– జూలూరుపాడులో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం
– యూపీఐ లావాదేవీలపై పన్నును తక్షణమే ఎత్తేయాలి
– సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ ఆధ్వర్యంలో ఆందోళన
జూలూరుపాడు, సెప్టెంబర్ 18 : కేంద్ర ప్రభుత్వం యూపీఐ లావాదేవీలపై విధించిన మర్చంట్ డిస్కౌంట్ రేట్ పన్నును తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ ఆధ్వర్యంలో శుక్రవారం జూలూరుపాడు బస్టాండ్ సెంటర్లో నిరసన ర్యాలీ నిర్వహించి, రాస్తారోకో చేశారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ కొత్తగూడెం డివిజన్ కార్యదర్శి జాటోతు కృష్ణ మాట్లాడుతూ.. దేశంలో డిజిటల్ విప్లవానికి మారుపేరుగా నిలిచిన యూపీఐ చెల్లింపులపై పన్ను విధించడం సామాన్యుల నడ్డి విరవడమేనని విమర్శించారు. కేవలం అమెరికన్ కార్పొరేట్ శక్తుల ప్రయోజనాల కోసమే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని ఆయన ఆరోపించారు. వాణిజ్య లావాదేవీలపై విధించే అతి స్వల్ప పన్ను మాత్రమేనని ప్రభుత్వం సమర్థించుకోవడం హాస్యాస్పదమన్నారు. వ్యాపారులు ఈ పన్ను భారాన్ని అంతిమంగా వినియోగదారుల నుంచే ముక్కుపిండి వసూలు చేస్తారన్న కనీస వాస్తవాన్ని కేంద్రం విస్మరించడం శోచనీయమన్నారు. ఈ నిర్ణయం వల్ల దేశ ప్రజలపై సుమారు రూ. 30 వేల కోట్లకు పైగా అదనపు భారం పడనుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
గతంలో బ్రిటిష్ వాళ్లు భారతీయులకు ఉచితంగా టీ, కాఫీలు అలవాటు చేసి ఆ తర్వాత లక్షల కోట్ల వ్యాపారం చేసిన తరహాలోనే.. నేడు అమెరికన్ యూపీఐ కంపెనీలు వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. పదేళ్ల పాటు ఉచిత సేవలు అందించి ప్రజలందరికీ అలవాటు చేసిన తర్వాత, నేడు వాణిజ్య లావాదేవీల పేరుతో మొదలుపెట్టి భవిష్యత్తులో సామాన్యులపైనా నేరుగా పన్నుపోటు పొడిచే ప్రమాదం ఉందన్నారు. ప్రజలు చెల్లిస్తున్న పన్నులు దేశ అభివృద్ధికి ఉపయోగపడకపోగా, ప్రభుత్వ ఆస్తులను కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతున్నారని ఆయన దుయ్యబట్టారు. మోదీ పాలనలో నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతుంటే, ప్రజల ఆదాయాలు పాతాళానికి పడిపోయాయని.. ఈ తరుణంలో యూపీఐపై పన్ను వేయడం మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా మారిందని విమర్శించారు. తక్షణమే ఆన్లైన్ లావాదేవీలపై విధించిన పన్నును రద్దు చేసి, డిజిటల్ చెల్లింపులను మరింత సరళతరం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ జిల్లా నాయకుడు ఎద్దులాపురం గోపాలరావు, మండల నాయకుడు బానోత్ ధర్మ, ఏఐయూకేఎస్ నాయకుడు రాజశేఖర్, మండల కార్యదర్శి తోటకూరి నరేష్, బైరు వెంకన్న, మండల నాయకులు రాయల శ్రీను, భద్రు, దీప్లా, కుమార్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.