‘దళిత స్పీకర్’ పేరిట కాంగ్రెస్ రాజకీయాలు చేస్తున్నది. శాసనమండలి సభ్యులు అనని మాటలను అన్నట్టుగా చిత్రీకరిస్తున్నారు. కేసీఆర్ ఇంటిపై దాడి, ఆయనపై హత్యాయత్నానికి ప్రభుత్వం కుట్ర చేసింది. ఈ వ్యవహారం వెనుక ముమ్మాటికీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హస్తం ఉన్నది.
-కేటీఆర్
హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన, ప్రజా సమస్యలు, శాసనసభలో చోటుచేసుకున్న పరిణామాలు, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై పోలీసుల చర్యలు, కేసీఆర్ నివాసంపై దాడి వంటి అంశాలను గవర్నర్ శివప్రతాప్ శుక్లా దృష్టికి తీసుకెళ్లినట్టు బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు వెల్లడించారు. శాసనసభా వ్యవహారాలతోపాటు బయట జరిగిన ఘటనలపైనా విచారణ జరిపిస్తామని గవర్నర్ తమకు హామీ ఇచ్చారని, రాష్ట్రంలో జరుగుతున్న దౌర్జన్యకాండలో ఆయన జోక్యం చేసుకుంటారని ఆశిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో న్యాయం జరుగకపోతే జాతీయ స్థాయి సంస్థలను ఆశ్రయిస్తామని తేల్చి చెప్పారు. హైదరాబాద్ లోక్‌భవన్‌లో బుధవారం గవర్నర్ శివప్రతాప్ శుక్లాను పార్టీ ప్రతినిధులతో కలిసి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా శాసనసభ వ్యవహారాలతోపాటు సభ వెలుపల జరిగిన ప్రతి ఘటనను, కేసీఆర్ ఇంటిపై దాడి వంటి అంశాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. పలు అంశాలపై ఫిర్యాదు చేశారు. విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆయనను కోరారు. అనంతరం లోక్‌భవన్ బయట మీడియాతో కేటీఆర్ మాట్లాడుతూ.. పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు తాము గవర్నర్‌ను కలిశామని తెలిపారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను గవర్నర్‌కు వివరించామని, ప్రతి అంశంపైనా విచారణ జరిపిస్తామని ఆయన హామీ ఇచ్చారని చెప్పారు.
‘కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఆరు గ్యారెంటీలు, 420 హామీలను 100 రోజుల్లోనే అమలు చేస్తామని అధికారంలోకి వచ్చింది. 1,000 రోజులైనా వాటిని అమలుచేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. దీనిపై గవర్నర్‌కు సమగ్రంగా వివరించాం’ అని కేటీఆర్ చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా రైతులు, విద్యార్థులు, నిరుద్యోగ యువత ఎదురొంటున్న సమస్యలను వివరించామని తెలిపారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, వారికి కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, వాటి అమలు తీరుపై తమ వాదనను ఆయన ముందుంచామని చెప్పారు. రాష్ట్రంలోని పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళన, వారి డిమాండ్లను వివరిస్తూ, వారి ఆందోళనను పరిషరించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరినట్టు తెలిపారు. ప్రజల తరఫున ప్రశ్నిస్తున్న ప్రతిపక్షంపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతోపాటు, క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలను కూడా గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్టు పేర్కొన్నారు.
‘దళిత స్పీకర్’ పేరిట కాంగ్రెస్ రాజకీయాలు చేస్తున్నది. శాసనమండలి సభ్యులు అనని మాటలను అన్నట్టుగా మానిప్యులేషన్ చేస్తున్నారు. కేసీఆర్ ఇంటిపై దాడి, ఆయనపై హత్యాయత్నానికి ప్రభుత్వం కుట్ర చేసింది. ఈ వ్యవహారం వెనుక ముమ్మాటికీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హస్తం ఉన్నది.

శాసనసభ సమావేశాల తొలిరోజు జరిగిన పరిణామాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్టు కేటీఆర్ వివరించారు. రాహుల్‌గాంధీ పార్లమెంటులో నిరసన తెలిపిన తరహాలోనే తాము కూడా టీషర్టులు ధరించి నిరసన వ్యక్తంచేయాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. శాసనసభ్యులుగా తమకున్న హకులను కాలరాస్తూ, సభలోకి వెళ్లనీయకుండా పోలీసులు రోడ్డుపైనే అడ్డుకున్నారని తెలిపారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో పోలీసులు తమపై దాష్టీకానికి పాల్పడ్డారని గవర్నర్‌కు వివరించినట్టు చెప్పారు. తమపై జరిగిన దాడికి సంబంధించిన ఫొటోలు, ఇతర ఆధారాలను గవర్నర్‌కు అందజేశామని తెలిపారు. మహిళా శాసనసభ్యులపై జరిగిన పోలీసుల దుశ్చర్యను ప్రత్యేకంగా వివరించినట్టు చెప్పారు. బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి చీరను లాగారని, మహిళా ప్రజాప్రతినిధుల పట్ల పోలీసుల వ్యవహారశైలిపై చర్యలు తీసుకోవాలని కోరామని తెలిపారు. తమపై దాడి చేసిన తర్వాత తిరిగి తమపైనే నిందలు మోపే ప్రయత్నం జరుగుతున్నదని వివరించినట్టు చెప్పారు. పోలీసుల చర్యలకు సంబంధించిన పూర్తి వివరాలు, ఆధారాలను గవర్నర్ ముందుంచామని తెలిపారు. హైకోర్టు సూచనలు ఉన్నప్పటికీ తమను సభల్లోకి రానివ్వకుండా ప్రభుత్వం వ్యవహరించిందని చెప్పారు. ఈ పరిణామాల ద్వారా ప్రభుత్వానికి రాజ్యాంగం, న్యాయస్థానాలపై గౌరవం లేదనే విషయం స్పష్టమవుతున్నదని వివరించినట్టు తెలిపారు.
