కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల నిర్లక్ష్యపు, విఫల పాలనపై బీఆర్ఎస్ చేపట్టిన పోరుబాట గ్రాండ్ సక్సెస్ అయింది. వారం రోజుల పాటు గ్రేటర్ వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు విభిన్న రూపాల్లో నిరసనలు, రాస్తారోకోలు, ధర్నాలు, ర్యాలీలతో హోరెత్తించారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీల పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చేసిన నమ్మకద్రోహాన్ని వివిధ రూపాల్లో నగరవాసుల ముందుంచారు. ఎక్కడికక్కడ సర్కార్ వైఫల్యాలను ప్రజలకు కండ్లకు కట్టారు.
-సిటీబ్యూరో, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ)
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాలతో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సారథ్యంలో నగరం వ్యాప్తంగా వెయ్యి రోజుల నిర్లక్ష్యాన్ని నిగ్గుతేల్చారు. అన్ని వర్గాల ప్రజలతో ఐక్యంగా నిరసన పోరాటాలు చేపట్టారు. బీఆర్ఎస్ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు ఆయా నియోజకవర్గాల్లోని కార్యకర్తలను ఏకం చేసి పోరుబాటలో పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన వెయ్యి రోజుల నమ్మకద్రోహాన్ని ఎండగడుతూ గ్రేటర్ పరిధిలోని ప్రజలంతా బీఆర్ఎస్ నిరసనలకు మద్దతు తెలిపారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నమ్మి మోసపోయిన నిరుద్యోగులు, విద్యార్థులు, ఉద్యోగ ఉపాధ్యాయులు, కార్మికులు, దినసరి కూలీలు, మహిళలలు, వృద్ధులు, దివ్యాంగులు బీఆర్ఎస్ పార్టీతో కలిసి ముందుకు సాగారు. వివిధ రూపాల్లో కాంగ్రెస్ వెయ్యి రోజుల వైఫల్యాలను ప్రజల ముందుకు తీసుకురావడంలో బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా నిలిచారు. వారం రోజుల పోరుబాట నిరసనల కార్యక్రమాల్లో పాలుపంచుకుని విజయవంతం చేశారు.
ఉస్మానియా యూనివర్సిటీ, సెప్టెంబర్ 9: బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ తార్నాక డివిజన్ మాజీ కార్పొరేటర్ ఆలకుంట సరస్వతీహరి ఆధ్వర్యంలో మాణికేశ్వరీనగర్ కమాన్ ఎదుట ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను బుధవారం దహనం చేశారు. ఈ సందర్భంగా సరస్వతి మాట్లాడుతూ ప్రశ్నిస్తే సస్పెన్షన్.. నిలదీస్తే అరెస్టులు అన్నట్లు రేవంత్ పాలన సాగుతోందని మండిపడ్డారు. ఇదేనా కాంగ్రెస్ చెప్పిన ప్రజాపాలన అని నిలదీశారు. ఈ నిరసనలో బీఆర్ఎస్ నాయకులు ఆలకుంట హరి, బాలకిషన్‌గౌడ్, విష్ణు, అరుణ్‌కుమార్, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

శాసనసభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లేవనెత్తే ప్రజా సమస్యలు, వేసే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక ప్రభుత్వం వారిని సభ నుంచి సస్పెండ్ చేయడంపై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నారు. ప్రశ్నించే గొంతులను నొక్కేందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ అప్రజస్వామిక చర్య అని ధ్వజమెత్తారు.ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన 420 హామీలు, 6 గ్యారెంటీలు, 13 డిక్లరేషన్లను అమలు చేయడంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఘోరంగా విఫలమయ్యారని చెప్పారు. ఈ మేరకు బుధవారం నగరంలోని పలు చోట్ల సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశారు. నిరసన ర్యాలీలతో హోరెత్తించారు.
కాంగ్రెస్ సర్కార్ వెయ్యి రోజుల అసమర్థ, నిర్లక్ష్యపు పాలనను నిరసిస్తూ వారం రోజుల పాటు వివిధ రూపాల్లో చేపట్టిన నిరసన కార్యక్రమాలు విజయవంతమయ్యాయి. ఆరు గ్యారెంటీలు, 420 హామీల వైఫల్యాలపై గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో భారీ ఎత్తున ధర్నాలు చేపట్టారు. కాంగ్రెస్ వెయ్యి రోజుల్లో ప్రజలకు ఇవ్వాల్సిన సంక్షేమ ఫలాల బాకీ కార్డులను ప్రజలుకు పంపిణీ చేశారు. మరుసటి రోజు గ్రేటర్ హైదాబాద్ వ్యాప్తంగా 22ఏ నిషేధిత జాబితా, ఆస్తి హక్కుల పరిరక్షణపై ప్రభుత్వాన్ని నిలదీశారు. బీఆర్ఎస్ చేపట్టిన ఈ నిరసనల్లో వేలాది మంది నిషేధిత జాబితా బాధితులు పాల్గొన్నారు. మహిళలకు ఇచ్చిన రూ.2,500 ఆర్థిక చేయూత, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వంటా వార్పు కార్యక్రమం చేపట్టారు. మహిళలు, యువతులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు.
యూత్ డిక్లరేషన్ పేరిట యువతను మోసం చేసిన కాంగ్రెస్ సర్కారును నిలదీస్తూ ఫీజు రీయింబర్స్మెంట్, జాబ్ క్యాలెండర్ అమలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు చేస్తున్న అన్యాయాలను ఎండగడుతూ.. యువతతో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఆటో కార్మికులు, దినసరి కూలీలకు కాంగ్రెస్ చేసిన నమ్మకద్రోహాన్ని ఎండగడతూ ఆటోలపై భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాన్ని నిలదీశారు. చివరగా ఎన్ని నిరసన కార్యక్రమాలు చేపట్టినా, ప్రభుత్వాన్ని ఎన్నివిధాలుగా నిలదీసినా.. మొద్దు నిద్ర వీడకపోవడంతో ప్రజావాణిలో అధికారులకు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై వినతిపత్రాలు సమర్పించారు. తహసీల్దార్ కార్యాలయాలు, మున్సిపల్ ఆఫీసులను ముట్టడించారు. కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూ గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు అందజేశారు. అయినా కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డికి కనువిప్పు కలిగేలా.. భవిష్యత్తులో ప్రజల పక్షాన మరిన్ని నిరసన కార్యక్రమాలు చేపడతామని బీఆర్ఎస్ శ్రేణులు హెచ్చరించారు.