సిటీ బ్యూరో, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ) : వెయ్యి రోజుల నిర్లక్ష్యపు విఫల పాలనలో ఒక్క హామీ అమలు చేయని కాంగ్రెస సర్కార్‌కు కనువిప్పు కలగాలని బీఆర్ఎస్ శ్రేణులు గ్రేటర్ వ్యాప్తంగా అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు సమర్పించారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీల పేరిట అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్నా ఒక్క హామీ అమలు చేయకుండా ప్రజలను తీవ్రంగా మోసం చేసింది. కాంగ్రెస్ మోసాలపై కేసీఆర్ పిలుపు మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో వారం రోజుల పోరుబాట చేపట్టారు. గత వారం రోజులుగా కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనకు వ్యతిరేకంగా అనేక నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అందులో భాగంగా చివరిరోజైన మంగళవారం హామీలపై కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కనువిప్పు కలిగించాలని బీఆర్ఎస్ శ్రేణులు అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించి, వినతి పత్రాలు సమర్పించారు. అదేవిధంగా అసెంబ్లీలో కాంగ్రెస్ సర్కార్ తీరు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కాంగ్రెస్ నేతల అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టారు. రోడ్లపై బైఠాయించి సీఎం రేవంత్‌రెడ్డి దిష్టి బొమ్మ దహనం చేశారు.
ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద బీఆర్ఎస్ శ్రేణులు నల్ల జెండాలతో నిరసన తెలిపారు. భారీ ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు చేరడంతో ఆ ప్రాంతమం తా కిక్కిరిసిపోయింది. జీవీకే చౌరస్తా వద్ద ఖైరతాబాద్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఇన్చార్జి మన్నె గోవర్ధన్‌రెడ్డి వినతి పత్రం అందజేశారు. మాగంటి సునీతాగోపీనాథ్ బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ద్విచక్రవాహనాలతో ర్యాలీగా వెళ్లి అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. మాజీ కార్పొరేటర్ మహేశ్ యాదవ్ నేతృత్వంలో పంజాగుట్ట కూడలిలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చారు. సీతాఫల్మండి, బౌద్ధనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్లు శైలజ, సామలహేమలతో పాటు బీఆర్ఎస్ నేతలు మెట్టుగూడ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. మూసారాంబాగ్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి మలక్‌పేట బీఆర్ఎస్ ఇన్చార్జి అభిజిత్‌రెడ్డి ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు.
చిలుకానగర్ డివిజన్లో అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. మీర్‌పేట హెచ్‌బీ డివిజన్లో బీఆర్ఎస్ శ్రేణులు అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చారు. మల్కాజిగిరిలో బీఆర్ఎస్ శ్రేణులు వందలాదిగా చేరి అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. కార్వాన్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఇన్చార్జి ఠాకూర్ జీవన్ సింగ్ అధ్వర్యంలో మంగళవారం గుడిమల్కాపూర్ లక్ష్మీ నగర్ చౌరస్తాలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. బోయిన్పల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ టీఎన్. శ్రీనివాస్ వినతి పత్రం ఇచ్చారు. కంటోన్మెంట్ నాలుగో వార్డు గాంధీ హట్స్‌లోని అంబేద్కర్ విగ్రహానికి బీఆర్ఎస్ నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. రావుల శ్రీధర్‌రెడ్డి రహ్మత్‌నగర్ డివిజన్ కూడలిలో బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ధర్నా, నిరసన కార్యక్రమాలతో పాటు అంబేద్కర్ విగ్రహానికి హామీల వినతిపత్రం అందజేశారు.
అసెంబ్లీ ఆవరణలో మహిళా ఎమ్మెల్యేలపై పోలీసుల దాష్టీకాన్ని నిరసిస్తూ గ్రేటర్ వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు నిరసనలతో హోరెత్తించారు. హోం మంత్రిగా ఉంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పోలీసులను బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై దాడులు చేయించారంటూ ఆందోళనలు చేపట్టారు. కాంగ్రెస్ చేస్తున్న దమన కాండను నిరసిస్తూ గ్రేటర్ వ్యాప్తంగా ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిష్టి బొమ్మలను దహనం చేశారు. నల్ల బ్యాడ్జీలు, నల్ల దుస్తులు ధరించి నిరసనలు చేపట్టారు. నగరంలోని ప్రధాన కూడళ్లు, చౌరస్తాల్లో బీఆర్ఎస్ శ్రేణుల నిరసనలతో హోరెత్తించారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నిరసనలతో గ్రేటర్ హైదరాబాద్ అట్టుడికింది.