రాష్ట్రంలో సామాన్యుడిని భయకంపితులను చేస్తున్న 22ఏ నిషేధిత జాబితా వెనుక భారీ కుట్ర దాగి ఉన్నదా? ఇటీవలే ఇది తెరపైకి వచ్చినట్టు కనిపిస్తున్నా.. భూకంపాన్ని సృష్టించేందుకు చేపట్టిన చర్యలు ఏడాది కిందటే మొదలయ్యాయా? హైదరాబాద్ మహానగరంలోని యూఎల్సీ, అసైన్డ్, పెండింగ్‌లోని సీలింగ్ భూములను కొల్లగొట్టేందుకు ప్రభుత్వ పెద్దలు పెద్ద ఎత్తున స్కెచ్ వేశారా? ఈ నిషేధిత భూకంపం బయటికొచ్చిన రోజు నుంచి కాంగ్రెస్ ప్రభుత్వంలో మొదలైన ప్రకంపనలు.. సర్కార్ పెద్దల తీరు చూస్తుంటే నిజమే అనిపిస్తున్నది.
హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వేలాది ఎకరాలను కొల్లగొట్టేం దుకు జరిగిన ప్రయత్నంలో భాగంగా, ప్రభుత్వ పెద్దల ఆదేశంతోనే రెవెన్యూ శాఖ 22ఏ తేనెతుట్టెను కదిపినట్టు విశ్వసనీయంగా తెలిసింది. తీరా.. కుట్ర ఎదురుతన్ని, చివరకు లక్షలాది మంది సామాన్యుల ఆస్తులపై నిషేధిత కత్తి వేలాడిం ది. ఈలోగా అనేకమంది ప్రముఖుల ఆస్తులు, భూములు కూడా నిషేధిత జాబితాలో ఉండటంతో వాళ్లంతా ప్రభుత్వ పెద్దలకు సమాచారమివ్వడంతో కాంగ్రెస్ ప్రభుత్వం దిక్కుతోచని పరిస్థితిలో పడిపో యింది. దీంతో రెవెన్యూ శాఖ మంత్రి తనకేమీ తెలియదన్నట్టు అధికారులపైకి నెపం నెట్టేశారు.
ఆ ఫ్రస్ట్రేషన్లో కలెక్టర్లు మొదలు తాసిల్దార్ల వరకు ఇష్టానుసారం దూషించారు. ఇదే క్రమంలో రాష్ట్రంలోని సామాన్యుల ఆస్తులకు పెను ముప్పుగా పరిణమించిన నిషేధిత జాబితా గుట్టును బీఆర్ఎస్ పార్టీతోపాటు మీడియా బయటపెట్టడంతో సర్కార్‌లో అలజడి మొదలైంది. ఒకవైపు 22ఏ వెనుక ఉన్న కుట్ర ఎక్కడ బయటపడుతుందోనన్న ఆందోళన, మరోవైపు జనబాహుళ్యంలోకి వెళ్లిన నిషేధిత జాబితాను సర్దుబాటు చేయలేని పరిస్థితితో కాంగ్రెస్ ప్రభు త్వం ప్రజల్లో అభాసుపాలైంది. ఇదే సమయంలో అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యా యి.
‘నిషేధిత జాబితా భూకంపం’తో అసెంబ్లీని కుదిపేసేందుకు బీఆర్ఎస్ అస్త్రశస్ర్తాలను సిద్ధం చేసుకున్నట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు ప్ర భుత్వానికి ఉప్పందించాయి. 22ఏ సమస్యపై క్షేత్రస్థాయిలోని వాస్తవాలు, ప్రజల్లో నెలకొన్న తీవ్ర అసంతృప్తిపై ఇంటెలిజెన్స్ ఏకంగా 32 పేజీల నివేదికను అందించినట్టు విశ్వసనీయం గా తెలిసింది. 22ఏ భూకంపం శాసనసభలోకి వచ్చినట్టయితే ప్రజల్లో పరువుపోయి పలుచనవుతామనే భయంతోనే పకడ్బందీగా స్కెచ్ వేసి, సమావేశాల తొలిరోజునే అసెంబ్లీ గేటు ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులతో నిలువరించి, ఉద్దేశపూర్వకంగా రచ్చ సృష్టించినట్టు తెలుస్తున్నది. ఆ ఘటనపై విచారణ చే యిస్తున్నట్టు ప్రకటించి ప్రజల దృష్టిని 22ఏ నుంచి మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నది.
నిషేధిత భూకంపం ఎలా పుట్టింది?
