Fruits | భోజనం తర్వాత పండ్లు తినడం ఆరోగ్యకరమైన అలవాటుగా చాలామంది భావిస్తారు. ముఖ్యంగా మామిడి, యాపిల్, బొప్పాయి వంటి పండ్లను భోజనం అనంతరం స్వీట్లకు ప్రత్యామ్నాయంగా తీసుకోవడం సాధారణం. అయితే భోజనం చేసిన వెంటనే పండ్లు తింటే అవి కడుపులో పులిసిపోయి గ్యాస్, ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలకు దారితీస్తాయనే వాదనలు తరచూ వినిపిస్తుంటాయి. అయితే ఈ వాదనల్లో వాస్తవం ఎంత? నిజంగా పండ్లను ఎప్పుడు తింటే మంచిది? నిపుణుల సూచనల ప్రకారం ఇలా ఉన్నాయి. భోజనం చేసిన వెంటనే పండ్లు తింటే అవి కడుపులో కుళ్లిపోతాయనే వాదనకు శాస్త్రీయ ఆధారం లేదు. మన కడుపులో హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉంటుంది. దీని ఆమ్లత్వం కారణంగా కడుపులో పండ్లు బ్యాక్టీరియా ద్వారా పులిసిపోయే పరిస్థితి ఉండదు. అయితే పండ్లను కాన్బొహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు అధికంగా ఉన్న భోజనం తర్వాత తీసుకుంటే కడుపు ఖాళీ కావడానికి కొంత ఎక్కువ సమయం పడుతుంది. ఇది జీర్ణక్రియలో సహజమైన ప్రక్రియే తప్ప, ఏదైనా సమస్యకు సంకేతం కాదు.
పండ్లలో ఉండే కరిగే పీచు పదార్థం, ముఖ్యంగా యాపిల్, సిట్రస్ పండ్లలో లభించే పెక్టిన్, కడుపు నుంచి ఆహారం బయటకు వెళ్లే వేగాన్ని కొంత తగ్గిస్తుంది. దీని వల్ల ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలుగుతుంది. అలాగే ఆహారంలోని పోషకాలు శరీరంలోకి క్రమంగా శోషించేందుకు ఇది సహాయపడుతుంది. వేగంగా రక్తంలో చక్కెర పెరగకుండా కూడా పీచు కొంతవరకు సహకరిస్తుంది. అయితే భోజనంతోపాటు లేదా వెంటనే పండ్లు తినడం వల్ల ప్రతి ఒక్కరికీ ఒకే విధమైన అనుభవం ఉండదు. ఖాళీ కడుపుతో పండ్లు తింటే వాటిలోని సహజ చక్కెరలు చిన్న ప్రేగులకు వేగంగా చేరుతాయి. భోజనం తర్వాత పండ్లు తింటే ప్రధాన ఆహారంలోని పీచు, ప్రోటీన్, కొవ్వు కారణంగా జీర్ణక్రియ కొంత నెమ్మదిస్తుంది. ఫలితంగా ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉండటానికి ఇది సహాయపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిల విషయంలోనూ పండ్లను భోజనంతో కలిపి తీసుకోవడం కొందరికి ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖ్యంగా టైప్-2 మధుమేహం లేదా ఇన్సులిన్ నిరోధకత ఉన్నవారు పండ్లను ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉన్న ఆహారంతో కలిపి తీసుకుంటే రక్తంలో చక్కెర ఒక్కసారిగా పెరగకుండా కొంత నియంత్రణలో ఉండే అవకాశం ఉంటుంది. అయితే వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితులను బట్టి ఆహార ఎంపికలు మారుతాయి.
