హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబరు 9 (నమస్తే తెలంగాణ ) : ఓ భవన నిర్మాణ సంస్థ నిర్లక్ష్యంతో ఓ మాజీ ఎంపీ కుమారుడికి తృటిలో పెనుప్రమాదం తప్పింది. ఎందరో విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ప్రమాదం పొంచి ఉన్నది. ధనార్జనే ధ్యేయంగా, కనీస నిబంధనలు, భద్రతా ప్రమాణాలు పాటించకుండా బడా నిర్మాణ సంస్థలు చేపడుతున్న నిర్మాణ పనులు అభం, శుభం తెలియని ప్రజల ప్రాణాలకు పెను ముప్పుగా మారాయి. ఆ నిర్మాణ సంస్థ ఆగడాలకు బుధవారం చోటుచేసుకున్న కొండాపూర్ ఘటనే సజీవ సాక్ష్యం. కనీస భద్రతా ప్రమాణాలు పాటించకుండా, నిబంధనలను కాగితాలకే పరిమితం చేస్తూ క్యాండియర్ భవన నిర్మాణ సంస్థ చేపడుతున్న 50 అంతస్తుల భారీ హైరైజ్ భవన నిర్మాణం ఇప్పుడు వందలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నది.
కొండాపూర్‌లో ఓ ప్రముఖ సూల్ను ఆనుకుని ఆకాశమే హద్దుగా క్యాండియర్ సంస్థ 50 అంతస్తుల భారీ భవనాన్ని నిర్మిస్తున్నది. విద్యార్థులు నిత్యం తిరిగే పరిసరాల్లో అంతటి ఎత్తైన భారీ నిర్మాణం జరుగుతున్నప్పుడు చుట్టూ ప్రాపర్ నెట్టింగ్ (సేఫ్టీ నెట్లు), కాంబో షీట్లు, కనీస భద్రతా వలయాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కానీ, సదరు నిర్మాణ సంస్థ బాధ్యతారాహిత్యంతో ఎటువంటి భద్రతా చర్యలు తీసుకోకుండా పనులు కొనసాగిస్తున్నది. దీనిపై సూల్ యాజమాన్యం, తల్లిదండ్రులు పలుమార్లు టౌన్ ప్లానింగ్ అధికారులకు మొరపెట్టుకున్నా, వారు మామూళ్ల మత్తులో ఊగుతూ పెడచెవిన పెడుతూ వచ్చారు. నిర్మాణ సంస్థ, టౌన్‌ప్లానింగ్ అధికారుల నిర్లక్ష్యానికి బుధవారం జరిగిన ఘటన పరాకాష్టగా నిలిచింది.
నిర్మాణంలో ఉన్న ఆ భారీ భవనం పైనుంచి ఒకసారిగా భారీ సిమెంట్ రాయి కింద పడింది. సరిగ్గా అదే సమయంలో సూల్లో విద్యార్థిని దింపడానికి వచ్చిన ఒక కారుపై ఆ రాయి పడటంతో, ఆ వాహనం సన్ రూఫ్ లగేజీ సీటు వరకు పూర్తిగా ధ్వంసమైంది. కారులో ఉన్న విద్యార్థి (ఓ ఎంపీ కుమారుడు), డ్రైవర్ తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఒకక్షణం తేడా జరిగి ఉంటే అకడ స్కూల్ విద్యార్థి ప్రాణం గాలిలో కలిసిపోయేది. ఈ ఘటనతో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ప్రాణనష్టం తప్పినప్పటికీ, నిత్యం వేలాది మంది ప్రయాణించే ప్రధాన రహదారిపై ఈ తరహా ప్రమాదాలు జరుగడంపై స్థానికులు, విద్యార్థులు, పేరెంట్స్ ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
వాహన డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు నిర్మాణ సంస్థ యాజమాన్యంపై బీఎన్ఎస్ సెక్షన్లు 125, 324(4) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బుధవారం జరిగిన ఘటన అనంతరం తీవ్ర విమర్శలు రావడంతో టౌన్‌ప్లానింగ్ అధికారులు ఆలస్యంగా మేల్కొన్నారు. నిర్మాణ సంస్థ నిర్లక్ష్యంపై సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సరిల్-49, శేరిలింగంపల్లి) అసిస్టెంట్ సిటీ ప్లానర్ షోకాజ్ నోటీసు (నంబరు 1/టీపీఎస్)సీ 49) జారీచేశారు. నోటీసులో పేర్కొన్న ప్రకారం 50 అంతస్తుల భారీ నిర్మాణం చేపడుతున్నప్పటికీ తగిన సేఫ్టీ నెట్లు, ప్రొటెక్టివ్ స్రీన్లు, వ్యర్థాలు కింద పడకుండా చూసే వ్యవస్థలను ఏర్పాటు చేయలేదని నోటీసులో పేర్కొన్నారు.