సనొ:ఆసియా క్రీడల్లో మెన్స్ క్రికెట్ పోటీల ఆరంభానికి ముందు వరల్డ్ చాంపియన్ టీమిండియాను పసికూన జపాన్ భయపెట్టింది. స్నేహపూర్వక పోటీ కాస్తా నరాలు తెగే ఉత్కంఠ నడుమ ముగిసింది. ఇరుజట్ల మధ్య మంగళవారం జరిగిన పోరులో ఆ జట్టు శ్రేయస్ అయ్యర్ సేనను ఓడించినంత పనిచేసినా అనుభవలేమితో పరాభవం వైపు నిలిచింది. వర్షం కారణంగా ఐదు ఓవర్లు మాత్రమే సాధ్యమైన ఆటలో మెన్ ఇన్ బ్లూ నిర్దేశించిన 33 పరుగుల ఛేదనలో జపాన్ 30/3 చేసి పోరాడి ఓడింది.
మొదట టాస్ గెలిచి బ్యాటింగ్కు వచ్చిన టీమిండియా 5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 32 పరుగులే చేయగల్గింది. టాప్-3 బ్యాటర్లు, ప్రపంచ టీ20 ర్యాంకింగ్స్లో 1, 2వ స్థానాల్లో ఉన్న ఇషాన్ కిషన్ (3) విఫలమవగా అభిషేక్ శర్మ డకౌట్ అయ్యాడు. సంజూ శాంసన్ (9)దీ అదే కథ. కానీ కెప్టెన్ శ్రేయస్ (12 బంతుల్లో 16, 1 ఫోర్) రెండంకెల స్కోరు చేశాడు. భారత ఇన్నింగ్స్లో రెండంటే రెండే ఫోర్లు నమోదయ్యాయి. స్వల్ప ఛేదనలో జపాన్.. వాషింగ్టన్ (2/13), అక్షర్ పటేల్ (0/7) స్పిన్ మాయతో 30/3కే పరిమితమైంది. జపాన్ సారథి కెండెల్ కడోవాకి (12), బెంజిమిన్ (9) గెలుపు కోసం పోరాడినా సఫలం కాలేకపోయారు.
1 టీ20ల్లో భారత్కు ఇది 200వ విజయం. 2006లో సౌతాఫ్రికాపై మొదటి విజయం నమోదుచేసిన మెన్ ఇన్ బ్లూ.. ఈ ఘతన సాధించిన తొలి జట్టుగా రికార్డులకెక్కింది.