వ్యవసాయ భూములు, వ్యవసాయేతర ఆ స్తుల క్రయ విక్రయాలకు సంబంధించిన ప్రక్రియలో నిషేధిత జాబితా అనేది ఉమ్మడి రాష్ట్రం లో నుంచి కూడా వస్తుంది. బీఆర్ఎస్ హ యాంలోనూ.. ధరణి వచ్చిన తర్వాత కూడా 22ఏ జాబితా కొనసాగుతూనే ఉన్నది. ప్రధానంగా ప్రభుత్వ, అటవీ, దేవాదాయ, అసైన్డ్ తదితర భూములను ఎవరూ కొల్లగొట్టకుండా ఉండేందుకు ఈ జాబితా అస్త్రంగా వస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తొలినాళ్లలోనూ ఇదే జాబితా కొనసాగింది. దీంతో రాష్ట్రంలో ఎక్కడా సామాన్యుల ఆస్తులకు ఎలాంటి ఇ బ్బంది కలుగలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం తామేదో అద్భుతంగా తీసుకొస్తామని ప్రకటనలు చేసిన భూభారతితో ఈ భూకంపం మొదలైంది.
గతేడాది చివరలో 22ఏ నిషేధిత జాబితాను కొత్తగా రూపొందించింది. అంతకు కొన్ని నెలల ముందే ప్రభుత్వ పెద్దల నుంచి రెవెన్యూ శాఖకు వెళ్లిన మార్గదర్శకాలతో ఈ జాబితా రూపొందించినట్టు విశ్వసనీయవర్గాలు చెప్తున్నాయి. గతంలోని జాబితాను కొనసాగించడమో, లేదా ఎక్కడైనా ప్రభుత్వ భూ ములు, ఆస్తులు ఆ జాబితాలో లేనట్టయితే వాటిని చేర్చడమో వరకు పరిమితమైతే సరిపోయేది. కానీ పూర్తిస్థాయిలో జాబితాను ఎందుకు కదిపారనేదే ఇక్కడ కీలకమైన అంశం.
దీనిపై లోతుల్లోకి వెళ్లి విచారిస్తే.. రెండేండ్లుగా ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల వెలుగులోకి వచ్చిన వందల ఎకరాల భూ దందాలు, భూములు కేంద్రంగా జరుగుతున్న అనధికారిక ఒప్పందాలతో.. 22ఏ జాబితా మార్పులకు లింకు ఉన్నట్టుగా రిటైర్డ్ రెవెన్యూ అధికారులు స్పష్టంచేస్తున్నారు. కాంగ్రెస్ గద్దెనెక్కిన తర్వాత హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి, యాదాద్రి-భువనగిరి జిల్లాల్లోని అసైన్డ్, సీలింగ్, యూఎల్సీ, ప్రభు త్వ భూముల దందాలు అనేకం బయటికొచ్చాయి. ఏడాది, ఏడాదిన్నర నుంచి ఇప్పటివరకు వేలాది ఎకరాల అసైన్డ్ భూములపై అనధికారిక ఒప్పందాలు పూర్తయ్యాయి.
రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల పరిధుల్లో దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న సీలింగ్ భూ ముల ఫైల్స్‌కు రెక్కలొచ్చాయి. రాత్రికి రాత్రి ప్రైవేట్ వ్యక్తులకు అనుకూలంగా ఉత్తర్వులు రావడం, ఆ భూములను ప్రైవేట్ వ్యక్తులు స్వా ధీనంలోకి తీసుకోవడం జరిగిపోయాయి. ఇలా వేల ఎకరాల్లో ప్రభుత్వ, అసైన్డ్, సీలింగ్ భూములను కొట్టేయడం వెనుక సర్కార్ పెద్ద లు కదుపుతున్న పావులను ‘నమస్తే తెలంగా ణ’ ఆధారాలతో వెలుగులోకి తీసుకొచ్చింది. ఈ అక్రమాలన్నింటికీ సక్రమం ముసుగు తగిలించేందుకు ప్రభుత్వ పెద్దలు పావులు కదిపారని, 22ఏ నిషేధిత జాబితాను కొత్తగా రూపొందించే ప్రక్రియను రెవెన్యూ శాఖ భుజాన పెట్టారని ఆ శాఖ వర్గాలు అనుమానిస్తున్నాయి. అదికాస్తా బూమరాంగ్ అయి సామాన్యుల ఆస్తులు సైతం ఆ జాబితాలోకి చేరడంతో ఒక్కసారిగా భూకంపం మొదలైంది.
