చుంచుపల్లి, సెప్టెంబర్ 10 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం విద్యానగర్ కాలనీ గ్రామ పంచాయతీ పరిధిలో జాతీయ రహదారి పక్కనే జరుగుతున్న నిర్మాణ పనులు వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. నిర్మాణానికి సంబంధించిన ఇసుక, కంకర వంటి సామగ్రి రహదారికి ఆనుకుని పెద్దఎత్తున పోగు చేయడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగించే జాతీయ రహదారి పక్కనే ఇసుక, కంకర గుట్టలు ఏర్పాటు చేసినా ట్రాఫిక్ పోలీసులు పట్టించుకోకపోవడంపై వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రాత్రివేళల్లో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతోందని చెబుతున్నారు. రహదారిపై ఏర్పడుతున్న ప్రమాదకర పరిస్థితిని గుర్తించి నిర్మాణ సామగ్రిని తొలగించాల్సిన అధికారులు ఏం చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రాణనష్టం జరిగిన తర్వాతే అధికారులు స్పందిస్తారా? అని ప్రశ్నిస్తున్నారు.
భవన నిర్మాణాలకు సంబంధించి గతంలోనే పంచాయతీ అధికారులు పోలీసులకు ఫిర్యాదులు చేసినట్లు స్థానికులు తెలుపుతున్నారు. అయినప్పటికీ పరిస్థితిలో మార్పు లేకపోవడంపై వారు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఫిర్యాదులు ఉన్నప్పటికీ రహదారిపై నిర్మాణ సామగ్రిని తొలగించకపోవడానికి కారణమేంటని నిలదీస్తున్నారు. సంబంధిత శాఖ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు వెంటనే స్పందించి రహదారిపై ఉన్న ఇసుక, కంకరను తొలగించి వాహనదారులకు సురక్షితమైన రాకపోకలు కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.