ఆదివారం 07 మార్చి 2021
Narayanpet - Jan 13, 2020 , 03:19:32

ఇష్టారాజ్యం కుదరదు

ఇష్టారాజ్యం కుదరదు

రాష్ట్ర ప్రభుత్వంలో ప్రజలకు మేలైన పాలన అందిచాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్న సీఎం కేసీఆర్‌ మున్సిపల్‌ చట్టంలో సమూల మార్పులు తెచ్చారు.. ఈ చట్టంతో ప్రజలకు జవాబుదారీగా ప్రజాప్రతినిధుల ఉండబోతున్నారు..

  • - మున్సిపల్‌ చట్టంలో సమూల మార్పులు
  • - క్రమశిక్షణ లోపిస్తే చర్యలు
  • - కలెక్టర్లకే పూర్తి బాధ్యతలు

రాష్ట్ర ప్రభుత్వంలో ప్రజలకు మేలైన పాలన అందిచాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్న  సీఎం కేసీఆర్‌ మున్సిపల్‌ చట్టంలో సమూల మార్పులు తెచ్చారు.. ఈ చట్టంతో ప్రజలకు జవాబుదారీగా ప్రజాప్రతినిధుల ఉండబోతున్నారు.. ఎన్నికైన ప్రజాప్రతినిధులందరూ ఇక ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే కుదరదు.. ధనార్జన, పైరవీలకు పదవీకాలం వినియోగిస్తామంటే ఇక చెల్లదు.. పదవిలో ఉన్నంత కాలం క్రమశిక్షణ, సేవాభావంతో ఉండాల్సి ఉంటుంది.. కొత్తగా ఎన్నిక కాబోతున్న మున్సిపల్‌ వార్డుల సభ్యులు, చైర్మన్లు చట్టం గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

గద్వాలటౌన్‌: రాష్ట్ర ప్రభుత్వ ప్రవేశపెట్టిన కొత్త మున్సిపల్‌ చట్టం ప్రకారం సమూల మార్పులు జరగబోతున్నాయి. ప్రజాసేవకు పెద్దపీట వేయనున్నారు. మున్సిపాలిటీ, నగర పంచాయతీల్లో కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు ప్రత్యేకమైన విధులు, బాధ్యతలు అప్పజెప్పనున్నారు. మున్సిపాలిటీలో ఇష్టారాజ్యంగా వ్యవహిరించడం కుదరదు. 


చైర్మన్లకే బాధ్యతలు

కొత్త మున్సిపల్‌ చట్టం ప్రకారం ప్రజాప్రతినిధులకు ప్రభుత్వం అనేక బాధ్యతలు అప్పజెప్పింది.  కార్పొరేషన్‌ మేయర్లు, మున్సిపాలిటీ చైర్మన్లు ఆ బాధ్యతలను విధిగా పాటించి తీరాల్సిందే. పారిశుధ్య నిర్వహణ, మంచినీటి సరఫరా, వీధిలైట్లు, సక్రమంగా జరుగుతుందా, ఏవైనా లోపాలు ఉన్నాయా అన్న వాటిపై ప్రత్యేకంగా దృష్టి సారించాల్సి ఉంటుంది. అదేవిధంగా తడి, పొడి చెత్త సేకరణ ఎలా జరుగుతుందన్న దానిపై ఎప్పటికప్పుడు ఆరా తీయాలి. హరితహారం అమలుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. నాటిన 100శాతం మొక్కల్లో 85శాతం బతికేలా చర్యలు తీసుకోవాలి. అందుకు గాను ప్రత్యేకంగా గ్రీన్‌సెల్‌ను ఏర్పాటు చేయాలి. బడ్జెట్‌లో కనీసం 10శాతాన్ని హరితహారం కోసం కేటాయించాలి. మున్సిపాలిటీ పరిధిలోని చెరువులు, కుంటల అభివృద్ధిపై చర్యలు తీసుకోవాలి. పవర్‌బోర్ల వినియోగాన్ని తగ్గించుకోవాలి. ఇంకుడు గుంతల నిర్మాణాలను ప్రోత్సహించాలి. 


వార్డు సభ్యుల బాధ్యతలు

చైర్మన్లతో పాటు మున్సిపల్‌ వార్డు సభ్యులకు అనేక బాధ్యతలను అప్పచెప్పారు. వార్డుల పరిధిలో క్రమం తప్పకుండా తడిపొడి చెత్తను వేరు చేయడానికి ఏర్పాట్లు చేయాలి. నీటి సరఫరాపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. నీటి సరఫరాలో చోటుచేసుకుంటున్న నష్టాలను తగ్గించాలి. ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి పథకాలను ఎప్పటికప్పుడు చేపట్టి ప్రజలను భాగస్వాములను చేయాలి.


కలెక్టర్లకు ప్రత్యేక అధికారాలు

మున్సిపాలిటీల్లో నిర్వహించే సమావేశాల్లో దాడులకు పాల్పడటం.. ఇష్టానుసారంగా వ్యవహరించినా.. తొటి సభ్యులతో తప్పుగా వ్యవహరించినా సదరు వార్డు సభ్యులను తొలగించే అధికారాలు జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం అప్పచెప్పింది. మున్సిపల్‌ సిబ్బందిపై దురుసుగా వ్యవహిరించి కొట్టినా, గాయపరిచిన ఆరు నెలల పాటు సస్పెండ్‌ చేసే అధికారం కలెక్టర్లకు ఉంటుంది. అదేవిధంగా వార్డు సభ్యులు మున్సిపల్‌ ఆస్తిని ధ్వంసం చేసినా దాని విలువ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. లేని పక్షంలో కలెక్టర్‌ అట్టి సభ్యులపై కఠిన చర్యలు తీసుకునే అధికారం ఉన్నది.

VIDEOS

logo