రఘునాథపాలెం, మార్చి 2 : ఖమ్మం నగర శివారు వెలుగుమట్ల భూదాన్ భూముల్లో ఇండ్లు కోల్పోయిన బాధితుల అవస్థలు అన్నీ ఇన్నీ కావు. ప్రభుత్వం, అధికారులు జేసీబీలు, బుల్డోజర్లతో ఇండ్లను కూల్చివేయడంతో నిలువ నీడ కోల్పోయి ఖమ్మం నగరంలోని టీటీడీసీలో ఆశ్రయం పొందుతున్న తన మేనత్తను చూసేందుకు వచ్చిన 9వ తరగతి విద్యార్థి భరత్.. తన చిన్నారి బావమరిదిని రోడ్డు మీద ఉయ్యాలలో ఉంచడాన్ని చూసి తట్టుకోలేకపోయాడు.
తన బావమరిది దుస్థితిని చూసి చలించిపోయిన భరత్.. రేవంత్ సర్కారు తీరుపై మండిపడ్డాడు. “రేవంత్ సార్ ఈ చిన్న బాలుడు మీకు ఏం అన్యాయం చేసిండు సార్.. వీడిని రోడ్డు మీదే వదిలి పెట్టారు. ఈ దుస్థితి తీసుకొచ్చిన మీకు బాధితుల ఉసురు తప్పక తగులుతుంది. మా మేనత్త ప్రేమ వివాహం చేసుకుందని ఇంట్లో నుంచి వెళ్లగొడితే వెలుగుమట్ల ప్రాంతంలో ఇల్లు కట్టుకొని ఉంటోంది. ఆ ఇంటిని మీరు కూల్చితే వచ్చి టీటీడీసీలో ఆశ్రయం పొందుతున్నది.
ఇప్పుడు ఇక్కడ కూడా ఉండొద్దని వెళ్లగొడుతుంటే ఎక్కడికి పోతారు సార్” అంటూ కన్నీటి పర్యంతమయ్యాడు. “ఎక్కడికి పొమ్మంటారు.. అంటే చచ్చిపోవాల్నా” అంటూ ప్రశ్నించాడు. “రేవంత్రెడ్డి సార్.. మీకు ఒక్కటే మాట చెబుతున్నా ఇంతమంది పేదల ఉసురు మీకు తప్పకుండా తగులుతుంది’ అంటూ ఆ బాలుడు శపించాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.