మూసీని అభివృద్ధి చేసే సత్తా లేకపోతే రేవంత్ రెడ్డి తప్పుకోవాలి. ఆ ప్రాజెక్టును బీఆర్ఎస్కు అప్పగిస్తే రూ.16 వేల కోట్లతోనే సుందరీకరిస్తం. మూసీ అభివృద్ధికి అన్ని పార్టీలు కృషి చేసినా బీఆర్ఎస్ పాలనలోనే 55 కిలోమీటర్ల మేర నది పునరుజ్జీవానికి బీజం పడింది. మంచిరేవుల నుంచి మొదలుకొని ఘట్కేసర్ వరకు నదికి ఇరువైపులా ఎస్టీపీలు, ఎక్స్‌ప్రెస్ వేలు, సుందరవనాలు, రిక్రియేషనల్ జోన్లు ఏర్పాటు చేసిన ఘనత బీఆర్ఎస్ది.
-కేటీఆర్

హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 5 (నమస్తే తెలంగాణ) : కమీషన్ల కోసం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కక్కుర్తి పడుతున్నాడనీ, మూసీ అభివృద్ధి పేరిట లక్షన్నర కోట్లు లూటీ చేసేందుకు సిద్ధమయ్యాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. మూసీ అభివృద్ధి చేతగాకపోతే తప్పుకొని తమకు అప్పగిస్తే రూ.16 వేల కోట్లతోనే సుందరీకరణ చేసి చూపిస్తామని సవాల్ విసిరారు. ‘అభివృద్ధి పేరిట పేదల ఇండ్లను కూల్చివేస్తాం.. మూసీ పునరుజ్జీవం పేరిట వేల కోట్లు దోచుకుంటామంటే ఊరుకునేది లేదు’ అని హెచ్చరించారు.
అభివృద్ధికి బీఆర్ఎస్ వ్యతిరేకం కాదనీ, కేవలం కాంగ్రెస్ నేతల లూటీ రాజకీయాలను చూస్తూ ఊరుకోబోమని చెప్పారు. పదేండ్ల కేసీఆర్ పాలనలో ఒక్క ఇటుక కూడా కూల్చకుండా రూ.5 వేల కోట్లతోనే 32 ఎస్టీపీలు, ఐదు కిలోమీటర్ల సుందరవనాలను మూసీ వెంట నిర్మించామని గుర్తుచేశారు. గురువారం ఎల్బీనగర్, ఉప్పల్, అంబర్పేట్ నియోజకవర్గాల పరిధిలోని మూసీ పరీవాహక ప్రాంతాల్లో కేటీఆర్‌తో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పర్యటించి బాధితులకు ధైర్యం చెప్పారు. నాగోల్ ఎస్టీపీని పరిశీలించారు.
మూసీ ఆక్రమణల పేరిట సర్కార్ చేస్తున్న బెదిరింపులతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని కేటీఆర్ వాపోయారు. ఎలాంటి విధ్వంసానికి తావు లేకుండానే మూసీని అభివృద్ధి చేయవచ్చని సూచించారు. కేసీఆర్ హయాంలో పేద, మధ్యతరగతి వర్గాలను కడుపులో పెట్టుకొని చూసుకున్నారని, కాంగ్రెస్ వచ్చాక లక్షన్నర కుటుంబాలను మూసీ పేరిట రోడ్డున పడేసే కుట్రలు చేస్తున్నదని మండిపడ్డారు. అవినీతి సొమ్ము కోసం లక్షల మంది పేదల ఇండ్లను కూలగొట్టే ప్రయత్నాన్ని మానుకోవాలని హెచ్చరించారు.
బీఆర్ఎస్ పాలనలోనే బీజం
మూసీ అభివృద్ధికి అన్ని పార్టీలూ కృషి చేసినా బీఆర్ఎస్ పాలనలోనే 55 కిలోమీటర్ల మేర మూసీ పునరుజ్జీవానికి బీజం పడిందని కేటీఆర్ గుర్తుచేశారు. మంచిరేవుల నుంచి మొదలుకొని ఘట్కేసర్ వరకు నదికి ఇరువైపులా ఎస్టీపీలు, ఎక్స్‌ప్రెస్ వేలు, సుందరవనాలు, రీక్రియేషనల్ జోన్లు ఏర్పాటు చేసిన ఘనత బీఆర్ఎస్కే దక్కిందని చెప్పారు. రూ.6 కోట్లతో ఐదున్నర కిలోమీటర్ల మేర వాకింగ్ ట్రాక్‌లు, పార్కులు, ఓపెన్ జిమ్‌లు, 15 బ్రిడ్జిలు, చెక్‌డ్యామ్‌ల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించామని తెలిపారు.
