Mrunal Thakur | నటిగా లొకేషన్లో ఇబ్బందిపడ్డ సందర్భం ఏమైనా ఉందా? అని ఓ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు మృణాళ్ఠాకూర్ ఆసక్తికరమైన సమాధానం ఇచ్చింది. మృణాల్ అభిమాన నటుడు షాహిద్ కపూర్. ఆయనతో కలిసి నటించిన ‘జెర్సీ’ చిత్రం నాటి ఆన్ లోకేషన్ ఎక్స్‌పీరియన్స్‌ని మీడియా ముందు నెమరువేసుకుంది మృణాళ్. ‘నాకు షాహిద్ అంటే పిచ్చి. అలాంటి నాకు వరంగా వచ్చింది ‘జర్సీ’ ఆఫర్. సంబరపడిపోతూ సైన్ చేశాను. నాకు షాహిద్ నవ్వు అంటే చాలా ఇష్టం. లొకేషన్లో ఆయన నవ్వుతుంటే అలాగే చూస్తూవుండేదాన్ని. ఆయన నావైపు చూసి, ఏంటలా చూస్తున్నావ్? అనడిగారు. ‘సినిమాల్లోనే కాదు, రియల్‌గా కూడా మీ నవ్వు చాలా బావుంది’ అని చెప్పేశాను.
ఆయన నవ్వుకున్నారు. షాహిద్‌తో నటించిన రోజుల్ని జీవితంలో మరిచిపోలేను. అదే లొకేషన్లో నేను ఇబ్బంది పడ్డ సందర్భం కూడా ఒకటుంది. కథ రీత్యా నేను షాహిద్‌ని చెంపదెబ్బ కొట్టాలి. తనేమో నా అభిమాన నటుడు. ఆయన్ని కొట్టడం అంటే అంతకంటే శిక్ష వేరొకటి ఉండదు. కానీ కథలో కీలకమైన సీన్.. తప్పదు. అందుకే.. నిదానంగా కొడతాను.. మీరు ఎడిట్ చేసుకోండి అని దర్శకుడు గౌతమ్ తిన్ననూరికి చెప్పాను. ఆయన ఒప్పులేదు.
గట్టిగా కొట్టాల్సిందే అన్నారు. షాహిద్ కూడా కొట్టమని బలవంతపెట్టాడు. పైగా ‘నీ ఎక్స్ బాయ్‌ఫ్రెండ్‌ను గుర్తుచేసుకో.. గట్టిగా కొట్టెయ్..’ అంటూ మోటివేట్ చేశాడు. ఆ ఒక్క సీన్ చేయడానికి మూడు గంటలు పట్టింది. షాట్ బాగా రావడానికి రెండుమూడు సార్లు కొట్టాల్సొచ్చింది. నా జీవితంలో నటిగా నేను బాగా ఇబ్బందిపడ్డ సీన్ అదే’ అంటూ చెప్పుకొచ్చింది మృణాళ్ఠాకూర్.