వాషింగ్టన్, మార్చి 5: ‘సబ్‌మెరైన్‌తో శత్రు యుద్ధ నౌక ధ్వంసం..’ ఎప్పుడో రెండో ప్రపంచ యుద్ధంలో ఇలాంటి దాడి గురించి విన్నాం. మళ్లీ ఇప్పుడు ఇరాన్-అమెరికా యుద్ధంలో కొన్ని దశాబ్దాల తర్వాత అగ్రరాజ్యం అలాంటి దాడి ఇరాన్ నౌకపై చేసింది. హిందూ మహాసముద్రంలో కొన్ని వేల మైళ్ల దూరంలో ఉన్న ఇరాన్ యుద్ధ నౌకపై నీటి దిగువన మోహరించి ఉన్న అమెరికా జలాంతర్గామి నుంచి సముద్రగర్భ బ్రహ్మాస్త్రంలాంటి ‘మార్క్ 48 టోర్పిడో’ను ప్రయోగించి శత్రునౌకను తుత్తునియలు చేసింది.
సాధారణంగా యాంటీ-షిప్ క్షిపణులు నౌకలను సముద్ర ఉపరితలం మీద నుంచి టార్గెట్ చేస్తాయి. కానీ మార్క్ 48 టోర్పిడో మాత్రం నౌక కింది భాగానికి వెళ్లి పేల్చేస్తుంది. అది లక్ష్యాన్ని తాకినప్పుడు పెద్ద గ్యాస్ బుడగ ఏర్పడి వేగంగా వ్యాపిస్తుంది. దాంతో నౌక ముక్కలై మునిగిపోతుంది. ఒక వేళ నౌక నిర్మాణానికి ఏమీ కాకపోతే అతి ముఖ్యమైన ప్రొపల్షన్ వ్యవస్థ ధ్వంసం అవుతుంది. ఇరాన్ నౌక ఐరిస్ దేనాపై అమెరికా ప్రయోగించిన ఈ మార్క్ 48 టోర్పిడో అత్యంత కచ్చితత్వంతో పనిచేసింది.
దాడి సమయంలో నౌకలో 180 మంది ఉండగా, 32 మందిని శ్రీలంక భద్రతా దళాలు రక్షించగా, మిగతా వారు గల్లంతయ్యారు. ఇప్పటివరకు 87 మృతదేహాలను వెలికితీశారు. కాగా, ఈ విధ్వంసానికి కారణమైన మార్క్ 48 అత్యంత బరువైన వైర్ గైడెడ్ టోర్పిడో. 19 అడుగుల పొడవు, 21 అంగుళాల వ్యాసం కలిగిన ఈ టోర్పిడో బరువు సుమారు 1700 కిలోలు. గంటకు 100 కి.మీ వేగంతో ప్రయణిస్తూ కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలపై దాడి చేయగలదు. ఒక వేళ లక్ష్యాన్ని సాధించకపోయినా, ఇది రీ ఎంగేజ్ అయ్యి, దానిని వేటాడగల సాంకేతికత దీని సొంతం. తయారీకి సుమారు రూ.38 కోట్లు ఖర్చవుతుంది.