మరోవైపు సున్నితమైన జీర్ణవ్యవస్థ ఉన్నవారికి మాత్రం భోజనం చేసిన వెంటనే ఎక్కువ మొత్తంలో పండ్లు తినడం అసౌకర్యాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా పుచ్చకాయ, బేరి, ద్రాక్ష వంటి ఫ్రక్టోజ్ అధికంగా ఉండే పండ్లను ఇప్పటికే నిండుగా ఉన్న కడుపుపై ఎక్కువ పరిమాణంలో తీసుకుంటే గ్యాస్, పొట్ట ఉబ్బరం, అసౌకర్యం వంటివి కనిపిస్తాయి. ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (IBS) ఉన్నవారిలో ఈ సమస్య మరింత స్పష్టంగా ఉంటుంది. భోజనంతో పాటు పండ్లు తీసుకోవడం వల్ల మరో ప్రయోజనం కూడా ఉంటుంది. విటమిన్ సి అధికంగా ఉండే నారింజ, జామ, కివీ వంటి పండ్లు పప్పులు, పాలకూర, సంపూర్ణ ధాన్యాల్లో ఉండే మొక్కల ఆధారిత ఇనుము శరీరంలో శోషించేందుకు సహాయపడతాయి. అందువల్ల కొన్ని సందర్భాల్లో ప్రధాన భోజనంతో పండ్లు తీసుకోవడం పోషకాల శోషణకు ఉపయోగకరంగా ఉంటుంది. పండ్లు తినడానికి ఒకే ఒక్క ఉత్తమ సమయం అంటూ కచ్చితమైన నియమం లేదు. పండ్లను ఎప్పుడు తింటున్నామన్న దానికంటే రోజువారీ ఆహారంలో వాటిని తగిన పరిమాణంలో చేర్చుకోవడం ముఖ్యం. భోజనం తర్వాత పండ్లు తిన్నప్పుడు బరువుగా లేదా పొట్ట ఉబ్బరంగా అనిపిస్తే, వాటిని భోజనం తర్వాత ఒకటి నుంచి రెండు గంటల విరామంతో తీసుకోవచ్చు. ఉదయం 11 గంటల సమయంలో లేదా సాయంత్రం 4 గంటల సమయంలో చిరుతిండిగా తీసుకోవడం కూడా ఒక ఎంపిక.
పండ్లను ఎక్కువ పరిమాణంలో ఒకేసారి తినకుండా తగిన మోతాదులో తీసుకోవడం మంచిది. ఉదాహరణకు చిన్న యాల్ లేదా కొద్దిగా బెర్రీలు సరిపోతాయి. ముఖ్యంగా అధిక కేలరీల భోజనం చేసిన వెంటనే పెద్ద గిన్నె నిండా పండ్లు తినడం అవసరం లేదు. పండ్ల రసాల కంటే సంపూర్ణ పండ్లకు ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. పండ్లను రసంగా మార్చినప్పుడు పీచు పదార్థంలో కొంత భాగం తొలగిపోతుంది. దీంతో సహజ చక్కెరలు శరీరంలోకి వేగంగా చేరే అవకాశం ఉంటుంది. సంపూర్ణ పండ్లలోని పీచు జీర్ణక్రియను నియంత్రించడంలో, రక్తంలో చక్కెర వేగంగా పెరగకుండా చూడడంలో సహాయపడుతుంది. గ్యాస్ట్రో-ఈసోఫేజియల్ రిఫ్లక్స్ (GERD) సమస్య ఉన్నవారు కూడా పండ్ల ఎంపిక, సమయంపై కొంత జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా రాత్రి ఆలస్యంగా నారింజ, నిమ్మ వంటి సిట్రస్ పండ్లు తీసుకోవడం వల్ల కొందరిలో యాసిడ్ రిఫ్లక్స్ లక్షణాలు పెరిగే అవకాశం ఉంటుంది. ఆరోగ్యంగా ఉన్న చాలా మందికి భోజనం చేసిన వెంటనే పండ్లు తినడం హానికరం కాదు. పండ్లు కడుపులో కుళ్లిపోవడం లేదా పులిసిపోవడం వల్ల జీర్ణక్రియ దెబ్బతింటుందనే వాదనకు ఆధారం లేదు. అయితే సున్నితమైన జీర్ణవ్యవస్థ, తరచూ పొట్ట ఉబ్బరం వంటి సమస్యలు ఉన్నవారు భోజనం తర్వాత ఒకటి నుంచి రెండు గంటల విరామంతో పండ్లు తీసుకోవడం ద్వారా అసౌకర్యాన్ని తగ్గించుకోవచ్చు. చివరికి పండ్లను ఏ సమయంలో తింటున్నామన్న దానికంటే, వాటిని సరైన పరిమాణంలో, సంపూర్ణ రూపంలో తీసుకోవడం, మన శరీరం ఎలా స్పందిస్తుందో గమనించడం మరింత ముఖ్యమైన విషయమని నిపుణులు చెబుతున్నారు.