవతలంతా ఒకవైపు’, ‘ఆత్మలను పలికించేదే అసలైన భాష’ వంటి గజల్స్ మనకు తెలిసినవే కదా!
1986లో వచ్చిన ‘సంసారం ఓ సంగీతం’ సినిమాలోనూ, తరువాత 1998లో వచ్చిన ‘తోడు’ సినిమాలోనూ ఒకే గజల్‌ను చేర్చారు. కవిగా సినారె వేలాది గీతాలు రచించారు. ఏ గీతం గొప్పదనం దానిదే! అయితే వాటిలోని పతాక గీతికల్లో ఇదొకటి. “ఇందరు మనుషులు దేవతలైతే/ ఎందుకు వేరే కోవెలలు” గజల్ అర్థవంతంగా సాగుతుంది. దీనిని‘సంసారం ఓ సంగీతం’లో పి.సుశీల గాయం చేయగా, పుహళేంది స్వరపరిచారు. ‘తోడు’లో మంగళంపల్లి బాలమురళీకృష్ణ స్వరపరచగా ఎస్.పి.శైలజ గానం చేశారు. మొదట ఆ గజల్‌ను కళ్లతో చదివి, మనసుతో వినండి.
ఇందరు మనుషులు దేవతలైతే ఎందుకు వేరే కోవెలలు ఇన్ని మనసులు గీతికలైతే ఎందుకు వేరే కోయిలలు పై పంక్తులు ఈ గజల్‌కు మత్లా…
మత్లా అంటే ఆకాశం. నిజానికి ఉర్దూ, పార్శీకాది భాషల్లోని గజల్ ప్రాయికంగా శృంగార పరమైంది. ‘ఇంతులతో మంతనం’ అయిన గజల్‌ను తెలుగులో ప్రగతిశీలం, మానవతావాదం, అభ్యుదయ భావనల వైపు నడిపించారు సినారె. అందుకే మనుషులందరు మానవత్వం, ప్రేమలతో… కుల, మత, వర్ణ, వర్గ, ప్రాంతం లాంటి అసమానతలను రూపుమాపుకొని ‘మనుషులు’గా మారితే వాళ్లే దేవుళ్లు అవుతారు… ఇంక వేరే దేవుళ్లు ఎందుకంటూ చెబుతారు కవి. కవిత్వంలోనూ ఒకచోట “సురలకన్న కరుణాత్ముడు/ నరుడుగాక ఇంకెవ్వడు/ మందిర మెరుగని దేవుడు/ మనిషిగాక ఇంకెవ్వడు” అంటారు. తరువాత షేర్లను చూద్దాం.
దూసిన కొలది దోసిలి చాలదు పరచిన కొలది పానుపు చాలదు ఇన్ని మమతలు ఘుమఘుమలాడగ ఎందుకు వేరే మల్లియలు
సినిమా విషయానికి వస్తే నవతా ఆర్ట్స్ బ్యానర్‌పై ఎన్.కృష్ణంరాజు నిర్మించిన ఈ చిత్రానికి రేలంగి నరసింహరావు దర్శకత్వం వహించారు. చంద్రమోహన్, విజయశాంతి ఇందులో ప్రధాన తారాగణం. శరత్‌బాబు, రాజేష్, పూర్ణిమ, స్వప్న ఇతర నటీనటులు. మానవ స్వభావాన్ని ‘దూసిన కొలది దోసిలి చాలదు’లో చూపించిన కవి సినారె, మమతలను మించిన మల్లియలు లేవంటారు.
దయ కురిపించే తలపే తీయన
లయ పలికించే చూపే తీయన
ఇన్ని మధురిమలు ఎదలో నిండగ
ఎందుకు వేరే తేనియలు
సినిమా గీతంగా మాట్లాడుకుంటున్న సందర్భంలో ఈ గజల్లోని రదీఫ్ ఖాఫియాల గురించి చర్చించను. దయ కురిపించే తలపు, లయ పలికించే చూపు తీయనిదని చెప్పిన కవి… ఎదనిండా అనేకానేక మధురిమలు నిండగా వేరే తేనియలు ఎందుకు? అవసరం లేదు అంటారు. కింది ‘మక్తా’లో కవి నామముద్ర ‘సినారె’ను చూడవచ్చు. ఇంకా సినారె అలసినప్పుడు రాగమాలికలు చల్లని గాలులై ఊయలలూపగా వేరే ఊయలలు ఎందుకంటారు. ‘మక్తా’ అంటే జాగీరు. ఇది కవి జాగీరు కాబట్టి తన పేరును అంటే సినారె అనే ‘తఖల్లుస్’ను నిక్షిప్తం చేశారు.
అలసిన వేళ చలువ జోలలై
తలచిన వేళ రాగమాలలై
ఇన్ని గాలులు ‘సినారె’ను ఊపగ
ఎందుకు వేరే ఊయలలు.
మొదటగా ఈ గజల్‌ను చేర్చిన ‘సంసారం ఓ సంగీతం’ చిత్రంలో ఎలాంటి మార్పులేకుండా పూర్తిగా ఉంచారు. తరువాత నిర్మించిన ‘తోడు’ చిత్రంలో ఈ గజల్‌ను చేర్చినప్పుడు చివరి మిస్రాలోని ‘ఇన్ని గాలులు ‘సినారె’ను ఊపగ / ఎందుకు వేరే ఊయలలు’కు బదులు కింది పంక్తులను చేర్చారు.
ఇన్ని కనులు నా ఇంట వెలుగగ ఎందుకు వేరే వెన్నెలలు మొదటి సినిమా కోసం చేర్చినప్పుడు ‘ఎందుకు వేరే ఊయలలు’ అన్న సినారె, తరువాత ‘ఇన్ని కనులు నా ఇంట వెలుగగ/ఎందుకు వేరే వెన్నెలలు’ అంటారు విశేషంగా. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ గజల్ మనిషిని మిన్నంతగా చెప్పిన రచనేకాదు, మానవతకు మణి పతాక… పతాక గీతం కూడా!
-పత్తిపాక మోహన్