– బీఆర్ఎస్వీ యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కి నగేశ్
బీబీనగర్, సెప్టెంబర్ 10 : కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 13 డిక్లరేషన్లు, 420 హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీకి వెళ్లకుండా బీఆర్ఎస్వీ యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కి నగేశ్‌ను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. గురువారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో బీబీనగర్ మండలంలోని రాఘవపురంలో ఆయన నివాసానికి వెళ్లి పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా జక్కి నగేశ్ మాట్లాడుతూ.. సీఎం ఇంటి ముట్టడి చేస్తారనే భయంతోనే అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న తనను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమేనని, తెలంగాణ సమాజం మొత్తం ఈ ఘటనను గమనిస్తోందన్నారు. ప్రజా పాలన, ప్రజా దర్బార్ అంటూ చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరసన తెలిపే హక్కును కూడా హరిస్తోందని విమర్శించారు.
విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్‌షిప్‌లకు సంబంధించిన సుమారు రూ.11,300 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఫీజులు అందక విద్యార్థులు, కళాశాలల యాజమాన్యాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించాలన్నారు. యూత్ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలను యుద్ధప్రాతిపదికన అమలు చేయాలని, పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్‌ను దెబ్బతీసే జీవో 97ను రద్దు చేయాలని కోరారు. దళితులకు అంబేద్కర్ అభయహస్తం పథకం కింద ఒక్కొక్కరికి రూ.12 లక్షలు ఇస్తామన్న హామీని అమలు చేయాలని, కల్యాణలక్ష్మి పథకంతో పాటు తులం బంగారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు ఉద్యోగాలతో పాటు నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్ అమలు చేయాలని, ఆటో కార్మికులకు ఏటా రూ.12 వేల ఆర్థిక సహాయం అందించాలన్నారు. విద్యాశాఖ మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్ విషయంలో ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రశ్నించారు. మంత్రులు, అధికారుల సమావేశాలకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం విద్యార్థుల ఫీజులు చెల్లించేందుకు నిధులు విడుదల చేయకపోవడం దారుణమన్నారు. అర్ధరాత్రి ఇంటికి వచ్చి అరెస్టులు చేయడం సరికాదని విమర్శించారు.