చేతనైతే సాయం చెయ్యాలె.. లేకుంటే చేతులు ముడుచుకొని కూర్చోవాలె.. ఇది తరతరాలుగా మన పెద్దలు నేర్పిన మాట.
కట్‌చేస్తే.. పండుగ లేదు.. పబ్బం లేదు.. పగలు లేదు.. సాయంత్రం లేదు.. పిల్లలు లేరు..పెద్దలు లేరు.. తిండి లేదు.. పుస్తకాలు లేవు.. ఒకటే పని బుల్డోజర్తో రావడం.. వరుసగా ఇండ్లను నేలమట్టం చేసి పోవడం.. ఇది హైడ్రా విధ్వంసం..
ఎందుకు వచ్చామో చెప్పనక్కరలేదు.. నోటీసులు ఉండవు.. నా ఇష్టం అన్నదే దీని తీరు. సానుభూతి, కనికరం, దయా దాక్షిణ్యాలు, మంచి చెడులు ఇవేమి దానికి పట్టవు. ఎవరు ఏమన్నా.. ఎవరు ఎదురొచ్చినా.. జాన్తానై అన్నదే దాని నైజం.
చివరికి పుస్తకాలు తీసుకుంటా అంకుల్ ఒక్క నిమిషం సమయం ఇవ్వండి అం టూ ఓ చిన్నారి వేడుకున్నా హైడ్రా కనికరించలేదు. అప్పుతెచ్చి వాటర్ ప్లాంట్ పెట్టుకున్నా వదిలేయండి అంటూ ఓ వ్యక్తి హైడ్రా అధికారులు, పోలీసుల కాళ్లు పట్టుకున్నా వినలేదు. కాంగ్రెస్ సర్కార్ వచ్చాక హైడ్రా సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. ఈ దృశ్యాలే అందుకు సజీవ సాక్ష్యాలు.
ఈ చిత్రంలో బుల్డోజర్కు అడ్డంగా పడుకున్న వృద్ధురాలు రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని హైదర్‌గూడ నలందనగర్ నివాసి. పార్కు స్థలాన్ని ఆక్రమించా రంటూ ఇండ్లు కూల్చడానికి వచ్చిన బుల్డోజర్ను అడ్డుకోవడానికి ఈ వృద్ధురాలు ప్రాణాలను పణంగా పెట్టింది.

ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఏకపక్షంగా ఇండ్లు కూల్చివేస్తే తమ బతుకులు రోడ్డుమీద పడుతాయని కన్నీరు కార్చింది. ముందు మా ప్రాణం తీసి తర్వాత ఇండ్లు కూల్చుకోండని ఆక్రోశం వెళ్లగక్కింది.
ఆ స్థలం నల్ల చెరువు ఎఫ్టీఎల్ పరిధిలోకి వస్తుందని ఆ పేదలకు తెలియదు.. ఏదో తక్కువ కిరాయికి వస్తుందని తీసుకొని సొంత ఖర్చులతో రేకుల షెడ్డు నిర్మించుకున్నారు. దానికి ఆస్తిపన్ను, కరెంటు బిల్లులు కూడా కడుతున్నారు.

అంతా సాఫీగా సాగుతుండగా ఒక్కసారిగా హైడ్రా అనే పిడుగు వచ్చి పడింది. జీవనోపాధి కోసం నిర్మించుకున్న నిర్మాణాన్ని నేలమట్టం చేసింది. వద్దు సారూ అంటూ గుండెలు పగిలేలా ఏడుస్తూ బతిమాలినా వినలేదు. అక్కడున్న పోలీసుల కాళ్లు మొక్కినా కనికరించలేదు. చివరికి ఆ కుటుంబం రోడ్డున పడింది.
ఓవైపు హైడ్రోజన్ బాంబులా దూసుకొచ్చిన హైడ్రా బుల్డోజర్ క్షణాల్లో ఇంటిని నేలమట్టం చేస్తున్నది.. మరోవైపు అమ్మా ఆకలేస్తున్నది అన్నం పెట్టు అంటూ బిడ్డ ఏడుస్తున్నది.. అన్నం గిన్నె మట్టి పెడ్డలతో నిండి ఉన్నది..

