బుధవారం 03 జూన్ 2020
Hyderabad - Apr 25, 2020 , 23:44:25

మద్యం దొరకడం లేదని వ్యక్తి ఆత్మహత్య

మద్యం దొరకడం లేదని వ్యక్తి ఆత్మహత్య

కాచిగూడ: నింబోలిఅడ్డాకు చెందిన విజయ్‌కుమార్‌ కుమారుడు మశెట్టి సాయికిరణ్‌(32) కర్టన్‌ షాపులో సెల్స్‌బాయ్‌గా పనిచేస్తున్నాడు. అయితే నెలరోజులుగా సాయికిరణ్‌కు మద్యం లభించలేదు. దీంతో మనస్తాపానికి గురై శుక్రవారం రాత్రి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తల్లి శ్యామలాదేవి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

పహాడీషరీఫ్‌: బాలాపూర్‌ మండల పరిధిలోని సుల్తాన్‌పూర్‌కు చెందిన బొర్ర పద్మ(40) శనివారం ఉదయం వ్యవసాయ బావి వద్ద కొత్తిమీర కట్టలు కట్టేందుకు వెళ్లింది. వెలుతురుకు ఏర్పా టు చేసిన కరెంట్‌ వైర్‌కు గాలికి వేసిన టేపు ఊడిపోయింది. దీంతో పద్మ ఆ వైర్‌ను తాకడంతో విద్యుత్‌షాక్‌కు గురై మృతి చెందింది. భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు

పేట్‌బషీరాబాద్‌: బాలానగర్‌జోన్‌ పేట్‌బషీరాబాద్‌ పీఎస్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్‌ విజయభాస్కర్‌రెడ్డి ఈనెల 24న మద్యం తాగుతూ దిగి న ఫొటోలను వాట్సాప్‌లో పోస్ట్‌చేశాడు. గమనించిన ప్రజాసంఘాలు ఉన్నతాధికారులకు ఫిర్యా దు చేసిన విషయం తెలిసిందే. విచారణలో నిజమేనని తేలడంతో సీపీ ఆఫీస్‌కు అటాచ్డ్‌ చేశారు. 

దుండిగల్‌: సూరారం డివిజన్‌ పరిధిలోని వైష్ణవినగర్‌లో ఓ వ్యక్తి కొన్ని రోజులుగా కూలీలతో భవన నిర్మాణం కొనసాగిస్తున్నాడు.  సీఐ వెంకటేశం అక్కడకు వెళ్లి పనులు నిలిపివేయించడంతోపాటు యజమానిపై కేసు నమోదు చేశారు. అదేవిధంగా సూరారంకాలనీలో తెరిచి ఉంచిన తిరుమల ఎలక్ట్రానిక్స్‌, పాండుబస్తీలోని టెంట్‌హౌస్‌, వస్ర్తాల దుకాణం. మరోషాపు యజమానిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. 

కీసర:మండలంలోని కరీంగూడలో పాల వ్యాపా రి నిబంధనలు ఉల్లంఘించి ఉదయం 11గం టల తర్వాత విక్రయించాడు.అతడికి పంచాయ తీ అధికారులు రూ.2,500జరిమానా వేశారు.

శేరిలింగంపల్లి:కొండాపూర్‌ లగ్జరీ అపార్ట్‌మెంట్స్‌లోకి ఓ యువకుడు, ఇద్దరు యువతులు   తమ స్నేహితుడు ఉన్నాడని, అతడి వద్దకు వెళ్లాలని శనివారం అర్ధరాత్రి సెక్యూరిటీ సిబ్బందితో గొడవకు దిగారు. పశ్నించిన అపార్ట్‌మెంట్‌ సంక్షేమ సంఘం ప్రతినిధులను దుర్బాషలాడారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

సిటీబ్యూరో : నగరానికి చెందిన ముగ్గురు ప్రైవేట్‌ వ్యక్తులకు వేర్వేరుగా సైబర్‌నేరగాళ్లు ఫోన్‌ చేశారు. ‘మీ పేటీఎం కేవైసీ అప్‌డేట్‌ చేసుకోకపోతే ఖాతా బ్లాక్‌ అవుతుందని, మీరు అప్‌డేట్‌ చేసుకోవాలంటూ’ సూచించారు. క్విక్‌సపోర్టు యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించి, దాని కోడ్‌ను కూడా సైబర్‌నేరగాళ్లకు చెప్పేశారు. ఆ తర్వాత బ్యాంకు వివరాలు తమ సెల్‌ఫోన్‌లో టైప్‌ చేస్తుండటంతో సైబర్‌నేరగాళ్లు వివరాలు తెలుసుకొని వారి ఖాతాలో నుంచి వరుసగా రూ.1.04 లక్షలు, రూ.68 వేలు, రూ.50వేలు కాజేశారు.

బంజారాహిల్స్‌:జూబ్లీహిల్స్‌ రోడ్‌ నం.10లోని  సీక్రెట్‌ అఫైర్స్‌ పబ్‌ను మార్చిలో సీల్‌ చేశారు. కాగా, శనివారం పబ్‌కు చెందిన కిచెన్‌ వెనుకాల డోర్‌ తెరిచినట్లు గుర్తించిన వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అక్కడ మద్యం విక్రయాలు చేస్తున్నారని గుర్తించి ఎక్సైజ్‌ పోలీసులకు సమాచారం అందించారు. జూబ్లీహిల్స్‌ ఎక్సైజ్‌ సీఐ కనకదుర్గ రిజిస్టర్లను పరిశీలించి తిరిగి సీల్‌చేశారు. డోర్‌ తెరిచిన నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. 

ఖైరతాబాద్‌: చింతల్‌బస్తీలోని పతాంజలి స్టోర్స్‌ నిర్వాహకుడు కైలాష్‌గాంధీ వస్తువులను అధిక ధరలకు విక్రయిస్తున్నాడనే సమాచారంతో పోలీసులు దాడులు చేశారు. వస్తువులపై ఎమ్మార్పీ ధరల స్టిక్కర్లను తొలగించి అధిక ధరలకు విక్రయిస్తున్నాడని నిర్ధారించి కేసు నమోదు చేశారు. 

మెహిదీపట్నం: టోలిచౌకి నదీంకాలనీకి చెందిన షేక్‌ ఫయ్యూం(22), ఎండీ జిలానీ(40) కిరాణ షాపులో అక్రమంగా గుట్కా విక్రయిస్తున్నారనే సమాచారంతో పోలీసులు దాడి చేసి రూ.80 వేల విలువ చేసే గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. 

మేడిపల్లి : పీర్జాదిగూడ నగరపాలక పరిధిలోని ఉప్పల్‌ బస్‌డిపో ఎదురుగా ఉన్న వెంకటేశ్వర బార్‌ అండ్‌ రెస్టారెంట్‌లో వెయిటర్‌గా పనిచేస్తున్న సందీప్‌ రహస్యంగా మద్యం విక్రయిస్తున్నారని మేడిపల్లి పోలీసులకు సమాచారం అందడంతో బార్‌పై దాడి చేశారు. సందీప్‌ను అదుపులోకి తీసుకొని మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. బార్‌ లైసెన్స్‌ హోల్డర్‌ ప్రభాకర్‌రెడ్డి, వెయిటర్‌ సందీప్‌లపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.


logo