Kayadu Lohar | చిత్ర పరిశ్రమలో అందం, అభినయం ఉన్నప్పటికీ సరైన విజయాలు దక్కాలంటే కొంత అదృష్టం కూడా కలిసి రావాల్సిందే. వరుసగా అవకాశాలు వస్తున్నా సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోతే హీరోయిన్ల కెరీర్‌పై ఆ ప్రభావం పడుతుంది. ప్రస్తుతం యువ కథానాయిక కాయాదు లోహర్ కెరీర్ పరిస్థితి కూడా ఇలాంటి దశలోనే ఉందనే చర్చ టాలీవుడ్లో జరుగుతోంది. అస్సాంలో జన్మించిన కాయాదు లోహర్ పుణెలో చదువుకున్నారు. 2021లో విడుదలైన కన్నడ చిత్రం ‘ముగిల్పేట’తో హీరోయిన్గా వెండితెరకు పరిచయమైన ఆమె.. ఆ తర్వాత మలయాళంతో పాటు తెలుగు సినిమాల్లోనూ అవకాశాలు అందుకున్నారు. తెలుగులో శ్రీ విష్ణు హీరోగా నటించిన ‘అల్లూరి’ సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెట్టారు.
అయితే భారీ అంచనాలతో వచ్చిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. సినిమాలో కయాదు తన అందం, నటనతో ఆకట్టుకున్నప్పటికీ.. ఆ సినిమా తర్వాత ఆమెకు వరుసగా పెద్ద అవకాశాలు దక్కలేదు. కొంత విరామం తర్వాత విశ్వక్ సేన్, అనుదీప్ కేవీ కాంబినేషన్లో వచ్చిన ‘ఫంకీ’లో నటించారు. ఇందులో సినీ నిర్మాణ కుటుంబానికి చెందిన యువతిగా, తండ్రి బాధ్యతలను తీసుకుని స్వయంగా సినిమా నిర్మాణంలోకి అడుగుపెట్టే పాత్రలో కనిపించారు. కథలో సినీ నేపథ్యం ఉండటంతో పాటు నటనకు అవకాశం ఉన్న పాత్ర అయినప్పటికీ.. ఆ సినిమా కూడా ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. దీంతో తెలుగులో కాయాదు నటించిన తొలి రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకోలేకపోయాయి.
అయితే ఆ పరాజయాలతో కయాదు వెనక్కి తగ్గలేదు. ఏకంగా నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’లో అవకాశం దక్కించుకున్నారు. దీంతో ఈ సినిమా తన కెరీర్‌కు మంచి మలుపు అవుతుందని అభిమానులు, సినీ వర్గాలు భావించాయి. కానీ సినిమా విడుదలైన తర్వాత ఆమె పాత్రపై మాత్రం భిన్నమైన చర్చ మొదలైంది. ‘ది ప్యారడైజ్’లో కాయాదు సుబ్బు అనే యువతి పాత్రలో కనిపించారు. సినిమాల్లో హీరోయిన్ కావాలనే కలతో మద్రాస్ వెళ్లే ఆమెకు ఆశించిన అవకాశాలు దక్కవు. మరోవైపు తండ్రి చేసిన అప్పుల కారణంగా కుటుంబం ఎదుర్కొంటున్న పరిస్థితులు ఆమె జీవితాన్ని మరో మలుపు తిప్పుతాయి. తండ్రి పరువు నిలబెట్టేందుకు డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో బీ గ్రేడ్ చిత్రాల్లో నటించే పరిస్థితికి ఆమె పాత్ర చేరుతుంది.
అయితే ఈ పాత్రను తెరపై చూపించిన విధానంపైనే ప్రేక్షకుల నుంచి విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా కొన్ని సన్నివేశాల్లో గ్లామర్‌ను ఎక్కువగా చూపించడం, తల్లి పాత్రతో కలిసి చిత్రీకరించిన సన్నివేశాలు, పాత్రలోని భావోద్వేగం కంటే కొన్ని వివాదాస్పద అంశాలే ఎక్కువగా చర్చకు రావడం వంటి విషయాలను నెటిజన్లు ప్రస్తావిస్తున్నారు. దీంతో కథలో కీలకమైన పాత్ర అయినప్పటికీ.. కాయాదు పాత్రకు ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా సినిమా విజయం సాధించకపోయినా నటీనటుల పాత్రలకు మంచి పేరు వస్తే వారికి తదుపరి అవకాశాలు లభించే అవకాశం ఉంటుంది. కానీ ‘ది ప్యారడైజ్’ విషయంలో కాయాదు పాత్రపై ప్రశంసల కంటే విమర్శలే ఎక్కువగా కనిపించడం ఆమె అభిమానులను నిరాశకు గురిచేస్తోంది.
ఇప్పటికే వరుసగా రెండు తెలుగు సినిమాలు ఆశించిన విజయాన్ని అందుకోకపోగా.. మూడో చిత్రంగా వచ్చిన ‘ది ప్యారడైజ్’లోనూ పాత్రపై విమర్శలు రావడంతో కయాదు తదుపరి అడుగులపై ఆసక్తి నెలకొంది. అందం, ప్రతిభ ఉన్న ఈ యువ కథానాయికకు సరైన కథ, బలమైన పాత్ర లభిస్తే తనను తాను నిరూపించుకునే అవకాశం ఉంటుంది. ఇకపై ఆమె ఎలాంటి కథలను ఎంచుకుంటారు? ఎలాంటి పాత్రలతో ప్రేక్షకుల ముందుకు వస్తారు? అనేది ఆమె కెరీర్లో కీలకంగా మారనుంది.