అప్పుడు ఆ తల్లి బాధ వర్ణనాతీతం.. ఈ హృదయవిషాదకర ఘటన ఖాజాగూడలో భగీరథమ్మ చెరువు వద్ద చోటుచేసుకున్నది. బఫర్ జోన్లో అక్రమ నిర్మాణాల పేరిట హైడ్రా నిరుపేదల ఇండ్లను నేలమట్టం చేసింది.
నల్ల చెరువు పరిధిలో ఇల్లు కూల్చేయడంతో తన పుస్తకాలు అందులోనే ఉండిపోయాయని.. తండ్రి ప్రేమతో కోనిచ్చిన వాటర్ బాటిల్ పగిలిపోయిందని ఓ ఐదేండ్ల చిన్నారి ఆవేదనతో కూడిన మాటలు వింటే అందరి గుండెలు తరుక్కుపోయాయి. ‘రేవంత్ సార్ మా ఇల్లు కూలగొట్టిండు.

మా అమ్మానాన్నను పోలీస్ స్టేషన్‌కు తీసుకొనిపోయిన్రు. మేం ఏంత ఏడ్చినా వదల్లేదు అంటూ చిన్నారి రోదించడం ప్రతి ఒక్కరినీ కలచివేసింది. ఈ పాప కన్నీటికి కేటీఆర్ చలించి ఆ చిన్నారి దగ్గరికి స్వయంగా వెళ్లి తనకు కావాల్సిన పుస్తకాలు, నోట్బుక్లుఅందించి భరోసానిచ్చారు.
సున్నం చెరువు పరిధిలో హైడ్రా సాగించిన కూల్చివేతల పర్వం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. కనీసం చిన్నారులు పుస్తకాలను కూడా తీసుకోనివ్వకుండా బుల్డోజర్లతో ఇండ్లను నేలమట్టం చేశారు.

శిథిలాల్ల్లో చిన్నారులు తమ పుస్తకాలను వెతుక్కుంటున్న దృశ్యం అందరినీ కంటతడి పెట్టించింది.
చిన్న చిన్న ఇండ్లు. అది కూడా రేకుల షెడ్డు. అందులో ఉంటూ రోజూ కూలి పని చేసుకుంటూ బతుకీడ్చే జీవులు వారు. కండ్ల ముందే హైడ్రా ఇండ్లు కూల్చివేసి నిరుపేదల గుండెల్లో మానని గాయం చేసింది.

ఈ ఘటన మాదాపూర్‌లోని సున్నం చెరువు సమీపంలోని జరిగింది. నిలువ నీడలేక చావే శరణ్యమంటూ ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నిస్తున్న ఓ బాధితురాలు.
కొండాపూర్‌లోని భిక్షపతినగర్లో హైడ్రా విధ్వంసం సృష్టించింది. నిరుపేదల ఇండ్లను బుల్డోజర్తో పెకిలించింది. ఇండ్లు ఎందుకు కూల్చుతున్నారో కూడా తెలియని పరిస్థితి.

దీంతో ఓ తల్లి తన చంటిబిడ్డను ఎత్తుకొని కన్నీరు మున్నీరు అవుతుండగా.. మరి కొందరు చెల్లాచెదరుగా పడి ఉన్న తమ సామగ్రిని చూస్తూ నిశ్చేష్టులైపోయారు.
పండుగ పూట పేదలపై హైడ్రా ప్రతాపం చూపింది. బడుగుజీవులకు దసరా సంబురం లేకుండా చేసింది. కొండాపూర్ భిక్షపతి నగర్‌లోని పేదల ఇండ్లను హైడ్రా కూల్చివేసింది. తమ ఇండ్లను కూల్చొద్దంటూ వేడుకున్నా వినకుండా నేల మట్టం చేశారు.

కూలిన ఇండ్ల మధ్య తమ సామగ్రిని వెతుక్కుంటున్న తల్లి. ఆ కూలిన ఇల్లును చూసి రోదిస్తున్న చిన్నారి.
హైడ్రా తమ ఇంటిని కూల్చడంతో రోడ్డునపడ్డ నిరుపేదలు వర్షంలో తడుస్తూనే తమ సామగ్రిని వెతుక్కుంటున్న దృశ్యం అందరినీ కలచివేసింది.

తామేం పాపం చేశామంటూ వారు రోదిస్తూ సర్కార్‌ను నిలదీశారు. వినాయక చవితి మరుసటి రోజే ఈ కూల్చివేతలు జరుగడం గమనార్హం.
ఖాజాగూడలో హైడ్రా నిరుపేదల ఇండ్లను కూల్చివేయడంతో పిల్లలు సహా రోడ్డున పడిన వలస కుటుంబాలు. ఎక్కడికి వెళ్లాలో తెలియక ఓ తల్లి దీనంగా చూస్తున్న ఈ దృశం ప్రతి ఒక్కరినీ కలిచివేసింది.

బతుకుజీవుడా అంటూ ఇంకెక్కడికి వెళ్లాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నది. సామగ్రితో రోడ్డు పక్కనే కూర్చొని సాయం కోసం ఎదురుచూసింది.