ధ్యాసంతా భూ దందాలపైనే..
నిషేధిత జాబితా కుట్రను ‘నమస్తే తెలంగాణ’ మొదట్లోనే గుర్తించింది. కోటి ఎకరాలు అంటే రాష్ట్రంలో మూడింట ఒక వంతు భూ ములపై నిషేధిత కత్తి వేలాడుతుందనే వాస్తవాన్ని డిసెంబర్లోనే వెలుగులోకి తెచ్చింది. ఆపై నాలుగైదు నెలలుగా నగరంలోని అనేక కాలనీలు నిషేధిత జాబితాలోకి చేరాయనే కథనాలను ప్రచురించింది. దశాబ్దాల కిందట నిర్మించుకున్న ఇండ్లను కూడా యూఎల్సీ పేరి ట రిజిస్ట్రేషన్లు కాకుండా నిషేధిత జాబితాలో చేర్చారని ప్రజలకు వివరించింది. కానీ సర్కార్ పెద్దల ఆలోచన, కుట్రలు ప్రజల కోణంలో కా కుండా అందుకు భిన్నంగా ఉండటంతో వీటన్నింటినీ పట్టించుకోలేదు. పైగా తమ కార్యాల ను చక్కబెట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు.
ముఖ్యంగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కొన్ని నెలల కిందట చేసిన ప్రకటన ఇందుకు నిదర్శనం. రాష్ట్రంలో 80వేల ఎకరాల అసైన్డ్ భూములకు సంబంధించిన యాజమాన్యాలకు ఊరట కల్పించేందుకు చర్యలు చేపట్టబోతున్నామని స్పష్టంచేశారు. అంటే అసైన్డ్ భూములను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుందనే సంకేతాన్నిచ్చారు. ఒకవైపు ప్రజలు తమ ఆస్తులు నిషేధిత జాబితాలో పడి అల్లాడిపోతుంటే, మంత్రి మాత్రం అసైన్డ్ భూముల క్రమబద్ధీకరణ అంశంపై సంకేతాలివ్వడం గమనార్హం. అంతేకాదు.. ‘నమస్తే తెలంగాణ’ వెలుగులోకి తెచ్చి రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన నాదర్గుల్ భూములను క్లియర్ చేసేందుకు పావులు కదుపుతున్నారనే సమాచారం వస్తున్నది.
దీని ని బట్టే ప్రభుత్వంలో భూ దందాలకు ఎంత ప్రాధాన్యం ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు సామాన్యులతోపాటు అనేక మంది ప్ర ముఖుల ఆస్తులు కూడా నిషేధిత జాబితాలో కనిపించడంతో వారంతా ప్రభుత్వ పెద్దలకు స మాచారం ఇచ్చారు. మీడియాలోని ఒక ప్రముఖుడి భూములతోపాటు ‘ముఖ్యనేత’ సమీప బంధువుకు చెందిన భూములు కూడా 22ఏ లో పడినట్టు ‘ముఖ్యనేత’ దృష్టికి వెళ్లాయి. ఈలోగా బీఆర్ఎస్ 22ఏ జాబితాపై ప్రజల్లోకి వెళ్లడంతోపాటు బాధితులు తెలంగాణభవన్‌కు క్యూ కట్టి మరీ ఫిర్యాదులు ఇవ్వడంతో సర్కార్ ఉలిక్కిపడింది.
ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన మంత్రి ఆ నెపాన్ని అధికారులపైకి నెట్టారు. యూఎల్సీ భూములను క్రమబద్ధీకరించేందుకు పథకాన్ని తీసుకువస్తామని మరో సంకేతాన్నిచ్చారు. ముందుగా ప్రజల సమస్యలకు పరిష్కారంపై దృష్టిసారించాల్సిన వారు ఇలా క్రమబద్ధీకరణ పథకాల వెంట పడటమంటేనే, దీని వెనుక భారీ కుట్ర ఉన్నదనే ఆరోపణలకు మరింత బలాన్ని చేకూర్చినట్టయింది. హైదరాబాద్‌లోనే కాదు అన్ని జిల్లాల్లోనూ ఈ సమస్య పెనుభూతంలా మారింద నే వాస్తవాలు వెలుగులోకి రావడం.. రైతులు, సామాన్యులు పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు వెళ్లి తమ ఆస్తులు, భూములు జాబితాలో ఉన్నాయా? లేదా? అని పరిశీలించుకోవడంతో గందరగోళం నెలకొన్నది.
