వెయ్యి రోజుల పాలన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు, విపక్ష బీఆర్ఎస్ నిలదీతలను తప్పించుకునేందుకు కాంగ్రెస్ మళ్లీ కపట నాటకాలకు తెరతీసింది. అధికారం చేపట్టిన నాటి నుంచి ఇప్పటివరకూ అడుగడుగునా దళిత విద్రోహ విధానాలను అమలు చేస్తున్న రేవంత్ ప్రభుత్వం.. డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగా ఉన్నట్టుండి దళితులపై సవతితల్లి ప్రేమను ఒలకబోస్తున్నది. ప్రతిపక్షం సంధిస్తున్న ప్రశ్నల దాడిని తట్టుకోలేక.. బదులివ్వలేక రాజకీయ రక్షణ కోసం నేడు మళ్లీ దళిత నినాదాలకు, ఊకదంపుడు ఉపన్యాసాలకు దిగింది. అంబేద్కర్ ఆశయాలకు రాష్ట్రంలో తూట్లు పొడుస్తూ ఇప్పుడు సుద్దులు చెప్పేందుకు సిద్ధమైంది. చేవెళ్ల డిక్లరేషన్ పేరిట ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడమే గాక, ఇప్పటికే ఉన్న పథకాలకూ మంగళం పలుకుతున్నది. నిధులను విడుదల చేయకుండా నిర్వీర్యం చేస్తున్నది. అదీగాక అట్టడుగు వర్గాలపై అడుగడుగునా అరాచకాలకు పాల్పడుతున్నది. వెయ్యి రోజుల పాలనలో దళితులపై రేవంత్ ప్రభుత్వం సాగిస్తున్న దమనకాండ ఇదీ.
నిరుపేద దళిత కుటుంబాలకు స్వయం ఉపాధిని కల్పించడంలో భాగంగా అప్పటి కేసీఆర్ ప్రభుత్వం ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించింది. దళితబంధు పథకం కింద తొలివిడతలో మొత్తంగా 38,323 దళిత కుటుంబాలను ఎంపిక చేసింది. ప్రభుత్వం తమ ఖాతాల్లో జమ చేసిన రూ.10 లక్షల నిధుల నుంచి చాలా మంది తొలుత రూ.5 లక్షలతో ఒక ఉపాధి యూనిట్‌ను ఏర్పాటు చేసుకొన్నారు. తదనంతరం మిగిలిన రూ.5 లక్షలతో మరో యూనిట్‌ను ఏర్పాటు చేసుకోవాలనుకొన్నారు. అయితే, ఇదే సమయంలో ఎన్నికల కోడ్ వచ్చింది. దీంతో 4-5 వేల మంది లబ్ధిదారులకు సంబంధించిన దాదాపు రూ.240 కోట్ల నిధులు బ్యాంకుల్లోనే ఉండిపోయాయి. ఆ నిధులను ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం విడుదల చేయడం లేదు. మరోవైపు దళితబంధు కింద అందజేసే రూ.10 లక్షల ఆర్థిక సాయాన్ని రూ.12 లక్షలకు పెంచి అంబేద్కర్ అభయహస్తం పేరిట స్కీమ్‌ను అమలు చేస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ బీరాలు పలికింది. ఆ పథకం అమలు చేయకపోవడమే కాకుండా.. ఇప్పుడు ఏకంగా దళితబంధు స్కీమ్‌కే ఎగనామం పెట్టింది.
