కోదాడ, మార్చి 07 : పెన్షనర్ల సామాజిక సేవ అభినందనీయం అని కోదాడ పట్టణ ప్రముఖ వైద్యుడు జాస్తి సుబ్బారావు అన్నారు. సమాజానికి తమ వంతుగా సేవ చేయాలనే తపనతో కోదాడ ప్రాంత ప్రజలకు ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని కొనియాడారు. శనివారం కోదాడ పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనంలో యశోద హాస్పిటల్ వారి సౌజన్యంతో ఏర్పాటు చేసిన మెగా ఉచిత వైద్య శిబిరాన్ని రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు రావెళ్ల సీతారామయ్య, స్థానిక 19వ వార్డు కౌన్సిలర్ కోటిరెడ్డిలతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రస్తుత కాలంలో విద్య, వైద్యం వ్యాపారంలా మారి సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోయినట్లు తెలిపారు. అటువంటి స్థితిలో కార్పొరేట్ వైద్యులచే వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి కోదాడ ప్రాంత ప్రజలకు సేవ చేయడం ఎంతో సంతోషకరం అన్నారు. ఈ హెల్త్ క్యాంప్‌లో సుమారు 300 మంది పాల్గొని తమ ఆరోగ్య సమస్యలపై వైద్యులను సంప్రదించారు.
ఈ సందర్భంగా వైద్యులు అభిషేక్ బార్లీ, కార్తీక్ కృష్ణ,అనిల్ చంద్ర, వల్ల రాకేష్ రెడ్డి వైద్య బృందం సభ్యులను విశ్రాంత ఉద్యోగుల సంఘ శాలువా, మెమొంటాలతో ఘనంగా సన్మానించింది. ఈ కార్యక్రమంలో కోదాడ యూనిట్ అధ్యక్షుడు వేనేపల్లి శ్రీనివాసరావు, సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బొల్లు రాంబాబు, కోదాడ యూనిట్ కార్యదర్శి రఘువర ప్రసాద్, జానయ్య, ఎస్.దాని, భ్రమరాంబ, భిక్షం, వెంకటరెడ్డి, శంబయ్య, రవీంద్రనాథ్, ఠాగూర్, విద్యాసాగర్, జగన్మోహన్ రావు, బాలేమియా, గురవయ్య, సత్యనారాయణ, నర్సిరెడ్డి, లక్ష్మీ నరసయ్య, హాసన్ జానీ, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

పెన్షనర్ల సామాజిక సేవ అభినందనీయం : డా.జాస్తి సుబ్బారావు