హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ): దళితులు, ఆదివాసీలు, గిరిజనుల అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తున్నదని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం-1989 అమలుపై సమావేశం జరిగింది. రాష్ట్రంలో చట్టం అమలు, నమోదైన కేసులు, దర్యాప్తు పురోగతి, న్యాయస్థానాల్లో విచారణ, కేసుల పరిష్కారం, బాధితులకు అందుతున్న ఆర్థిక సహాయం, పునరావాస చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ అత్యాచార ఘటనలపై ప్రభుత్వం మానవీయ కోణంలో స్పందిస్తున్నదని వెల్లడించారు. బాధితులకు నష్టపరిహారాన్ని బడ్జెట్‌తో ముడిపెట్టకుండా గ్రీన్‌చానల్‌లో విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు.
రాష్ట్రంలో ఐదేండ్లలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు తగ్గుముఖం పట్టాయని ఈ సందర్భంగా అధికారులు వివరించారు. 73 గ్రామాల్లో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయని నివేదించారు. సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎంపీలు మల్లు రవి, బలరాంనాయక్, కడియం కావ్య, ఎమ్మెల్యేలు లక్ష్మీకాంతారావు, సత్యం, సత్యనారాయణ, వీరేశం, సామేల్, రాగమయి, బొజ్జు, మురళీనాయక్, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌జాజు, డీజీపీ సీవీ ఆనంద్, ఎస్సీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య, జాతీయ ఎస్సీ కమిషన్ డైరెక్టర్ సునీల్‌బాబు పాల్గొన్నారు.
ఆదిలాబాద్, వరంగల్ విమానాశ్రయాలు, ఢిల్లీలోని తెలంగాణ భవన్ నిర్మాణాలు తెలంగాణ సంసృతికి ప్రతీకలుగా ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఈ నిర్మాణాలపై మంగళవారం సమీక్షించారు. తెలంగాణ చరిత్ర, సంసృతికి ప్రతిరూపాలుగా ఉన్న కాకతీయ కళాతోరణం, రామప్ప, పిల్లలమర్రి ఆలయాలను పరిశీలించి, అవి ప్రతిబింబించేలా చేపట్టాలని సూచించారు.