Mandadi | టాలెంటెడ్ నటుడు సూరి, తెలుగు యువ నటుడు సుహాస్ ప్రధాన పాత్రల్లో నటించిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘మండాడి’. మాథిమారన్ పుగలేంది దర్శకత్వంలో సముద్రం, పడవల రేసింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి ఎల్రెడ్ కుమార్ నిర్మాతగా వ్యవహరించగా, జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. మహిమ నంబియార్ కథనాయికగా నటించగా, సత్యరాజ్, మిథున్, రవీంద్ర విజయ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు రాగా ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
కథ
సముద్రంలో చేపల వేటలోనూ, పడవ పందాల్లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న జాలరి ముత్తుకాళి (సూరి). కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల తన గ్రామానికి, ప్రజలకు దూరంగా ఉంటూ వస్తాడు. అయితే స్థానిక మత్స్యకారులు ఎదుర్కొంటున్న పెద్ద సమస్యను పరిష్కరించడానికి కాళి మళ్ళీ రంగంలోకి దిగుతాడు. ఈ క్రమంలో అతని చిరకాల ప్రత్యర్థి అయిన సట్టై పులి (సుహాస్)తో కాళికి మళ్ళీ పోరు మొదలవుతుంది. వీరిద్దరి మధ్య పడవ పందాలు ఎంతటి ఉత్కంఠకు దారితీశాయి? అసలు కాళి తన వాళ్లను ఎందుకు విడిచిపెట్టాల్సి వచ్చింది? ఈ పోరులో చివరికి విజయం ఎవరిని వరించింది? అనేదే ఈ చిత్ర అసలు కథ.
విశ్లేషణ
సముద్రం నేపథ్యంలో సాగే పడవ పందాలు, స్నేహం, పగ, ప్రతీకారాల సమ్మిళితంగా ఈ సినిమా తెరకెక్కింది. ఇలాంటి ఒక ప్రత్యేకమైన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా బ్యాక్‌డ్రాప్ తెలుగు తెరపై కొత్త అనుభూతిని ఇస్తుంది. సినిమా ప్రారంభ సన్నివేశాలు మరియు ఒక పాత్రపై జరిగే దాడి చుట్టూ తిరిగే సీన్స్ మంచి సస్పెన్స్‌ను క్రియేట్ చేస్తాయి. కథ కళింగపట్నానికి షిఫ్ట్ అయ్యాక ప్రథమార్థంలో కథనం కాస్త నెమ్మదిగా సాగుతుంది. కొన్ని సన్నివేశాలు సాగదీతగా అనిపించడం వల్ల ఇంటర్వెల్ వరకు ప్రేక్షకుడు కొంచెం సహనం వహించాల్సి వస్తుంది. కానీ, ద్వితీయార్థం (Second Half) సినిమాను పూర్తిగా నిలబెట్టింది. కాళి గతం, పులితో ఉన్న స్నేహ బంధం, కోచ్‌గా సత్యరాజ్ ఎంట్రీ వంటి అంశాలు డ్రామాను రక్తికట్టించాయి. ముఖ్యంగా క్లైమాక్స్‌లో వచ్చే పడవ పోటీలు సీటు అంచున కూర్చునేలా చేస్తూ అత్యంత ఉత్కంఠభరితంగా సాగుతాయి.
నటీనటులు
సూరి ముత్తుకాళి పాత్రలో ఒదిగిపోయారు. ఎలాంటి హంగులు లేకుండా, కేవలం తన సహజమైన నటనతో పాత్రకు పూర్తి ప్రాణం పోశారు. రియలిస్టిక్ యాక్టింగ్‌తో మెప్పించారు. సుహాస్ సాట్టై పులి పాత్రలో సరికొత్త కోణంలో కనిపించారు. విలనిజంతో పాటు విభిన్న వేరియేషన్స్ చూపిస్తూ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచారు. సత్యరాజ్ కోచ్ పాత్రలో తన అనుభవాన్ని పూర్తిగా రంగరించి జీవించారు. మహిమ నంబియార్ తో పాటు మిగిలిన నటీనటులు తమ పరిధి మేరకు చక్కటి అభినయాన్ని ప్రదర్శించారు.
సాంకేతికంగా
జీవీ ప్రకాష్ కుమార్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకి పెద్ద ఎస్సెట్. ముఖ్యంగా పడవ పోటీల సమయంలో వచ్చే మ్యూజిక్ గూస్బంప్స్ తెప్పిస్తుంది. సినిమాటోగ్రఫీ ఎస్.ఆర్. కతిర్ కెమెరా పనితనం చాలా నేచురల్‌గా ఉంది. సముద్రపు అందాలను, పడవ పోటీలను తెరపై కళ్లకు కట్టినట్లు చూపించారు. దర్శకుడు మాథిమారన్ పుగలేంది ఎంచుకున్న పాయింట్ బాగుంది. ఫస్టాఫ్‌లో స్క్రీన్ ప్లే విషయంలో కొంత తడబడినప్పటికీ, సెకండాఫ్‌ను మరియు ఎమోషన్స్‌ను డీల్ చేసిన విధానం ప్రశంసనీయం.
ప్లస్ పాయింట్లు
సముద్రంలో సాగే పడవ పోటీల నేపథ్యం
ద్వితీయార్థంలో వచ్చే బలమైన భావోద్వేగాలు
సూరి, సుహాస్ నటన
నేపథ్య సంగీతం మరియు విజువల్స్
మైనస్ పాయింట్లు
ప్రథమార్థంలో నెమ్మదైన కథనం
రొటీన్‌గా అనిపించే కొన్ని సంఘర్షణ సన్నివేశాలు
చివరిగా ఫస్ట్ హాఫ్ కొంచెం నెమ్మదిగా ఉన్నప్పటికీ.. సెకండాఫ్‌లో వచ్చే పడవ పోటీలు, ఎమోషనల్ డ్రామా సినిమాను మంచి అనుభూతిని మిగిలేలా చేస్తాయి. సరికొత్త బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ యాక్షన్ డ్రామాను వీకెండ్లో ఒకసారి హ్యాపీగా చూడవచ్చు.
రేటింగ్: 2.75/5