బిజినేపల్లి, ఆగస్టు 6 : నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లిలో నకిలీ నోట్లు చెలామణి చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. గురువారం బిజినేపల్లి పీఎస్‌లో డీఎస్పీ బుర్రి శ్రీనివాసులు వివరాలువెల్లడించారు. ఈ నెల ఒకటిన మంగనూర్లో వంగ నవీన్‌గౌడ్, బొల్ల కురుమూర్తి కనకదుర్గ వైన్స్ వద్ద రెండు రూ.500 నకిలీ నోట్లు ఇచ్చి మద్యం కొనుగోలు చేశారు.
వాటిని క్యాష్ మిషన్‌లో వేయడంలో నకిలీ నోట్లుగా అక్కడి సిబ్బంది గుర్తించి వెంటనే పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. సీఐ అశోక్‌రెడ్డి, ఎస్సై శంషుద్దీన్ మంగనూర్లో కురుమూర్తి ఇంటికి వెళ్లి తనిఖీ చేయడంతో ఏడుగురు నిందితులు పట్టుబడ్టారు. వీరిలో పశ్చిమ గోదావరి జిల్లాలో మీసేవ కేంద్రం నడుపుతున్న నాగరాజు ఆర్థిక ఇబ్బందుల కారణంగా అదే జిల్లాకు చెందిన శివవెంకట ధర్మరాజు, అశోక్‌కుమార్, ఏలూరుకు చెందిన సతీశ్‌కుమార్, బిజినేపల్లి మండలం మంగనూర్‌కు చెందిన నవీన్‌గౌడ్‌తో కలిసి నకిలీ నోట్ల తయారీకి పూనుకున్నారు. వీరి నుంచి రూ.68 వేల నకిలీ రూ.500 నోట్లతోపాటు ఏడు సెల్ఫోన్లు, కలర్ జిరాక్స్, కౌంటింగ్ మిషన్లు, నోట్లు ముద్రించేందుకు ఉపయోగించిన పేపర్లను స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు.