న్యూఢిల్లీ: గాజా యుద్ధం కోసం భారతీయ కంపెనీలు సుమారు 2596 ఆయుధ షిప్మెంట్లను ఇజ్రాయల్‌కు పంపినట్లు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్(Amnesty International) పేర్కొన్నది. గురువారం దీనికి సంబంధించిన రిపోర్టును రిలీజ్ చేసింది. ఇండియా నుంచి ఇజ్రాయెల్‌కు సుమారు 2500పైగా ఆయుధాలను సరఫరా చేసినట్లు ఆ నివేదికలో వెల్లడించారు. దీని వల్ల గాజాలో మారణహోమం పెరిగే అవకాశాలు ఉన్నట్లు కూడా రిపోర్టులో అభిప్రాయపడ్డారు. 2023 అక్టోబర్ 7వ తేదీ నుంచి వివిధ కంపెనీలు భారత్ నుంచి ఇజ్రాయెల్‌కు ఆయుధాలను సరఫరా చేసినట్లు రిపోర్టులో వెల్లడించారు. పాలస్తీనియన్లపై మారణహోమం జరిగే అవకాశాలు ఉన్నా.. భారత్ మాత్రం తమ ఆయుధాలను ఇజ్రాయెల్‌కు అందజేస్తున్నట్లు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ పేర్కొన్నది.
ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని ఇజ్రాయెల్‌కు పంపడం వల్ల.. ఆ దేశంతో భారత్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. షిప్మెంట్ స్థాయి వాణిజ్యానికి చెందిన డేటాను రిపోర్టులో రిలీజ్ చేశారు. భారత కంపెనీలు తమ ఆయుధాలను, అమ్యూనిషన్, విడిభాగాలను ఇజ్రాయిలీ కంపెనీలకు షిప్పింగ్ చేసినట్లు రిపోర్టులో పేర్కొన్నారు. ఆ ఇజ్రాయిలీ కంపెనీలు ఆ దేశ మిలిటరీకి ఆ ఆయుధాలను సరఫరా చేస్తాయి. ఇజ్రాయిలీ మిలిటరీ, డిఫెన్స్ రంగానికి ఇండియా సహకరిస్తున్నట్లు మా అధ్యయనంలో తేలిందని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సెక్రటరీ జనరల్ ఆగ్నెస్ కల్లామార్డ్ తెలిపారు.
ఇజ్రాయెల్‌కు ఆయుధాలు, అమ్యూనిషన్ను సరఫరా చేయడాన్ని తక్షణమే నిలిపివేయాలని భారత ప్రభుత్వాన్ని కోరినట్లు నివేదికలో తెలిపారు. 2596 షిప్మెంట్లలో భాగంగా సుమారు 3,90,516 మిలిటరీ గ్రేడ్ స్మాల్ ఆర్మ్స్ పార్ట్స్, 5,64,970 ఎక్స్‌ప్లోజివ్ ఆర్డినాన్స్ ఉన్నాయి. వీటిల్లో డ్రోన్ వార్‌హెడ్స్, ఆర్టిల్లరీ షెల్స్ కేసింగ్స్ ఉన్నాయి. మిలిటరీ వెహికిల్స్‌కు చెందిన 298 కాంపోనెంట్స్ కూడా సరఫరా జాబితాలో ఉన్నాయి. 155 ఎంఎం హై ఎక్స్‌ప్లోజివ్ ఆర్టిల్లరీ షెల్స్‌ను ఎల్బిట్ సిస్టమ్స్‌కు సరఫరా చేస్తుంది. పీఎల్ఆర్ సిస్టమ్స్ ప్రైవేటు లిమిటెడ్, అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్, కళ్యాణి సిస్టమ్స్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీలు భారత్ నుంచి ఆయుధాలను సరఫరా చేశాయి. ఎల్బిట్ సిస్టమ్స్, రఫేల్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్స్, ఇజ్రాయిల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌కు చెందిన ఇజ్రాయిలీ కంపెనీలకు సామాగ్రిని సరఫరా చేశారు.