అసెంబ్లీ నేపథ్యంలో ఇంటెలిజెన్స్‌తో నివేదిక
రాష్ర్టాన్ని 22ఏ నిషేధిత భూకంపం కుదిపేస్తున్న క్రమంలో ప్రజల్లోకి వెళ్లిన బీఆర్ఎస్ అన్నిరకాల ఆధారాలు సేకరించింది. సామాన్యుడి గోసతోపాటు దీని వెనక కుట్రలో భాగం గా సర్కార్ పెద్దలు ఎలాంటి భూదందాలకు తెరతీశారు? వాటికి పరిష్కారాన్ని చూపాలనుకునే క్రమంలో 22ఏ నిషేధిత జాబితా కత్తి సామాన్యుడి ఆస్తుల మీదికి ఎలా వచ్చింది? అనే వివరాలన్నింటినీ సేకరించారు. అసెంబ్లీ సమావేశాలు జరుగనున్న నేపథ్యంలో, శాసనసభ వేదికగానే వీటన్నింటినీ ఎండగట్టి ప్రజల్లోకి తీసుకుపోవడానికి అస్త్రశస్ర్తాలను సిద్ధం చేసుకుంది. బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ హరీశ్‌రావు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. దీంతో ఈ భూకంపం అసెంబ్లీని సైతం కుదిపేస్తుందనేది సర్కార్‌కు అర్థమైంది.
ప్రభుత్వం ఇంటెలిజెన్స్‌తో ఆరా తీయించింది. వారు 32 పేజీల నివేదిక ఇచ్చినట్టు తెలిసింది. ఇందులో 22ఏ సమస్య జనాన్ని ఎలా కుదిపేస్తున్నది.. ప్రజల్లో ఎంతటి ఆందోళన నెలకొన్నది.. ప్రభుత్వం ప్రతిష్ఠ ఏస్థాయి లో దిగజారింది, ప్రజల్లోకి వెళ్లిన బీఆర్ఎస్ ఆధారాలతో అసెంబ్లీ వేదికగా అస్త్రశస్ర్తాలను ఎలా సిద్ధం చేసుకున్నది? ఇలా సమగ్ర వివరాలను పొందుపరిచినట్టు సమాచారం.
ఆ నివేదికతో ఉలిక్కిపడిన ప్రభుత్వం.. అసెంబ్లీ లో 22ఏ రచ్చ మొదలైతే పరువు మరింత దిగజారుతుందని అంచనా వేసినట్టు తెలుస్తున్న ది. కేసీఆర్ అధ్యక్షతన జరిగిన బీఆర్ఎస్ఎల్పీ సమావేశంలోనూ ప్రధానంగా 22ఏ సమస్య తో జనం ఇబ్బందుల పడుతున్న తీరును అ సెంబ్లీలో ప్రస్తావించాలనే మార్గదర్శకాలు రావడంతో ప్రభుత్వ పెద్దలకు విషయం అర్థమైంది. అందుకే సమావేశాలు ప్రారంభం రోజునే నష్టాన్ని నివారించేందుకు పక్కా వ్యూహాన్ని అమలు చేసినట్టు రాజకీయ పరిశీలకులు స్పష్టంచేస్తున్నారు.
గతానికి భిన్నంగా అసెంబ్లీ వద్ద పోలీసులను మోహరించి, గేటు ముందే బీఆర్ఎస్ సభ్యులను నిలువరించగా, అనంతరం జరిగిన పరిణామ క్రమంలో అక్కడ రణరంగం నెలకొన్నది. కాగా బీఆర్ఎస్ సభ్యుల ను గేటు ముందే నిలువరించాలని, ఇందుకోసం ఏమైనా చేయాలంటూ ఒక ‘ముఖ్యనేత’ నుంచి ఓ పోలీసు ఉన్నతాధికారికి ఫోన్ వెళ్లినట్టు ప్రచారం జరుగుతున్నది. చివరికి వారి పంతం నెగ్గించుకున్నారని చెప్తున్నారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమై మూడు రోజులు పూర్తయినా.. రాష్ట్రంలో లక్షలాది మందికి అన్నదాతలకు చెందిన రూ.లక్షల కోట్ల విలువైన ఆస్తులకు సంబంధించి అత్యంత కీలకమైన 22ఏ సమస్య అంశం మాత్రం చర్చకు రాలేదని గుర్తు చేస్తున్నారు.
