Shehzad Poonawalla : బీజేపీ కీలక నేత, ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా బీజేపీకి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో ఆయన తన రాజీనామా సమర్పించినట్లు సమాచారం. ఈ మేరకు బీజేపీ అగ్రనాయకత్వానికి తన రాజీనామా లేఖ అందజేశారు. షెహజాద్ పూనావాలా బీజేపీకి అధికార ప్రతినిధిగా ఉంటూ, టీవీ చర్చల్లో ఆ పార్టీ తరఫున గళం వినిపిస్తుంటారు. అనేక రాజకీయ అంశాల్లో బీజేపీని, మోదీని సమర్ధిస్తూ పార్టీకి అండగా నిలిచారు. ఇటీవల తన సోషల్ మీడియా ఖాతాలో ఆయన రాజకీయ విషయాలు, భవిష్యత్ ప్రణాళికల గురించి వివరించారు.
18, 19 ఏళ్లుగా తాను ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నానని చెప్పారు. ఇన్నేళ్లుగా తాను అనుకున్నది సాధించానని కూడా తెలిపారు. ‘‘దాదాపు 18-19 ఏళ్లుగా నేను రాజకీయాల్లో ఉన్నాను. చాలా యంగ్ ఏజ్‌లోనే రాజకీయాల్లోకి వచ్చి, ఇప్పటికి దాదాపు 19 ఏళ్లు పూర్తయ్యాయి. రాజకీయాల్లో నేనేం కావాలనుకున్నానో అది సాధించాననే అనుకుంటున్నాను. 2024లో ప్రధాని మోదీ మూడోసారి ప్రధాని అయినప్పుడే నేను రాజకీయాల్లోంచి తప్పుకోవాలని భావించాను’’ అని పూనావాలా తెలిపారు. 2024 తర్వాత తనతోపాటు మరికొందరు కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు చెప్పారు. రాజకీయాల నుంచి తప్పుకొనే ముందు రాబోయే కొన్ని ప్రధాన ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ కోసం పని చేయాలని నిర్ణయించుకున్నామన్నారు. తన రాజీనామా అనంతరం పూనావాలా తన ఎక్స్ ఖాతాలో బయో కూడా మార్చుకున్నారు.
ఇందులో లైఫ్‌లాంగ్ ఫాలోవర్ ఆఫ్ పీఎం మోదీ అని ఉంచుకున్నారు. అయితే, బీజేపీ గురించి మాత్రం ప్రస్తావించలేదు. అయితే, ఆయన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో మాత్రం ఇంకా బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి అనే ఉంది. పూనావాలా రాజీనామా చేసినట్లు తెలుస్తున్నా.. అటు ఆయన నుంచి.. ఇటు పార్టీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. 38 ఏళ్ల వయసున్న పూనావాలా గతంలో కాంగ్రెస్ పార్టీలో పని చేశారు. లాయర్ కూడా అయిన ఆయన 2017లో కాంగ్రెస్ రెబల్‌గా మారారు. అనంతరం బీజేపీలో చేరారు.