బీఆర్ఎస్ సభ్యులను సస్పెండ్ చేసిన అంశాన్ని కూడా గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామని కేటీఆర్ చెప్పారు. శాసనమండలి సభ్యులు అనని మాటలను అన్నట్టుగా ఆపాదిస్తూ, జరుగని అవమానాన్ని జరిగినట్టుగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు. స్పీకర్‌పై తమకు అపారమైన గౌరవం ఉన్నదని స్పష్టం చేస్తూనే, కాంగ్రెస్ పార్టీయే పదేపదే ‘దళిత స్పీకర్’ అంటూ ఆయనను రాజకీయ వివాదంలోకి లాగుతున్నదని విమర్శించారు. కేసీఆర్ ఇంటిపై దాడి చేస్తూ హత్యాయత్నానికి ప్రభుత్వం ప్రయత్నించిన తీరును గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. ఈ మొత్తం వ్యవహారం వెనుక ముఖ్యమంత్రి స్వయంగా ఉన్నారని ఆరోపించారు. కేసీఆర్ లాంటి మహానాయకుడి ఇంటి వద్ద చావు డప్పు కొట్టి ఆయన చావును కోరడం దుర్మార్గమని వ్యాఖ్యానించారు.
తాము వివరించిన అన్ని అంశాలపై గవర్నర్ సానుకూలంగా స్పందించారని కేటీఆర్ తెలిపారు. శాసనసభ వ్యవహారాలతోపాటు సభ వెలుపల జరిగిన ప్రతి ఘటనపైనా విచారణ జరిపిస్తామని గవర్నర్ శివప్రతాప్ శుక్లా తమకు హామీ ఇచ్చారని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న దౌర్జన్యకాండలో గవర్నర్ జోక్యం చేసుకుంటారని ఆశిస్తున్నామని తెలిపారు. తమపై జరిగిన ఘటనలపై ప్రభుత్వం విడుదల చేసిన ఏఐ ఫొటోలు, వీడియోలపై ఇప్పటికే ఫిర్యాదు చేశామని తెలిపారు. తప్పుడు చిత్రాలు, తప్పుడు ఫిర్యాదులను ఉపయోగించి తమపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే గవర్నర్ దృష్టికి ఆ అంశాలనూ తీసుకెళ్లామని చెప్పారు. ఈ విషయంలో తగిన స్పందన రాకపోతే తదుపరి దశలో జాతీయ స్థాయి సంస్థలను ఆశ్రయిస్తామని కేటీఆర్ చెప్పారు. ముఖ్యంగా మహిళా ఎమ్మెల్యేలపై జరిగిన దాడుల అంశంపై జాతీయ మహిళా కమిషన్‌ను ఆశ్రయించి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీలు ఎల్ రమణ, దేశపతి శ్రీనివాస్, దాసోజు శ్రవణ్, వాణీదేవి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి, మాణిక్‌రావు, సునీతాలక్ష్మారెడ్డి, కోవా లక్ష్మి, కేపీ వివేకానందగౌడ్, పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాసంపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దాడికి వెళ్లిన ఘటనను కూడా గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్టు కేటీఆర్ వెల్లడించారు. 14 ఏండ్లు పోరాడి ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించిన కేసీఆర్ చావును కోరుకునే స్థాయికి కాంగ్రెస్ నాయకులు దిగజారారని విమర్శించారు. కేసీఆర్ ఇంటిపైకి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గూండాల మాదిరిగా దాడి చేసేందుకు వెళ్లారని మండిపడ్డారు. కేసీఆర్ వంటి నాయకుడి నివాసం వద్ద చావు డప్పు కొట్టడం, ఆయన చావును కోరడం వంటి చర్యలకు సంబంధించిన వివరాలను గవర్నర్‌కు అందజేశామని చెప్పారు. శాసనమండలి, శాసనసభలోకి బీఆర్ఎస్ సభ్యులను అనుమతించకుండా ప్రభుత్వం అడ్డుకున్నదని ఆరోపించారు.