తెలంగాణలో ఏం జరుగుతున్నదో మాకు తెలుసు. పార్టీ ఒకవైపు, ప్రభుత్వం ఇంకోవైపు పోతున్నది. ఎవరికివారు వ్యక్తిగత ఎజెండా నడుపుతున్నరు. దీన్ని ఇలాగే వదిలేయలేం! ఇకనుంచి పార్టీ సమన్వయ బాధ్యతను ఢిల్లీ నుంచి మేమే చూసుకుంటాం!
– రాష్ట్ర నేతలతో మల్లికార్జున ఖర్గే
హైదరాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ): తెలంగాణ కాంగ్రెస్‌లో పెరుగుతున్న అంతర్గత సంక్షోభంపై ఏఐసీసీ అధిష్ఠానం తీవ్ర అసహనం వ్యక్తంచేసింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన వద్ద ఉన్న నివేదికను ఇవ్వబోగా, దానిని తీసుకోవడానికి కూడా ఏఐసీసీ నాయకత్వం ఇష్టపడలేదని విశ్వసనీయంగా తెలిసింది. ‘మీ రిపోర్టు మాకు అవసరం లేదు. తెలంగాణలో ఏం జరుగుతున్నదో మా దగ్గర పూర్తి గ్రౌండ్ రిపోర్ట్ ఉన్నద’ని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్రస్వరంతో అన్నట్టు తెలిసింది. పార్టీ ఒక దిశలో, ప్రభుత్వం మరో దిశలో పోతున్నదని అసహనం వ్యక్తంచేసినట్టు సమాచారం. మంత్రుల మధ్య సమన్వయం లేదని, ఎమ్మెల్యేలకు క్రమశిక్షణ లేదని అసంతృప్తి వ్యక్తంచేసినట్టు తెలిసింది. తెలంగాణలో వ్యక్తిగత ఎజెండాను అమలు చేస్తున్నారని, పార్టీ క్యాడర్‌ను కాపాడుకోవాల్సిన బాధ్యత తమపై ఉన్నదని, రాష్ట్రంలో ప్రక్షాళన చేయాల్సిన సమయం వచ్చిందని ఖర్గే తీవ్ర స్వరంతో అన్నట్టు తెలిసింది. సోమవారం ఢిల్లీలోని ఇందిరాభవన్‌లో నిర్వహించిన ఏఐసీ సీ సమావేశంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాలపై అధిష్ఠానం సీరియస్ అయినట్టు తెలిసింది.
స మావేశంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతోపాటు సీనియర్ నేతలు పాల్గొన్నారు. రాష్ట్రంలో పార్టీ వ్యవహారాలు, ప్రభుత్వ పనితీరు, ఎమ్మెల్యేల్లో పెరుగుతున్న అసంతృప్తి, మంత్రుల మధ్య సమన్వ య లోపం, దళిత ఎమ్మెల్యేల తిరుగుబాటు సంకేతాలపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించినట్టు తెలిసింది. సమావేశం ఆసాంతం సీఎం రే వంత్ మౌనంగానే ఉన్నారని, టీపీసీసీ అధ్యక్షు డు మహేశ్‌కుమార్‌గౌడ్ మధ్యమధ్యలో కల్పించుకొని మాట్లాడటానికి ప్రయత్నించారని తెలిసింది. సమీక్షా సమావేశంలో ఖర్గే, ఏఐసీసీ ఢిల్లీ దూత మీనాక్షీనటరాజన్ ఎక్కువ సమయం మా ట్లాడినట్టు తెలిసింది. కొన్ని రోజులు క్షేత్రస్థాయి నుంచి సేకరించిన సమాచారాన్ని ఆమె నివేదిక రూపంలో ఏఐసీసీ ముందు పెట్టినట్టు తెలిసింది.
పార్టీని నాశనం చేశారు
ఖర్గే చేసిన వ్యాఖ్యలు ఒకరోజులో వచ్చిన ఆవేశం కాదని, రెండు వారాలుగా ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షీనటరాజన్ నిర్వహించిన వరుస సమీక్షల ఫలితమేనని కాం గ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేండ్లు పూర్తి చేసుకున్న సమయంలో అధిష్ఠానం నేరుగా జోక్యం చేసుకొని సమీక్షిస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, డీసీసీ అధ్యక్షులు, మంత్రులతో వి డివిడిగా వన్-టు-వన్ సమావేశాలు నిర్వహిం చి సంస్థాగత పరిస్థితి, ప్రభుత్వ పనితీరు, పార్టీ-ప్రభుత్వం మధ్య సమన్వయం, జిల్లా స్థాయి విభేదాలపై ఆమె నేరుగా అభిప్రాయాలు సేకరించారు. చాలామంది నేతలు జిల్లా స్థాయిలో ఎమ్మెల్యేలు-డీసీసీ అధ్యక్షుల మధ్య సమన్వ యం లేదని, నియామకాలపై తీవ్ర అసంతృప్తి ఉన్నదని, క్షేత్రస్థాయిలో క్యాడర్ నిరుత్సాహానికి గురవుతున్నారని ఢిల్లీ దూత మీనాక్షీ నటరాజన్‌కు నివేదించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే సోమవారం జరిగిన సమావేశంలో ‘పార్టీని నాశనం చేశారు.. మంత్రుల మధ్య సమైక్యత లేదు.. ఎమ్మెల్యేలకు హద్దూ అదుపూ లేదు’ అంటూ అధిష్ఠానం తీవ్ర వ్యాఖ్యలు చేసినట్టు తెలిసింది. ఇటీవల బహిరంగంగా వెలుగుచూసిన దళిత ఎమ్మెల్యేల అసంతృప్తి అంశంపై కూడా ఢిల్లీ పెద్దలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ‘దళిత ఎమ్మెల్యేలను ఎగదోస్తున్న వారు ఎవరో మాకు తెలుసు’ అంటూ ఈ పరిణామాలను అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్నామని స్పష్టం చేసినట్టు సమాచారం.
