Kalki 2898 AD | ‘దర్శకుడు నాగ్ఆశ్విన్ ప్రేక్షకులకు కొత్త ప్రపంచం చూపించబోతున్నాడు. కొత్త పాత్రలను పరిచయం చేయబోతున్నాడు. ‘కల్కి 2898’ ఇండియన్ స్క్రీన్‌పై ముందెన్నడూ చూడని అద్భుతం’. అని ఆ సినిమాకు పనిచేసిన వాళ్లు చెబుతున్నారు. ప్రభాస్ కథానాయకుడిగా రూపొందుతోన్న ఈ చిత్రంలో దీపిక పదుకొణే కథానాయిక. అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్, దుల్కర్ సల్మాన్లతోపాటు మరికొందరు స్టార్లు కూడా ఈ సినిమాలో భాగమైన విషయం తెలిసిందే. ‘కల్కి 2898’ ప్రభాస్ కెరీర్లోనే హైబడ్జెట్ సినిమా.
శ్రీమద్భాగవతంలో ప్రస్తావించిన ఓ అంశం ఆధారంగా పురాణపాత్రల నేపథ్యంలో జరిగే ఫాంటసీ, సైంటిఫిక్ థ్రిల్లర్ ఇది. రీసెంట్గా ద్రోణసుతుడైన అశ్వద్థామగా అమితాబ్‌ను మేకర్స్ పరిచయం చేశారు. వందేళ్ల తర్వాతి ప్రపంచరూపం, పరిణామాలూ, పోకడలూ ఇందులో కొత్తగా అనిపిస్తాయని తెలుస్తున్నది. ఈ సినిమా విడుదల తేదీపై ప్రేక్షకుల్లో సందిగ్ధత నెలకొని ఉన్న విషయం తెలిసిందే. మే 9న విడుదల చేయనున్నట్టు వైజయంతీ మూవీస్ సంస్థ కొన్ని నెలల క్రితం ప్రకటించింది. అయితే.. ఆ సమయంలో తెలుగు రాష్ర్టాల్లో ఎన్నికల వేడి తారాస్థాయిలో ఉంటుంది. అందుకే.. సినిమా విడుదలపై నిర్మాతలు పునరాలోచనలో పడ్డట్టు సమాచారం.
త్వరలోనే కొత్త డేట్‌ని ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తున్నది. కాగా, విడుదలకు ముందే, ఈ సినిమాపై ఓ యానిమేషన్ వీడియోను వైజయంతీ మూవీస్ సంస్థ సిద్ధం చేస్తున్నదట. ఆ వీడియో ద్వారా ‘కల్కి 2898’ ప్రపంచాన్ని ఆవిష్కరించనున్నట్టు వినికిడి. ఇది ఏ తరహా సినిమానో ఆ వీడియోలో చూపించి, ప్రేక్షకులకు ప్రిపేర్ చేయడమే ఈ వీడియో ముఖ్యోద్ధ్దేశమట. ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. ఈ వీడియోతో అవి మరింత పెరిగే అవకాశం లేకపోలేదు.