జనాభా దామాషా ప్రకారం.. ఎస్సీల రిజర్వేషన్లను 18 శాతానికి పెంచుతామని కాంగ్రెస్ హామీనిచ్చింది. ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ఎస్సీలకు 18 శాతం అమలు చేస్తామని, ప్రైవేట్ విద్యాసంస్థల్లో, ప్రభుత్వ ప్రోత్సాహకాలను పొందే పరిశ్రమల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రగల్బాలు పలికింది. కానీ అచరణలో ఆ ఊసే లేకుండాపోయింది. రాష్ట్రంలో రేవంత్ ప్రభుత్వం ఇటీవల ఇంటింటి సర్వేను నిర్వహించింది. దళిత జనాభా 17.46 శాతమని ప్రకటించింది. కానీ దామాషాతో రిజర్వేషన్లను మాత్రం అమలు చేయడం లేదు. 2011నాటి జనాభా లెక్కలతోనే ఎస్సీ రిజర్వేషన్ ఉప వర్గీకరణకు పూనుకున్నది. అదేమంటే దేశవ్యాప్త జనగణన నిర్వహించిన తరువాత అంటూ దాటవేసింది. ప్రస్తుతమున్న 15 శాతం రిజర్వేషన్‌ను ఎస్సీ వర్గాలకు విభజించింది. చట్టం చేసినా కూడా ఇప్పటికీ దాన్ని అమలులోకి తీసుకురాలేదు. స్థానిక సంస్థలకు వర్తింపజేయలేదు. ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు.
విద్యాజ్యోతి పథకం ద్వారా ఎస్సీ విద్యార్థులు పదవ తరగతి పాసైతే రూ.10 వేలు, ఇంటర్ పాసయితే 15 వేలు, డిగ్రీ పూర్తి చేస్తే 25వేలు, పీజీ పూర్తి చేస్తే రూ.లక్ష, ఎంఫిల్, పీహెచ్డీ పూర్తి చేస్తే రూ.5 లక్షలు అందజేస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ చెప్పింది. కానీ ఈ హామీలు కూడా అమలుకు నోచుకోలేదు. అదీగాక ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలనూ సర్కార్ విడుదల చేయడం లేదు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన అనంతరం రాష్ట్రవ్యాప్తంగా దళిత, గిరిజనులపై ఏటికేడు దాడులు పెరిగిపోతున్నాయి. కేసుల నమోదు సంఖ్య అంతకంతకూ రెట్టింపవుతున్నాయి. అదే సమయంలో కేసుల విచారణ ప్రక్రియ మరింత వెనకబడుతున్నది. కేసులన్నీ కోర్టుల్లోనూ, విచారణ దశలోనే మగ్గిపోతుండడం విచారకరం. బాధితులకు పరిహారం చెల్లించకుండా రెండున్నరేండ్లుగా అట్రాసిటీ చట్టానికీ సైతం కాంగ్రెస్ సర్కారు తూట్లు పొడుస్తున్నది. ఏకంగా జాతీయ ఎస్సీ కమిషన్ తలంటినా కూడా రేవంత్ సర్కారులో ఏమాత్రం చలనం లేకపోవడం గమనార్హం. నమోదవుతున్న కేసుల కంటే.. నమోదు చేయకుండా కాంగ్రెస్ నేతలే ఎక్కడికక్కడ పంచాయితీలు పెడుతూ, పలుకుబడిని ఉపయోగిస్తూ కేసుల నమోదును సైతం అడ్డుకుంటున్న దుస్థితి అంతటా కనిపిస్తుండటం దళిత వర్గాలపై కాంగ్రెస్ దగాకోరు రాజకీయాలకు నిదర్శనంగా మారింది.
దళితులపై కాంగ్రెస్ చిత్తశుద్ధి ఏపాటిదో ఎస్సీ అభివృద్ధిశాఖలో అధికారుల నియామకాలను చూస్తేనే తెలిసిపోతుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత ఎస్సీ కార్పొరేషన్ సెక్రటరీ పదవి దాదాపు సగం కాలం ఖాళీగానే ఉంది. ఇన్చార్జులు పాలనతోనే నెట్టుకొచ్చారు. ఇటీవలనే సెక్రటరీగా విజయేంద్రబోయిని నియమించారు. ఎస్సీ వెల్ఫేర్ కమిషనర్‌గా ఆమెకే అదనపు బాధ్యతలను అప్పగించారు. ఇక ఎస్సీ గురుకుల సెక్రటరీగా ఆ సొసైటీ చరిత్రలోనే ఎన్నడూ లేనివిధంగా కనీసం గ్రూప్-1 ఆఫీసర్‌ను కూడా సర్కార్ నియమించలేదు. కేవలం ఓ సాధారణ టీచర్‌ను సెక్రటరీగా నియమించి సొసైటీని నిర్వహిస్తుండడం గమనార్హం. దాదాపు సగానికిపైగా గురుకులాల్లో ప్రిన్సిపాల్స్ లేరు. ఎస్సీ వెల్ఫేర్ శాఖలో దిగువస్థాయిలోనూ పలు కీలకస్థానాలు ఖాళీగానే ఉన్నాయి. మొత్తంగా ఇన్‌చార్జులతోనే పాలన కొనసాగిస్తున్నది.
