హైదరాబాద్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ట్రిపుల్ఆర్ ఉత్తర భాగం రహదారి నిర్మాణానికి మోక్షం లభించడంలేదు. అనుమతులివ్వడంలో కేంద్రంలోని బీజేపీ సర్కార్ జాప్యం.. రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ వైఫల్యంతో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నచందంగా తయారైంది. దీంతో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) ఈ ప్రాజెక్టుకు సంబంధించిన టెండర్ల గడువును ఆరోసారి ఆగస్టు 20 వరకు పొడిగించడం చర్చనీయాంశంగా మారింది.
భారత్‌మాల పరియోజన్ ఫేస్-1 కింద జాతీయ రహదారి 161ఏఏలో భాగంగా 161 కిలోమీటర్ల పొడువుతో సంగారెడ్డి-చౌటుప్పల్ మధ్య ఆరు లేన్ల రోడ్డును నిర్మించాలని నిర్ణయించారు. హైబ్రిడ్ యాన్యుటీ మాడల్ (హ్యామ్) ద్వారా ప్రాజెక్టు అమలును ప్రతిపాదించా రు. ఇందుకు సంబంధించి నవంబర్ 11, 2025న ఎన్హెచ్ఏఐ తొలిసారి టెండర్లు ఆహ్వానించింది. కేంద్రం అనుమతులివ్వడంలో జాప్యం చేస్తుండటంతో టెండర్ల ప్రక్రియ పదేపదే వాయిదా పడుతున్నది.
బీఆర్ఎస్ హయాంలో 2021 ఫిబ్రవరిలో ట్రిపుల్ఆర్ ఉత్తరభాగానికి సూత్రప్రాయంగా అనుమతి లభించింది. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాజెక్టును వేగవంతం చేయాలని కేంద్రానికి విజ్ఞప్తిచేశారు. భూసేకరణ వ్యయంలో 50% రాష్ట్ర ప్రభుత్వం భరించేందుకు అంగీకరించారు. ట్రిపుల్ఆర్ దక్షిణ భాగానికి సైతం అనుమ తి ఇవ్వాలని కోరారు. ఈ ప్రాజెక్టు కోసం 1,918 హెక్టార్ల భూమి అవసరం ఉండగా ఇందులో సుమారు 60% భూసేకరణ పూర్తిచేసినట్టు ఆర్అండ్బీ అధికారులు చెప్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి న తర్వాత ట్రిపుల్ఆర్ ఉత్తర, దక్షిణ భాగం ప్రాజెక్టుల పురోగతి ఆలస్యమవుతున్నది.
దక్షిణ భాగం అలైన్‌మెంట్‌ను మార్చడం వివాదాస్పదమైంది. సర్కార్ పెద్దలు తమ అనుకూలురు, అనుయాయుల భూములను కాపాడేందుకు అలైన్‌మెంట్‌ను మా ర్చారని దుమారం రేగింది. ఇదేమీ పట్టని ప్రభుత్వం మొండిగా వ్యవహరించింది. అభ్యంతరాలను లెక్కచేయకుండా చౌటుప్పల్, ఆమన్‌గల్, సంగారెడ్డి మీదుగా 201 కిలోమీటర్ల సవరించిన ట్రిపుల్ఆర్ దక్షిణ భాగానికి ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో ఉత్తర భాగానికి అనుమతిలిచ్చేందుకు కేంద్రం జాప్యం చేస్తున్నదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
గత నెలలలో సీఎం రేవంత్‌రెడ్డి కేంద్ర రహదారుల మంత్రి నితిన్‌గడ్కరీని కలిసి ట్రిపుల్ఆర్ ఉత్తర భాగానికి 95% భూసేకరణ పూర్తయిందని వివరించారు. ఉత్తర, దక్షిణ భాగాల నిర్మాణాన్ని ఒకే విడత చేపట్టేందుకు అనుమతించాలని కోరారు. అయినప్పటికీ కేంద్రం అంగీకరించలేదు. గత జూలై 29న బీజేపీ ఎంపీ లక్ష్మణ్ రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు మంత్రి నితిన్ గడ్క రీ సమాధానం ఇస్తూ.. ట్రిపుల్ఆర్ ఉత్తర భాగానికి సంబంధించి సమగ్ర నివేదిక సిద్ధమైందని వెల్లడించారు.
161.51 కిలో మీటర్ల పొడవైన ఆరులేన్ల నార్త్ ట్రిపుల్ఆర్ను హ్యామ్ మాడల్‌లో రూ.23,935 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించాలన్న ప్రతిపాదనను పబ్లిక్- ప్రైవేట్ పార్ట్నర్షిప్ అప్రైజల్ కమిటీ పరిశీలించిందని చెప్పారు. అయితే మొత్తం పెట్టుబడి, డీపీఆర్ రిపోర్ట్, రోడ్డు కనెక్టివిటీ అవసరాలు, ట్రాఫిక్ తీవ్రత, పీఎం గతిశక్తి జాతీయ మాస్టర్‌ప్లాన్‌తో సమన్వయం లాంటి అంశాల ఆధారంగా ప్రాజెక్టు ప్రారంభ తేదీపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టంచేశారు. ప్రాజెక్టు అమలు, టైంలైన్, సాధ్యాసాధ్యాలపై అధ్యయనం పూర్తయి ఆమోదం పొందిన తర్వాత టెండర్ ఖరారవుతున్నదని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం టెండర్ గడవును ఆగస్టు 20 వరకు పొడిగించిందని అధికారులు చెప్తున్నారు.