Sreeleela | సినిమా రంగంలో ఎప్పుడు ఎవరి అదృష్టం ఎలా మారుతుందో చెప్పడం అంత సులభం కాదు. ఒక్క హిట్‌తోనే స్టార్డమ్ అందుకోవచ్చు.. అదే వరుస పరాజయాలు ఎదురైతే అవకాశాలు కూడా క్రమంగా తగ్గిపోవచ్చు. ముఖ్యంగా కథానాయికల కెరీర్లో ఈ మార్పులు మరింత వేగంగా కనిపిస్తుంటాయి. ఇప్పుడు అలాంటి కీలక దశలోనే ఉన్నట్లు తెలుస్తోంది శ్రీలీల కెరీర్. తెలుగు చిత్ర పరిశ్రమలో కొంతకాలం పాటు శ్రీలీల పేరు వరుసగా వినిపించింది. తన అద్భుతమైన డ్యాన్స్, గ్లామర్, స్క్రీన్ ప్రెజెన్స్‌తో యువతలో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ భామ.. అగ్ర కథానాయకుల సినిమాల్లో వరుస అవకాశాలు అందుకుంది. అయితే వచ్చిన అవకాశాలను విజయాలుగా మలుచుకోవడంలో మాత్రం ఆమెకు ఆశించిన స్థాయిలో ఫలితాలు దక్కలేదనే అభిప్రాయం ఇండస్ట్రీ వర్గాల్లో ఉంది.
దీంతో టాలీవుడ్లో ఒకప్పుడు దూసుకెళ్లిన శ్రీలీల కెరీర్ ప్రస్తుతం కొంత నెమ్మదించినట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె తన కెరీర్‌కు కొత్త దిశను ఎంచుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. టాలీవుడ్లో అవకాశాలు తగ్గుతున్న సమయంలో శ్రీలీల దృష్టి ఇప్పుడు బాలీవుడ్‌పై పడింది. ఇప్పటికే హిందీ చిత్ర పరిశ్రమలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్న ఈ భామ.. అక్కడే వరుస అవకాశాలను అందుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. కొంతకాలం క్రితమే బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాల్సి ఉన్నప్పటికీ.. తన చదువుపై దృష్టి పెట్టడంతో సినిమాలకు కొంత విరామం ఇచ్చింది. తాజాగా తన వైద్య విద్యను పూర్తి చేసుకున్న తర్వాత మళ్లీ పూర్తిస్థాయిలో సినిమాలపై దృష్టి పెట్టినట్లు సమాచారం.
ఈసారి కేవలం ఒకటి రెండు హిందీ సినిమాలు చేయాలనే ఆలోచనతో కాకుండా.. బాలీవుడ్లోనే తన కెరీర్‌ను బలంగా నిర్మించుకోవాలనే ఉద్దేశంతో శ్రీలీల ముందుకు వెళ్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. బాలీవుడ్‌పై ఫోకస్ పెంచిన శ్రీలీల.. అందుకు తగ్గట్టుగానే తన నివాసాన్ని కూడా మార్చుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్ నుంచి ముంబైకి మకాం మార్చినట్లు, అక్కడ ఓ విలాసవంతమైన ఆస్తిని కూడా కొనుగోలు చేసినట్లు సమాచారం. ముంబైలో ఉండటం ద్వారా హిందీ చిత్ర పరిశ్రమకు మరింత దగ్గరగా ఉండటంతో పాటు.. కొత్త కథలు, దర్శకులు, నిర్మాణ సంస్థలతో నిరంతరం టచ్‌లో ఉండే అవకాశం ఉంటుందని ఆమె భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శ్రీలీల బాలీవుడ్ స్టార్ హీరో కార్తీక్ ఆర్యన్ సరసన నటిస్తూ హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ ప్రాజెక్ట్‌తో తనకు బాలీవుడ్లో మంచి గుర్తింపు వస్తుందని ఆమె ఆశలు పెట్టుకుంది. సౌత్‌లో వరుసగా సినిమాలు చేయడం కంటే.. ఇకపై హిందీ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని ఆమె భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.