ఓ నగరంలో క్యాన్సర్ వ్యాధి నిపుణుడు ఉండేవాడు. శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించడంలో ఆయనకు చాలా పేరుంది. శస్త్రచికిత్సలకు వెళ్లే ప్రతిసారీ ఆ వైద్యుడు తమ కాలనీలో ఉన్న గుడికి వెళ్లేవాడు. దేవునికి భక్తిప్రపత్తులతో పూజచేసి హాస్పిటల్‌కు బయల్దేరేవాడు. యథావిధిగా ఓ రోజు ఆపరేషన్ థియేటర్‌కు పోబోయే ముందు గుడికి బయలుదేరాడు.
గృహిణి అయిన డాక్టరు భార్య… “ప్రజలు మిమ్మల్ని ప్రాణదాతగా కొలుస్తుంటారు. ప్రాణభిక్ష పెట్టారని మిమ్మల్ని దైవమని కొనియాడుతుంటారు. అలాంటిది శస్త్రచికిత్సలకు వెళ్లేటప్పుడు మీరు గుడికి ఎందుకు వెళ్తారు? దేవుణ్ని ఎందుకు పూజిస్తారు?” అని సందేహం వెలిబుచ్చింది. దానికి ఆ వైద్యుడు చిన్నగా నవ్వి ఈ శరీర నిర్మాణం మనకెవ్వరికీ అంతుపట్టదు. వ్యాధికి ముందు ఆరోగ్యాన్ని, మరణానికి ముందు కాలాన్ని మహాభాగ్యాలుగా భావిస్తాడు మనిషి.
చంద్రుడి మీద కాలు మోపగలిగిన మానవుడి మేధకు పరిమితులు ఉన్నాయి. అది నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. కొందరు రోగులకు వైద్యం అందించే సమయంలో రోగిని చూసి ‘ఇతను ఆరు నెలలకు మించి జీవించడు’ అనుకున్న సందర్భాలు ఉన్నాయి. అయితే అతను ఆరు ఏండ్లకు పైగా జీవించడం గమనించాను. అలాగే వైద్యానికి వచ్చిన రోగి ఆరోగ్యం చూసి ‘ఈమె పది ఏళ్లకు పైగా జీవిస్తుంది’ అని భావించాను.
కానీ ఆమె పది నెలలకే ఈలోకాన్ని విడిచిపోవడం జరిగింది. ఇలాంటి చిత్రవిచిత్ర అనుభవాలు ఎన్నో నా కళ్లారా చూశాను. అప్పుడు నాకర్థమయ్యింది ఏమిటంటే ఏదో… శక్తి మనల్ని నడిపిస్తోందని! ఆ కనిపించని శక్తికి ‘ఆ దేవుడు, ఈ దేవుడు’ అని మనం రకరకాల పేర్లు పెట్టుకున్నా ఆ శక్తి ఆడించినట్లు ఆడాల్సిందే. పాత్రధారులు మనం, సూత్రధారి ఆయన అని నేను గుర్తించాను. అందుకే అన్నీ సవ్యంగా జరగాలని పూజ చేసి వైద్యానికి వెళ్తాను అని భార్యకు వివరించాడు. పూజా సామగ్రి సర్ది వైద్యుడికి అందించి గుడికి సాగనంపింది భార్య.
…? ఆర్.సి.కృష్ణస్వామి రాజు, 93936 62821