రేపు కో ఆర్డినేషన్ సమావేశం
రాష్ట్రంలో పార్టీ కంటే వ్యక్తిగత వర్గాలు బలపడుతున్నాయనే అభిప్రాయాన్ని కూడా ఢిల్లీ పెద్దలు వ్యక్తంచేసినట్టు సమాచారం. పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన క్షేత్రస్థాయి కార్యకర్తల్లో అసంతృప్తి పెరుగుతున్నదని, పార్టీ నిర్మాణం బలహీనపడితే ప్రభుత్వానికే నష్టం వాటిల్లుతుందని హెచ్చరించినట్టు తెలిసింది. ‘క్యాడర్‌ను మీరు వదిలేశారు. కానీ, కాపాడుకోవాల్సిన బాధ్యత మాకు ఉన్నది’ అని అంటూ సంస్థాగత వ్యవస్థను గాడిలో పెట్టాలని స్పష్టమైన సందేశం ఇచ్చినట్టు తెలిసింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే త్వరలో ప్రభుత్వం-పార్టీ సమన్వయంపై ప్రత్యేక కో ఆర్డినేషన్ సమావేశం నిర్వహించాలని ఏఐసీసీ నిర్ణయించినట్టు సమాచారం. ‘ఎల్లుండి (బుధవారం) కో ఆర్డినేషన్ సమావేశం పెడుతాం… అప్పటివరకు వేచి ఉండండి’ అని సమావేశంలో ఏఐసీసీ నాయకత్వం ఆదేశించినట్టు తెలిసింది. ఆ సమావేశంలో ప్రభుత్వ పనితీరు, సంస్థాగత వ్యవహారాలు, ఎమ్మెల్యేల అసంతృప్తి, జిల్లా స్థాయి విభేదాలు, దళిత ఎమ్మెల్యేల అంశం, పార్టీ-ప్రభుత్వ సమన్వయంపై కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉన్నదని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. ఏఐసీసీ ప్రతిపాదించిన సమన్వయ సమావేశం తర్వాత తెలంగాణ కాంగ్రెస్‌లో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయన్నది ఆసక్తికరంగా మారింది.
సొంత ఇమేజ్ కోసం పాకులాట!
ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్‌ను నిరసిస్తూ హైదరాబాద్‌లో కాంగ్రెస్ నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన వ్యక్తిగత ఇమేజ్ ప్రచారానికి ప్రాముఖ్యత ఇవ్వడంపై మీనాక్షీనటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ వేర్వేరుగా అధిష్ఠానానికి ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. 20 అడుగుల పొడవు, 4 అడుగుల ఎత్తుతో ఉన్న బ్యానర్ మధ్యలో రేవంత్‌రెడ్డి పెద్ద బొమ్మను మాత్రమే ముద్రించడం, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రియాంకాగాంధీ వంటి జాతీయ నాయకుల ఫొటోలకు చోటు లేకపోవడంపై ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. అలాగే, తాను లీడ్ తీసుకొని 21 ఏండ్లకు ఎన్నికల్లో పోటీ చేయించే విధంగా పార్లమెంటులో బిల్లు పెట్టిస్తానని చెప్పడంపై వారు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. ఈ ఫిర్యాదులపై సమావేశంలో చర్చకు వచ్చినట్టు తెలిసింది. తెలంగాణలో వ్యక్తిగత ఎజెండా సాగుతున్నదంటూ ఏఐసీసీ పెద్దలు అగ్రహం వ్యక్తంచేసినట్టు సమాచారం.
మూడు రోజులు ఢిల్లీలోనే సీఎం
వాస్తవానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేవలం ఒక్కరోజు పర్యటన నిమిత్తం ఢిల్లీ వెళ్లారు. అయితే, బుధవారం కో ఆర్డినేషన్ సమావేశం ఏర్పాటుచేసిన నేపథ్యంలో ఢిల్లీలోనే ఉండాలని ఆయనను అధిష్ఠానం ఆదేశించింది. దీంతో ఆయన మంగళవారం, బుధవారం కూడా ఢిల్లీలోనే ఉండనున్నారు. మరోవైపు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతోపాటు మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్కను కూడా ఢిల్లీకి రావాలని అధిష్ఠానం ఆదేశించింది. దీంతో ఈ ఆరుగురు మంత్రులు మంగళవారం హుటాహుటిన ఢిల్లీ వెళ్లనున్నారు.