హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో పోలీస్ ఉద్యోగాల కోసం లక్షల మంది నిరుద్యోగులు ఎదురుచూస్తున్నప్పటికీ ఇటీవల ప్రకటించిన నోటిఫికేషన్లకు అభ్యర్థుల నుంచి సరైన స్పందన కనిపించడం లేదు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి (టీఎస్ఎల్పీఆర్బీ) ఈ ఏడాది జూలై 29న వివిధ విభాగాల్లో మొత్తం 7,437 పోస్టుల భర్తీకి 4 నోటిఫికేషన్లు జారీచేసింది. వీటిలో 275 ఎస్సై, 23 ఏఎస్ఐ, 7,112 పోలీస్ కానిస్టేబుల్, 27 పోలీస్ కానిస్టేబుల్ మెకానిక్/డ్రైవర్ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల కోసం ఇప్పటివరకు 3,38,336 మంది అభ్యర్థులు మాత్రమే పేర్లు రిజిస్టర్ చేసుకున్నారు.
వారిలో ఫీజు చెల్లించి తదుపరి దశకు వెళ్లిన 2,88,530 మంది అభ్యర్థుల్లో 2,76,085 మంది మాత్రమే ఆన్లైన్ దరఖాస్తులను పూర్తి చేశారు. నోటిఫికేషన్లలో ప్రకటించిన పోస్టుల సంఖ్య తకువగా ఉండటమే ఇందుకు కారణమని తెలుస్తున్నది. దీనితోపాటు ఒక్కో దరఖాస్తుకు వన్‌టైమ్ ఫీజు కింద రూ.1,500 చెల్లించాల్సి రావడంతో ఆర్థిక భారం వల్ల ఒకటి కంటే ఎకువ పోస్టులకు దరఖాస్తు చేయలేకపోయామని చాలా మంది అభ్యర్థులు చెప్తున్నారు. దీంతో దరఖాస్తుల స్వీకరణ గడువును ప్రభుత్వం ఈ నెల 16 వరకు పొడిగించింది. ఇప్పటివరకు దరఖాస్తుదారుల నుంచి వన్‌టైమ్ ఫీజు రూపంలో ప్రభుత్వానికి దాదాపు రూ.50 కోట్ల వరకూ వచ్చినట్టు సమాచారం.
వివిధ విభాగాల్లోని కానిస్టేబుల్ పోస్టులకు గరిష్ఠ వయోపరిమితిని రాష్ట్రప్రభుత్వం మరో మూడు సంవత్సరాలపాటు పొడిగించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌జాజు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఇచ్చిన ఏడేండ్ల వయోపరిమితి సడలింపునకు అదనంగా ఈ మూడేండ్లు జతచేయడంతో, అభ్యర్థులకు లభించే మొత్తం వయోపరిమితి సడలింపు పదేండ్లకు చేరింది.