UN Emergency Meeting : ఇరాన్‌పై ఇజ్రాయేల్, అమెరికా సైనికదాడులతో పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరాన్ సైతం తగ్గేదేలే అంటూ గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై క్షిపణులతో విరుచుకుపడుతోంది. ఫలితంగా యుద్ధ తీవ్రత కారణంగా భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవిస్తున్న పరిస్థితుల్లో ఐక్యరాజ్యసమితి అత్యవసరంగా భేటీ కానుంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌పై అమెరికా, ఇజ్రాయేల్ చేపట్టిన సైనిక దాడుల నేపథ్యంలో ఐరాస సమావేశం ఆసక్తి రేపుతోంది.
పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతున్న వేళ.. ఐరాసలోని 15 మందితో కూడిన బృందం సాయంత్రం నాలుగు గంటలకు న్యూయార్క్‌లో అత్యవసరంగా భేటీ అవ్వనుంది. భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 2 గంటలకు ఈ సమావేశం జరుగనుంది. ఇరాన్‌పై ఇజ్రాయేల్, అమెరికా సంయుక్తంగా చేపట్టిన సైనిక దాడులను ఖండిస్తూ.. రష్యా, చైనా, ఫ్రాన్స్, బహ్రెయిన్, కొలంబియా దేశాలు ఐరాస అత్యవసర భేటీని కోరాయి. ఈ సమావేశానికి బ్రిటన్ అధ్యక్షత వహించనుంది. ఇప్పటికే యూఎన్ జనరల్ సెక్రటరీ ఆంటోనియో గుట్టెర్స్ ఇరాన్‌పై దాడులను తీవ్రంగా ఖండించిన విషయం తెలిసిందే.