హైదరాబాద్, మార్చి2 (నమస్తే తెలంగాణ) : నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెరలో జరిగిన పసికందు హత్య, బీసీ కుటుంబంపై జరిగిన దాడి ఘటనపై కలెక్టర్, తహసీల్దార్ నివేదికలనే ఉటంకిస్తూ రాష్ట్ర బీసీ కమిషన్ పరోక్షంగా నిందితులకే వత్తాసు పలుకుతున్నట్టుగా తేలిపోయింది. కమిషన్ సోమవారం విడుదల చేసిన పత్రిక ప్రకటనలోని అంశాలు అదే విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి. బాధితులను గది లో నిర్బంధించి, దాడి చేసిన సాక్ష్యాలు కండ్ల ముందే ఉన్నా.. ఆ వీడియోలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నా.. కమిషన్ మాత్రం వాటిని పరిగణనలోకే తీసుకోలేదు. బాధితులు బీసీలు కావడంతో కమిషన్ హడావుడిగా స్పందించినట్టుగా తెలుస్తున్నది. మల్లన్న జాతరలో వెలుగుచూసిన బీసీ కుటుంబంపై దాడి ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.
ఈ ఘటనకు సంబంధించి నివేదికను సమర్పించాలని కలెక్టర్‌ను కమిషన్ ఆదేశించింది. అదీగాక కమిషన్ చైర్మ న్ నిరంజన్, సభ్యులు 24న గ్రామాన్ని స్వయంగా సందర్శించి, బాధితులతో మాట్లా డి వివరాలు తెలుసుకొన్నారు. కానీ దానిపై స్పందించనేలేదు. తాజాగా కమిషన్ కేవలం కలెక్టర్ నివేదికనే ఉటంకిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. అందులోని అంశాలను పరిశీలిస్తే నిందితులకు పరోక్షంగా కమిషన్ సైతం వత్తాసు పలుకుతున్నదని స్పష్టంగా తెలిసిపోతున్నది. చిన్నారి తండ్రికి లక్ష ఆర్థికసాయం, ఔట్సోర్సింగ్ ఉద్యోగంతోపాటు, డబుల్ బెడ్రూం ఇల్లు, అన్నిరకాల వైద్య వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చినట్టుగా వెల్లడించింది.
తొలుత నిందితులు, ఆ తర్వాత బాధితులు పరస్పరం ఠాణాలో ఫిర్యాదు చేసుకోగా, కేసులు నమోదయ్యాయని, పసిపాప తల్లి స్టేట్మెంట్ ప్రకారమే అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసినట్టు కలెక్టర్ నివేదికలో వెల్లడించారని కమిషన్ ఉటంకించింది. ముగ్గురు నిందితులను అరెస్టు చేయగా, ఆరుగురు పరారీలో ఉన్నారని కలెక్టర్ రిపోర్టులో వెల్లడించారని కమిషన్ తెలిపింది. ఇదిలా ఉంటే బాధితురాలు మౌనిక తన కులాన్ని నిర్ధారించుకొనేందుకు ఎలాంటి సర్టిఫికెట్లను ఇప్పటివరకు అందజేయలేదని, కానీ మహమ్మదాబాద్ తహసీల్దార్ మాత్రం మౌనిక తల్లి బాలక్రిష్ణమ్మ పిచ్చగుంట్ల (వంశరాజ్) కులానికి చెందినట్టుగా నిర్ధారించారని కలెక్టర్ నివేదించినట్టు తెలిపింది. ఘటనలో మృతి చెందిన పాప సైతం గత డిసెంబర్ 21 నుంచి ఈ ఏడాది జనవరి 21 వరకు హైదరాబాద్ నిలోఫర్ దవాఖానలో చికిత్స పొందినట్టు కలెక్టర్ తన రిపోర్టులో పేరొన్నారని కమిషన్ వివరించింది. మొత్తంగా కలెక్టర్ నివేదికలోని అంశాలకే కమిషన్ పరిమితమైంది తప్ప.. ఘటనపై బీసీ కమిషన్ సొంతంగా పరిశీలించిన అంశాలను మాత్రం ఎక్కడా వెల్లడించలేదు, ప్రస్తావించలేదు. ప్రభుత్వం, పోలీసుల తరహాలోనే కమిషన్ సైతం నిందితులకే వత్తాసు పలుకుతున్నట్టు స్పష్టంగా తెలిసిపోతున్నది.