Ranabaali | రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’ పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. రష్మిక మందన్న కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ఇటీవల విడుదలై సామాజిక మాధ్యమాల్లో సంచలనం సృష్టిస్తోంది. విజయ్ దేవరకొండ రఫ్ అండ్ ఇంటెన్స్ లుక్, యాక్షన్ సన్నివేశాలు అభిమానులను ఆకట్టుకోగా.. టీజర్లో అందరి దృష్టినీ తనవైపు తిప్పుకున్నది మాత్రం ఓ హాలీవుడ్ స్టార్. ‘రణబాలి’లో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఆర్నాల్డ్ వోస్లూ కీలక ప్రతినాయకుడిగా నటిస్తున్న విషయం టీజర్‌తో స్పష్టమైంది. ఆయన ఎంట్రీతో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.
ముఖ్యంగా హాలీవుడ్లో విలన్ పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆర్నాల్డ్ వోస్లూ.. ఈ సినిమాలో అత్యంత పవర్ఫుల్, క్రూరమైన ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. టీజర్లో ఆయన చూపించిన డార్క్ షేడ్స్, సీరియస్ నటన ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తిని మరింత పెంచాయి.ఆర్నాల్డ్ వోస్లూ పేరు చెప్పగానే చాలామంది సినీ అభిమానులకు గుర్తొచ్చే పాత్ర ఇమ్హోటెప్. ‘ది మమ్మీ’ (1999), ‘ది మమ్మీ రిటర్న్స్’ (2001) చిత్రాల్లో ఆయన పోషించిన హై ప్రీస్ట్ ఇమ్హోటెప్ పాత్ర ప్రపంచవ్యాప్తంగా భారీ గుర్తింపును తెచ్చిపెట్టింది.ఆ పాత్రలో ఆయన చూపించిన భయానక విలనిజం ఇప్పటికీ హాలీవుడ్ అభిమానుల మదిలో నిలిచిపోయింది. ఇప్పుడు అదే నటుడు భారతీయ సినిమాలో, అందులోనూ తెలుగు చిత్రంలో కీలక ప్రతినాయకుడిగా కనిపించబోతుండటంతో ‘రణబాలి’పై అంతర్జాతీయ స్థాయి ఆసక్తి ఏర్పడుతోందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
దక్షిణాఫ్రికాకు చెందిన ఆర్నాల్డ్ వోస్లూ తన కెరీర్‌ను రంగస్థల నటుడిగా ప్రారంభించారు. ‘హామ్లెట్’, ‘ట్వెల్త్ నైట్’ వంటి క్లాసిక్ నాటకాల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.ఆ తర్వాత హాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఆయనకు దర్శకుడు జాన్ వూ అవకాశం ఇచ్చారు. జీన్-క్లాడ్ వాన్ డామ్ హీరోగా తెరకెక్కిన ‘హార్డ్ టార్గెట్’ (1993)లో ప్రధాన ప్రతినాయకుడిగా నటించే ఛాన్స్ దక్కింది. ఆ తర్వాత వరుసగా పలు హాలీవుడ్ చిత్రాలు, టెలివిజన్ సిరీస్‌లలో కీలక పాత్రలు పోషించారు.‘డార్క్మ్యాన్’ సిరీస్‌తో పాటు ‘24’లో హబీబ్ మర్వాన్, ‘జి.ఐ. జో’ సిరీస్‌లో జార్టాన్, ‘బ్లడ్ డైమండ్’ వంటి చిత్రాల్లో నటించి ప్రపంచ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఇప్పటివరకు ‘రణబాలి’కి విజయ్ దేవరకొండ యాక్షన్ ప్రధాన ఆకర్షణగా కనిపించింది. కానీ ఇప్పుడు ఆర్నాల్డ్ వోస్లూ విలన్‌గా ఎంట్రీ ఇవ్వడంతో సినిమాకు మరో స్థాయి వచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.