మహబూబ్‌నగర్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘గత పదేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదు’ అని ఎక్సైజ్, పర్యాటక శాఖల మంత్రి జూపల్లి అసత్య ఆరోపణలకు దిగడంపై ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలు భగ్గుమన్నారు. ఉమ్మడి జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చిన ఘనత బీఆర్ఎస్దేనని బల్లగుద్ది మరీ చెప్తున్నారు. తెలంగాణ రాకముందు ఉమ్మడి రాష్ట్రంలో దగాపడ్డ పాలమూరుకు కాంగ్రెస్ ప్రభుత్వాలు అన్యాయం చేస్తుంటే మంత్రి పదవులు అనుభవించిన జూపల్లి మాత్రం పెదవులు మూసుకున్నారని మండిపడుతున్నారు. కాంగ్రెస్ హయాంలో నాడు ఇష్టంలేని శాఖతో ఇమడలేక ఉద్యమం ముసుగేసుకుని బయటకొచ్చిన జూపల్లి.. కేసీఆర్ హయాంలో తనే ముందుండి కల్వకుర్తి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయించింది మరచిపోయారని కొల్లాపూర్ ప్రజలు నిలదీస్తున్నారు. ఒక్క పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కేసీఆర్ ప్రభుత్వంలో 90 శాతం పనులు పూర్తిచేస్తే.. ఇప్పుడు అదే జూపల్లి మంత్రి పదవి అనుభవిస్తూ మిగతా 10 శాతం పనులు చేయించలేక పోతున్నారని పలువురు ఎత్తిచూపుతున్నారు. ఉమ్మడి జిల్లా కు తీరని అన్యాయం చేస్తున్న మంత్రి జూప ల్లి.. పాలమూరు ప్రాజెక్టులపై మాట్లాడటం గురువింద గింజ సామెతను తలపిస్తున్నదని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు.
బీఆర్ఎస్ హయాంలో నీరు
భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, జూరాల, ఆర్డీఎస్ లింకు కెనాల్, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులన్నిటినీ ఉమ్మడి పాలనలో పడావు పెడితే.. కేసీఆర్ ప్రభుత్వం పూర్తిచేసి ఉమ్మడి జిల్లాలో 10 లక్షల ఎకరాలకు నీరు అందించింది. కృష్ణా, భీమా, తుంగభద్ర నదుల్లో వరద మొదలవగానే లింకు కాలువల ద్వారా చెరువులు, కుంటలకు ఏటేటా నీరు పారించింది. 2014కు ముందు ఉమ్మడి జిల్లాలో ప్రాజెక్టుల ద్వారా లక్ష ఎకరాలు సాగైతే.. 2014-2018 మధ్యకాలంలో 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందింది. వీటిన్నింటినీ మరచిన మంత్రి జూపల్లి.. సీఎం రేవంత్‌రెడ్డి మెప్పుకోసమే ఇలా మాట్లాడుతున్నారని ప్రజలు మండిపడుతున్నారు.
నాడు జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞం
పాలమూరు కరువు వలసలను అడ్డం పెట్టుకొని 2004లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆంధ్రాకు నీళ్లు పారించేందుకు వీలుగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు చేపడుతున్నామని జలయజ్ఞం పేరుతో శంకుస్థాపనలు చేశారు. భీమా ఫేస్-1, ఫేస్-2, కోయిల్‌సాగర్, నెట్టెంపాడు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపనలు చేసి పనులు ప్రారంభించారు. 2014లో తెలంగాణ వచ్చేవరకు కూడా వాటిలో ఏ ఒక్క ప్రాజెక్టును కూడా కాంగ్రెస్ ఉమ్మడి పాలకులు పూర్తి చేయలేకపోయారు. చివరి దశలో కల్వకుర్తి ఎత్తిపోతల, నెట్టెంపాడు ఎత్తిపోతల పథకాలు పూర్తికాకుండానే ప్రారంభించారు.
ఉమ్మడి జిల్లా ప్రాజెక్టులే పట్టించుకోని జూపల్లి
కొల్లాపూర్ రాజకీయాల్లోకి ప్రవేశించిన జూపల్లి 1999లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఐదేండ్లు పనిచేసిన ఆయన ఒక్కసారి కూడా ఉమ్మడి జిల్లా ప్రాజెక్టుల గురించి మాట్లాడిన పాపాన పోలేదు. ఆ తర్వాత 2004లో తిరిగి కొల్లాపూర్ ఎమ్మెల్యేగా గెలుపొంది వైఎస్ మంత్రివర్గంలో పౌరసరఫరాల శాఖ మంత్రిగా పనిచేశారు. అప్పుడే జలయజ్ఞానికి శ్రీకారం చుట్టిన వైఎస్ కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు. తిరిగి 2009లో జూపల్లి మళ్లీ గెలిచి దేవాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఉమ్మడి జిల్లాకే చెందిన డీకే అరుణకు ప్రాధాన్యమైన పదవి ఇచ్చి తనకు ఇష్టంలేని శాఖ ఇచ్చారని పార్టీపై నాడే అలిగారు. ఆ తర్వాత 2012లో రాజీనామా చేసి ఉద్యమం పేరుతో ఉపఎన్నికల్లో గెలిచారు. 15 ఏండ్లు కొల్లాపూర్‌లో ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నా సొంత నియోజకవర్గాన్ని, ఉమ్మడి జిల్లాకు ప్రాణప్రదమైన కల్వకుర్తి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయకుండా పడావు పెట్టారు. 2014లో తిరిగి ఎమ్మెల్యే అయ్యాక బీఆర్ఎస్లో చేరి ఎక్సైజ్, పర్యాటక శాఖల మంత్రి అయ్యారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం ప్రాజెక్టులన్నీ పూర్తిచేసి కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే అప్పట్లో మంత్రిగా ఉండి గొప్పలు చెప్పిన జూపల్లి.. ఇప్పుడు కాంగ్రెస్‌లో ఉండి మాటమార్చడం ఆయనకే చెల్లింది. 2023లో గెలిచి మంత్రి పదవి అనుభవిస్తున్న జూపల్లి పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయలేక కేసీఆర్ ప్రభుత్వంపై నిందలేసే కుట్రలు చూసి జనం నవ్వుకుంటున్నారు.