ఎస్సీల్లో మాదిగ, మాల, ఇతర ఉపకులాలకు కొత్తగా 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఒక్కో కార్పొరేషన్‌కు రూ.750 కోట్లు నిధుల మంజూరు చేస్తామని కాంగ్రెస్ చెప్పింది. అధికారంలోకి వచ్చిన అనంతరం 2024 మార్చిలో.. కేవలం మాల, మాదిగ కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తూ జీవో ఇచ్చి చేతులు దులుపుకున్నది. అదీ ఇప్పటికీ ఆచరణలోకి రాలేదు. ఇక 57 ఎస్సీ ఉపకులాలకు కార్పొరేషన్ ఏర్పాటు ఊసే లేకుండా పోయింది. ఇక కార్పొరేషన్ సబ్సిడీ రుణాల పథకాలన్నీ దరఖాస్తులకే పరిమితమయ్యాయి. 2025-26 యాక్షన్‌ను రూ. 863 కోట్లతో రూపొందించగా, ఇప్పటికీ అమలు చేయని దుస్థితి నెలకొన్నది.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులను సైతం పక్కదారి పట్టిస్తున్నది. కేటాయించిన నిధుల్లో సగం కూడా ఖర్చుచేయని పరిస్థితి దాపురించింది. 2024-25 బడ్జెట్లో ఎస్సీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ (ఎస్సీఎస్డీఎఫ్) కింద ప్రభుత్వం రూ.33,127 కోట్లు కేటాయించింది. కానీ ఆ కేటాయింపుల్లో కేవలం రూ.14,148 కోట్లు (42.71శాతం) మాత్రమే వెచ్చించింది. ఈ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వమే వెల్లడించింది. ఇక 2025-26లో సబ్‌ప్లాన్ కింద రూ.40,232 కోట్లను, ప్రస్తుత 2026-27 ఆర్థిక సంవత్సరంలో రూ. 37,741 కోట్లను కేటాయించింది. సబ్‌ప్లాన్ చట్టం ప్రకారం మిగిలిన నిధులను తదుపరి బడ్జెట్లోనూ పొందుపరచాలి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ బడ్జెట్లో వాటి ఊసే ఎత్తడంలేదు. ఆ మిగిలిన నిధుల సంగతిని ఎక్కడా వెల్లడించడంలేదు. బడ్జెట్లోనూ జాడే లేదు. దీన్నిబట్టి ఆ నిధులు పక్కదారిపట్టినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు, ‘యంగ్‌ఇండియా స్కూల్స్’కు సంబంధించిన మొత్తం నిధులను ఎస్సీశాఖ ఖాతాలోనే ప్రభుత్వం చూపుతుండటం విమర్శలకు తావిస్తున్నది.

ఇండ్ల్లులేని ఎస్సీలకు ఇండ్ల స్థలంతోపాటు, ఇంటి నిర్మాణానికి రూ.6 లక్షలను అందిస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో కాంగ్రెస్ ప్రకటించింది. కానీ అదీ వాగ్దానాలకే పరిమితమైంది. అదీగాక ఇండ్ల స్థలం ఇస్తామన్నదీ ఉత్తముచ్చటగానే మిగిలింది. ఆర్థిక సాయం సైతం రూ.5 లక్షలనే అందిస్తున్నది. అదికూడా సరైన లబ్ధిదారులకు అందడంలేదన్న విమర్శలు కూడా ఉన్నాయి.