పక్కా ప్లాన్‌తోనే రచ్చ
శాసనసభ సమావేశాలు ప్రారంభమైన సోమవారం రోజున అసెంబ్లీ గేటు ముందు పోలీసులు అంత హంగామా సృష్టించడం వెనుక ‘22ఏ’ ఉన్నట్టు స్పష్టమవుతున్నది. ఎందుకంటే.. అసెంబ్లీ సమావేశాలకు ప్రతిపక్ష పార్టీల సభ్యులు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో ప్లకార్డులు ప్రదర్శించడం సహజం. ఉమ్మడి రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రతిపక్ష నేతలు తమకు తోచిన రూపాల్లో సభలో ప్రదర్శించేందుకు ప్రయత్నించిన దాఖలాలు అనేకం. ప్రతిపక్ష పార్టీ సభ్యులు అసెంబ్లీ సమావేశాలకు ఎండిన వరి కంకులు, కందిలి, ఖాళీ బిందెలు తీసుకుపోయి తమ నిరసనను తెలిపారు. ఇదే క్రమంలో ఇప్పుడు బీఆర్ఎస్ సభ్యులు వినూత్నంగా నల్ల టీషర్టులు ధరించి, వాటిపై ప్రజాసమస్యలు, ప్రభుత్వం అమలుచేయని హామీలను రాసుకుపోయారు.
ఇలా వ్యవహరించడం ఇది మొదటిది కాదు.. ఇదే చివరిది కూడా కాదు. కానీ గతంలో ఏ ప్రభుత్వాలు కూడా వ్యవహరించని రీతిలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అతిగా స్పందించింది. పక్కా వ్యూహంతో అసెంబ్లీ వద్ద పోలీసులను ముందు పెట్టి రణరంగాన్ని సృష్టించిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం.. కొన్నిరోజులుగా రాష్ర్టాన్ని అట్టుడికిస్తున్న 22ఏ నిషేధిత జాబితానే అనేది బహిరంగ రహస్యమని రాజకీయ విశ్లేషకులు స్పష్టంచేస్తున్నారు. 22ఏ వెనుక దాగి ఉన్న కుట్రలను బీఆర్ఎస్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఆధారాలతో బయటపెడుతుందనే పక్కా సమాచారం ఉన్నందునే సర్కార్ పెద్దలు ముందస్తుగా అప్రమత్తమైనట్లు వివిధ వర్గాల నుంచి వస్తున్న సమాచారం రుజువు చేస్తున్నది.
బీఆర్ఎస్ ఉద్యమంతో సర్కార్ ఉక్కిరిబిక్కిరి
22ఏ నిషేధిత జాబితా రచ్చ వెనుక సర్కార్ పెద్దల కుట్ర ఉన్నదనేది ఇప్పుడు బహిరంగ రహస్యమైంది. అయినా తమ కార్యాన్ని చక్కబెట్టుకోవడంపైనే వాళ్ల దృష్టి అంతా ఉండటంతో పరిష్కార ప్రక్రియ ముందుకు కదలడం లేదు. ఈలోగా రెవెన్యూ శాఖ మంత్రి జిల్లా కలెక్టర్లు మొదలు తహసీల్దార్ల వరకు అధికారులపై తీవ్రస్థాయిలో మండిపడటం, ఇష్టానుసారం దూషించడంతో రెవెన్యూవర్గాల్లో తీవ్ర అసంతృప్తి నెలకొన్నది. నిషేధిత జాబితా రూపకల్పనకు మౌఖికంగా మార్గదర్శకాలు ఇచ్చిన వాళ్లే, ఇప్పుడు నెపాన్ని తమపై నెట్టడంతో అసలు ఏం చేయాలో పాలుపోవడంలేదని అధికారులు వాపోతున్నారు. ఇంకోవైపు బీఆర్ఎస్ ఈ సమస్యపై పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్లడంతో ఇదో ప్రజా ఉద్యమంగా రూపుదిద్దుకున్నది. తమ ఆస్తులపై వేలాడుతున్న కత్తిని తొలగించుకోవాలంటే దరఖాస్తులతో అయ్యే పనికాదని బాధితులు ఓ నిర్ణయానికొచ్చారు. అందుకే బీఆర్ఎస్ ఎత్తుకున్న 22ఏ ఉద్యమానికి పెద్ద ఎత్తున స్పందన రావడంతో రాష్ట్రంలోని ఇతర ప్రతిపక్ష పార్టీలు కూడా అనివార్యంగా ఈ సమస్యపై గళం విప్పాల్సిన రాజకీయ అనివార్యత ఏర్పడింది. ఇదంతా ప్రభుత్వంపై సన్నగిల్లిన విశ్వాసానికి నిదర్శనమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.