BRICS Summit : దేశరాజధాని ఢిల్లీ నగరం బ్రిక్స్ సదస్సుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో అధికారులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. 18వ బ్రిక్స్ సదస్సు ఢిల్లీలో సెప్టెంబర్ 12, 13వ తేదీల్లో జరగనుంది. 11వ తేదీ నుంచే అతిథులు రానున్నారు. అక్కడి భారత్ మండపంలో జరగనున్న ఈ అంతర్జాతీయ సదస్సుకు రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్, ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్ వంటి నేతలు హాజరవుతున్నారు.
అందుకే భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. సదస్సు జరిగే ప్రాంతాలతోపాటు, అతిథులు బస చేసే హోటళ్ల వద్ద కనీవిని ఎరుగని భద్రతా ఏర్పాట్లు చేశారు. దాదాపు 500 సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. తుగ్లక్ రోడ్ పోలీస్ స్టేషన్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. 7,000 మంది భద్రతా సిబ్బందిని నియమించారు. వీరిలో ఢిల్లీ పోలీసులతోపాటు పారామిలిటరీ దళాలు, ఎన్ఎస్జీ, ఐబీ, ఇతర విభాగాలకు చెందిన సిబ్బంది పని చేస్తున్నారు. మరోవైపు అంతర్జాతీయ అతిథులు వస్తున్నందున ఢిల్లీ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. న్యూఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సుందరీకరణ బాధ్యతలు చేపట్టారు. 15,000కుపైగా పూల మొక్కల్ని ఏర్పాటు చేశారు.
బ్రిక్స్ సదస్సుకు ప్రధాని మోదీ నేతృత్వం వహిస్తారు. పుతిన్, జిన్పింగ్, పెజెష్కియాన్తోపాటు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా వంటి నేతలు హాజరవుతున్నారు. బ్రెజిల్, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేసియా, ఇరాన్, సౌదీ అరేబియా, యూఏఈ వంటి 11 దేశాలకు చెందిన ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరుకానున్నారు. ఈ సదస్సులో బ్రిక్స్ సభ్య దేశాల మధ్య వ్యాపారం, వాణిజ్యం, పెట్టుబడులు, భద్రత, సహకారం, రవాణా, సరఫరా, టెక్నాలజీ వంటి అంశాలపై చర్చలు, ఒప్పందాలు ఉంటాయి. ఇండియా ఈ సదస్సు నిర్వహిస్తుండటం ఇది నాలుగోసారి. గతంలో 2012, 2016, 2021లో బ్రిక్స్ సదస్సు నిర్వహించింది.