Murder for Egg curry | ఒడిశాలోని గంజాం జిల్లాలో విషాదం చోటుచేసుకున్నది. కోడిగుడ్డు కూర చేయడానికి నిరాకరించిందనే కారణంతో ఓ వ్యక్తి తన తల్లిని దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన దసరా పండుగ మరుసటి రోజున జరిగింది. తల్లిని హత్య చేసిన కుమారుడ్ని అదుపులోకి తీసుకుని తార్సింగ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తరసాంగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గజపదర్ గ్రామానికి చెందిన త్రిబేణి (50) తన కొడుకు సనాతన్ వేధింపుల కారణంగా కొన్నేండ్ల క్రితం ఇల్లు వదిలి వెళ్లిపోయింది. ఆంధ్రప్రదేశ్‌లోని రొయ్యల ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలో పని చేస్తున్నది. సనాతన్ భార్య కూడా అతన్ని విడిచిపెట్టి వెళ్లిపోయింది. కాగా త్రిబేణి దసరా పండక్కి గంజాం జిల్లాలో ఉంటున్న కొడుకు వద్దకు వచ్చింది. ఫూటుగా మద్యం సేవించి ఇంటికి వచ్చిన కుమారుడు సనాతన్.. కోడిగుడ్డు కూర చేయమని తల్లిని కోరాడు. అందుకు త్రిబేణి నిరాకరించడంతో కోపంతో ఊగిపోయిన కుమారుడు తల్లి తలను గోడకేసి కొట్టాడు. అనంతరం ఇనుప రాడ్‌తో దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.
ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే తరసాంగ్ పోలీస్ స్టేషన్ బృందం శనివారం ఉదయం సనాతన్ ఇంటికి వెళ్లింది. త్రిబేణి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక దవాఖానకు తరలించారు. ఘటనా స్థలం నుంచి హత్యకు ఉపయోగించిన రాడ్‌ను స్వాధీనం చేసుకున్నారు. సనాతన్‌ను తరసాంగ్ పోలీసులు అరెస్టు చేసినట్లు ఐఐసీ ప్రదీప్త కుమార్ దాస్ తెలిపారు. అతనిపై హత్య కేసు నమోదైంది.