Visa on Arrival | మన జీవితం ఓ ప్రయాణం. అందులోనూ కొత్త ప్రదేశాలకు ప్రయాణిస్తున్నామంటే రెండుసార్లు జీవించినట్లే లెక్క. స్వదేశంలో తిరగడానికైతే ఏ ఆటంకాలూ ఉండవు. అదే విదేశాలు చుట్టేయాలంటే మాత్రం భారత పాస్‌పోర్ట్‌తోపాటు సంబంధిత దేశాల వీసా ఉండాల్సిందే. కానీ, కొన్ని దేశాలు మాత్రం భారతీయులకు తమ దేశంలో వీసా ఊసు లేని పర్యటనలకు వీలు కల్పించాయి. ఇంకొన్ని దేశాలేమో ‘వీసా ఆన్ అరైవల్’ సౌకర్యం ప్రసాదిస్తున్నాయి.
శ్రీలంక: ఎనిమిది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలను కలిగిన శ్రీలంకకు 1,300 కిలోమీటర్ల తీరప్రాంతం ఉంది. 30 రోజులపాటు ఈ హిందూ మహాసముద్ర ద్వీప దేశాన్ని వీసా లేకుండా చుట్టేయవచ్చు.
భూటాన్: పొరుగునే ఉన్న అందమైన హిమాలయ రాజ్యం భూటాన్. ఈదేశంలో భారతీయులకు ఉచిత ప్రవేశానికి అనుమతి ఉంది.
హాంకాంగ్: పసిఫిక్ మహాసముద్రంలో కొలువుదీరిన ద్వీప నగరం హాంకాంగ్ అందాలను రాత్రిళ్లు చూస్తే తనివి తీరదు. ఇక్కడి దక్షిణ కోలూన్లో ఉన్న కప్ నూడుల్స్ మ్యూజియం ఓ సందర్శనీయ స్థలం. 14 రోజులకు వీసా అవసరం ఉండదు.
టునీషియా: ఆఫ్రికా ఖండం ఉత్తరభాగంలో ఉన్న దేశం టునీషియా. మధ్యధరా సముద్ర తీరపు బీచ్‌లు, పురాతన నాగరికత ఆనవాళ్లకు ప్రసిద్ధి చెందిన ఈ దేశంలో వీసా ఆన్ అరైవల్ కింద 90 రోజులు గడపడానికి వీలుంది.
ఒమన్: ఈ దేశం కూడా వీసా ఆన్ అరైవల్ సదుపాయం కల్పించింది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే 14 రోజులు ఒమన్‌లో పర్యటనకు అనుమతి ఇస్తారు.
మారిషస్: అరేబియా సముద్ర ద్వీప దేశం మారిషస్ భారతీయులకు 2004లోనే వీసా లేకుండా పర్యటనకు అనుమతులు ఇచ్చింది. 60 రోజులపాటు ఈ దేశంలో స్వేచ్ఛగా విహరించవచ్చు.
రువాండా: తూర్పు ఆఫ్రికా దేశమైన రువాండా అందమైన దృశ్యాలకు, జీవ వైవిధ్యానికి పేరుగాంచింది. వీసా ఆన్ అరైవల్ కింద ఈ దేశంలో 30 రోజులపాటు విహరించొచ్చు.
నేపాల్: హిమాలయ దేశం నేపాల్‌లో ఎవరెస్ట్, అన్నపూర్ణ, ధవళగిరి పర్వతాలు ప్రకృతి ముందు మన అల్పత్వాన్ని గుర్తుచేస్తాయి. పశుపతినాథ్ దేవాలయం, జనక్‌పుర్, లుంబిని వనం లాంటి సాంస్కృతిక కేంద్రాలకు ఈ దేశం నెలవు. ఇక్కడ పర్యటించడానికి వీసా ఆన్ అరైవల్ (ప్రవేశానికి ముందు తీసుకోవచ్చు) సదుపాయం ఉంది.
కెన్యా: వందలాది జంతువులతో అలరారే మసాయ్ మర నేషనల్ రిజర్వ్ లాంటి వన్యప్రాణి కేంద్రాలకు కెన్యా పెట్టిందిపేరు. పర్యాటకులను తమ దేశానికి రప్పించడానికి కెన్యా టూరిజం బోర్డు ట్రావెల్ ఏజెంట్లకు ప్రోత్సాహకాలు ఇస్తున్నది.
ఇరాన్: ఇటీవలే ఇరాన్ భారతీయులకు వీసా ఫ్రీ ప్రవేశం కల్పించింది.15 రోజులపాటు ఈ దేశంలోని ఆకర్షణీయమైన కట్టడాలను చూస్తూ, పాకశాస్త్ర అద్భుతాలను ఆస్వాదించవచ్చు.
థాయ్‌లాండ్: తెల్ల ఏనుగుల దేశం థాయ్‌లాండ్ సాంస్కృతిక వైవిధ్యానికి, ముచ్చటగొలిపే బీచ్‌లకు ప్రసిద్ధి. ఇక్కడ కూడా 15 రోజులు వీసా లేకుండా గడిపేయవచ్చు.
మలేసియా: వైవిధ్యభరితమైన భౌగోళిక అద్భుతాలు (ల్యాండ్ స్కేప్స్), రుచికరమైన వంటకాలకు మలేసియా పెట్టింది పేరు. భారతీయులకు ఈ దేశంలో 15 రోజులకు వీసా లేకుండా ప్రయాణించే వీలుంది.
కజక్‌స్తాన్: మౌంట్ షెర్కాలా, వ్యాలీ ఆఫ్ బాల్స్ లాంటివి ఈ మధ్య ఆసియా దేశపు ఆకర్షణలు. వీసా లేకుండా రెండు వారాలు ఉండొచ్చు.
కంబోడియా: దట్టమైన అడవులు, పురాతన హిందూ, బౌద్ధ ఆలయాలు ఇక్కడి ఆకర్షణలు. ఈ దేశం సందర్శించడానికి వీసా ఆన్ అరైవల్ సదుపాయం ఉంది. ఆన్లైన్లో ‘ఈ వీసా’కు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
లావోస్: ప్రపంచంలో పొడవైన నదుల్లో ఒకటైన మెకాంగ్ నదీ తీర దేశం లావోస్‌లో పర్యటనకు 30 రోజులకు అనుమతులు ఉన్నాయి. సంప్రదాయ గ్రామాలు, పచ్చటి వరిపొలాలు ఇక్కడి ఆకర్షణలు.
బార్బడోస్, జమైకా, హైతీ, డొమినికా, గ్రెనెడా, సీషెల్స్, ఇండోనేషియా, ఫిజి, ఖతార్, జోర్డాన్ కూడా వీసా లేకుండా తిరిగేందుకు వీలు కల్పిస్తున్నాయి.