10 ఎకరాల విస్తీర్ణంలో రూ. 30 కోట్లతో శిల్పారామాన్ని అభివృద్ధి చేశామని గుర్తుచేశారు. దశల వారీగా మూసీ అభివృద్ధిని పట్టాలెక్కించే క్రమంలో తొలి దశలో ఎస్టీపీల నిర్మాణం, రెండో దశలో గోదావరి జలాలతో నింపేందుకు రూ.16 వేల కోట్లతోనే ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. నగరంలో 99 శాతం మురుగునీటిని శుద్ధిచేసి, స్వచ్ఛమైన నీటిని మూసీలోకి విడుదల చేసే అధునాతన సాంకేతికతను తీసుకువచ్చామని చెప్పారు. కానీ కాంగ్రెస్ సర్కార్ ఎలాంటి డీపీఆర్ లేకుండానే లక్షన్నర కోట్లు ఖర్చు చేయాలనుకోవడం వెనుక కేవలం కమీషన్ల కోసం సీఎం రేవంత్‌రెడ్డి ఆరాటం మాత్రమే ఉన్నదని విమర్శించారు.

Ktr
భయాందోళనలో ప్రజలు
ఎన్నికల ముందు పేదలకు అండగా ఉంటామని, అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందిస్తామని, ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేస్తామని ఊదరగొట్టి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి.. ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడని కేటీఆర్ మండిపడ్డారు. హైదరాబాద్ నగరంతోపాటు, రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఎప్పుడు బుల్డోజర్లు వస్తాయోనని, ఎప్పుడు తమ ఇండ్లు కూలగొడుతారోనని ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకున్నారని వాపోయారు.
ఇందిరమ్మ రాజ్యం పేరిట హైడ్రా బుల్డోజర్లు రాజ్యమేలుతున్నాయని దుయ్యబట్టారు. మూసీ పేరిట నగరంలో సృష్టిస్తున్న విధ్వంసంపై కాంగ్రెస్ సర్కార్‌ను వచ్చే అసెంబ్లీలో నిలదీస్తామని చెప్పారు. రేవంత్‌రెడ్డి చేస్తున్నది మూసీ బ్యూటిఫికేషన్ కాదనీ, లూటిఫికేషన్ అని పునరుద్ఘాటించారు. మూసీ నది ఆక్రమణల పేరిట పేదల ఇండ్లు కూల్చుతున్న రేవంత్ రెడ్డికి బఫర్ జోన్లో ఉన్న మంత్రులు వివేక్, పొంగులేటి, విప్ పట్నం మహేందర్ రెడ్డి, కేవీపీ ఇండ్లను కూల్చే దమ్ముందా? అని ప్రశ్నించారు. స్వయంగా కోస్గిలో రేవంత్‌రెడ్డి కట్టుకున్న ఇల్లు రెడ్డికుంటలో ఉన్నదని, ఆయన సోదరుడు తిరుపతి రెడ్డి దుర్గం చెరువులో కట్టుకున్న ఇంటిని ముందుగా కూల్చివేయాలని డిమాండ్ చేశారు.
బాధితులకు కేటీఆర్ అభయం
మూసీ పరీవాహక ప్రాంతంలో కాంగ్రెస్ సృష్టించిన భయానక వాతావరణంలో కొట్టుమిట్టాడుతున్న ప్రజలకు కేటీఆర్ అభయమిచ్చారు. పర్యటనలో అడుగడుగునా బాధితులకు భరోసానిచ్చారు. పేదల ఇండ్ల మీదికి వచ్చే కాంగ్రెస్ బుల్డోజర్లను బీఆర్ఎస్ అడ్డుకుంటుందని స్పష్టం చేశారు. మూసీ పక్కన నివాసాలు కోల్పోతున్న చైతన్యపురి, సత్యనగర్, న్యూ మారుతీనగర్, ఫణిగిరికాలనీ, వినాయకనగర్ కాలనీల నుంచి బాధితులు వచ్చి కేటీఆర్ ఎదుట తమ గోడు వెల్లబోసుకున్నారు. ఆదుకోవాలని, తమ ఇండ్లు కూలకుండా కాపాడాలని వేడుకున్నారు. వారికి అండగా ఉంటామని కేటీఆర్ భరోసా ఇచ్చారు. అనంతరం వాకింగ్ ట్రాక్‌పై స్వీపింగ్ పనులు చేస్తున్న సిబ్బందితో కేటీఆర్ మాట్లాడారు.
వేదికపై బాధితుడి రోదన
మూసీ అభివృద్ధి పేరిట కాంగ్రెస్ సర్కార్ తన ఇంటిని కూల్చుతామంటున్నదని ఓ బాధితుడు కన్నీరుమున్నీరయ్యాడు. అప్పు చేసి అన్ని అనుమతులతో కట్టుకున్న ఇంటిని కూల్చితే తమ గతి ఏం కావాలని రోదించాడు. తమకు అండగా ఉండాలని కేటీఆర్‌ను వినాయకనగర్ ప్రాంతానికి చెందిన మహేశ్ వేడుకున్నాడు. కేటీఆర్ ఉన్న వేదికపై బోరున విలపించాడు. మూసీ అభివృద్ధి పేరిట తనలాంటి వారితో ప్రభుత్వం చెలగాటమాడుతున్నదని ఆవేదన వ్యక్తంచేశాడు. గర్భిణి ఉన్నదనే సోయి కూడా లేకుండా తన భార్యను గదిలో బంధించారని, ఇంట్లో పరిస్థితి బాగా లేదని చెప్పినా పట్టించుకోలేదని కన్నీటిపర్యంతమయ్యాడు. ఇంటిని కూల్చుతామంటే గతంలో తాను ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించానని చెప్పాడు.

Ktr
పదేండ్ల కేసీఆర్ పాలనలో ఒక్క ఇటుక కూడా కూల్చకుండా.. రూ. 5 వేల కోట్లతోనే 32 ఎస్టీపీలు, ఐదు కిలోమీటర్ల సుందర వనాలను మూసీ వెంబడి నిర్మించినం. కానీ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రెండున్నరేండ్లలోనే మూసీ పేరిట లక్షన్నర కుటుంబాలను రోడ్డున పడేసే కుట్రలు పన్నుతున్నది. పరీవాహక ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నది.
-కేటీఆర్
సర్కార్ మా జోలికి రావద్దు
నాకు భర్త లేడు. ఇండ్లలో పాచి పనులు చేసుకుంటూ నా పిల్లలను పోషించుకుంటున్న. ఎంతో కష్టపడి చిన్నపాటి ఇల్లు కట్టుకున్నం. ఇప్పుడు ప్రభుత్వం మూసీ అభివృద్ధి అని మా ఇంటిని కూలగొడుతామంటున్నది. మేం యాడికి పోవాలె సారూ.. మా ఇంటిని విడిచి వెళ్లేది లేదు. ఈ ప్రభుత్వం మా జోలికి రావద్దు. కేటీఆర్ సారూ.. మాకు అన్నీ మీరే.. మీరు ముందుండి మా ఇండ్లు పోకుండా చూడాలె.
– బాధితురాలు లలిత, వినాయకనగర్
నా గతేంగావాలె?
నేను చిన్న పెయింటర్‌ను. 50 గజాలు కొనుక్కొని ఇల్లు కట్టుకున్న. మూసీ అభివృద్ధి అని నా ఇల్లు కూలగొడుతామంటున్నరు. అది పోతే నా గతి ఏంగావాలె? మా ఇంటి జోలికి వస్తే ఊరుకునేది లేదు. కాంగ్రెస్‌ను బొంద పెట్టే రోజులు దగ్గరలోనే ఉన్నయ్. కేటీఆర్ సారే మమ్మల్ని ఆదుకోవాలె.
– బాధితుడు నిరంజన్, ఫణిగిరి కాలనీ