హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): నల్ల టీ షర్టులు ధరించడే కారణమైతే, మహిళా ఎమ్మెల్యేలను అసెంబ్లీలోకి వెళ్లకుండా పోలీసులు ఎందుకు అడ్డుకున్నారని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. పోలీసులు మహిళా ఎమ్మెల్యేల గొంతు పట్టుకొని అదుపులోకి తీసుకున్నట్టు కనిపిస్తున్న ఫొటో లు ఉన్నాయని, ‘మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా?’ అని మండిపడింది. సోమవారం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అసెంబ్లీ ద్వారం వద్ద పోలీసులు అడ్డుకొని దుర్మార్గంగా, దౌర్జన్యంగా, దురుసుగా వ్యవహరించారంటూ బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనాయకుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ దాఖలు చేసిన పిటిషన్లో వెలువడిన ఉత్తర్వులను సవరించాలని కోరుతూ ప్రభుత్వం రివిజన్ పిటిషన్ దాఖలుచేసింది. ఎమ్మెల్యేలపై దురుసుగా వ్యవహరించిన పోలీసులను గుర్తించి, చర్యలు తీసుకొని నివేదించాలన్న ఉత్తర్వులను రద్దు చేయాలని కోరింది. దీనిని మంగళవారం జస్టిస్ టీ మాధవీదేవి విచారించారు. ఈ సందర్భంగా ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు.
అసెంబ్లీ ప్రాంగణంలోకి ప్రవేశానికి సంబంధించి కొత్తగా నిబంధనలు విధించారా? అని ధర్మాసనం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. వాటిని సభ్యులకు అధికారికంగా తెలియజేశారా? అని అడిగింది. ‘నిబంధనలు మార్చిన వెంటనే అమలు చేశారా.. లేదా ఎమ్మెల్యేలకు ముందుగా సమాచారం ఇచ్చారా?’ అని ఆరా తీసింది. అసెంబ్లీకి హాజరయ్యే సభ్యులు ఎలాంటి దుస్తులు ధరించాలి, ఏ దుస్తులు ధరించకూడదనే విషయాన్ని ముందుగానే స్పష్టంగా తెలియజేశారో లేదో చెప్పాలన్నది. ఎమ్మెల్యేలను అసెంబ్లీ ప్రాంగణంలోకి రాకుండా అడ్డుకొనే అధికారం పోలీసులకు ఉందా? అని ప్రశ్నించింది. చట్టసభ నిబంధనలను అమలు చేసే అధికారం స్పీకర్‌దే కదా అని ఆరా తీసింది. ఎమ్మెల్యేలను అడ్డుకోవాలని పోలీసులకు ఎవరు ఆదేశాలు ఇచ్చారు? స్పీకర్ అనుమతి తీసుకున్నారా? అని ధర్మాసనం ప్రశ్నించింది.
సభ్యులను అడ్డుకొనే సమయంలో బలప్రయోగం చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని, నినాదాలు లేని వస్త్రాలు ధరించిన వారిని అరెస్టు చేయడానికి ఏ నిబంధన ఆధారమని నిలదీసింది. ఈ పిటిషన్‌పై ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్‌రెడ్డి, బీఆర్ఎస్ శాసనసభా పక్షం తరఫున సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్‌రావు వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనల అనంతరం ధర్మాసనం స్పందిస్తూ.. ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు శాసనసభకు హాజరయ్యారని, కాబట్టి ప్రభుత్వ పిటిషన్‌పై ఇప్పటికిప్పుడు అత్యవసరంగా ఉత్తర్వులు జారీ చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నది. ఇరుపక్షాలు సమర్పించిన అఫిడవిట్లు, ఘటనకు సంబంధించిన ఫొటోలు, ఎఫ్ఐఆర్ ప్రతులు, స్పీకర్ ఆదేశాలు, చీఫ్ మార్షల్ పాత్ర, శాసనసభ సమావేశాల సమయంలో అమల్లో ఉన్న నిషేధాజ్ఞలు, అసెంబ్లీ బులెటిన్, సభ్యుల ప్రవేశానికి సంబంధించిన నిబంధనలు, ఇతర పత్రాలను పరిశీలించిన అనంతరం ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపింది. తీర్పును వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది.
బీఆర్ఎస్ శాసనసభా పక్షం తరఫున సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్‌రావు వాదనలు వినిపిస్తూ.. అసెంబ్లీలో పోలీసుల జోక్యాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. చట్టసభ అధినేత స్పీకర్ అని, సభలో సభ్యుల ప్రవర్తనపై చర్యలు తీసుకొనే అధికారం ఆయనకే ఉంటుందని స్పష్టం చేశారు. అసెంబ్లీ బులెటిన్- 34లో నినాదాలు, ప్లకార్డులు, కరపత్రాలు, సభా కార్యకలాపాలకు సంబంధం లేని సాహిత్య ప్రదర్శనపై నిబంధనలు ఉన్నా, నల్ల టీ షర్టులు ధరించరాదని ఎకడా పేరొనలేదని వివరించారు. టీ షర్టుపై ఉన్న నినాదం నిబంధనలకు విరుద్ధమా, కాదా? అనేది నిర్ణయించే అధికారం స్పీకర్‌కే ఉంటుందని స్పష్టంచేశారు. వాస్తవానికి నల్ల టీషర్ట్‌పై ‘హామీల అమలు విఫలం-వెయ్యి రోజుల పాలన నిష్ఫలం’ అనే నినాదం ఉన్నదని, ఇది కాంగ్రెస్ పార్టీ హామీ వైఫల్యానికి సంబంధించిందని, ప్రభుత్వానికి వ్యతిరేకం కానేకాదని చెప్పారు.
ఒకవేళ ఈ టీషర్ట్‌తో సభ్యులు సభలోకి వెళ్లిన తర్వాత అది నిబంధనల ఉల్లంఘన అని సభాపతి భావిస్తే, సదరు సభ్యులపై కఠినచర్యలు తీసుకోవచ్చని అన్నారు. ఆ అధికారాలను పోలీసులు తమ చేతుల్లోకి తీసుకోరాదని స్పష్టం చేశారు. స్పీకర్ చర్యలను కూడా పోలీసులే తీసుకుంటే పరిస్థితి ఎకడికి దారితీస్తుందని ప్రశ్నించారు. నిబంధనల ఉల్లంఘన జరిగిందో లేదో పోలీసులే నిర్ణయించి, ఎమ్మెల్యేలను అడ్డుకొంటే.. చివరికి రాష్ట్రంలో పోలీస్ రాజ్యమే ఉంటుందన్నారు. ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు చట్టసభలకు వెళ్లడానికి బదులు పోలీస్స్టేషన్లకు వెళ్లే దుస్థితి ఏర్పడిందన్నారు. పోలీసులకు ప్రభుత్వం ఈ స్థాయిలో పెత్తనం ఇస్తే రాష్ట్రంలో పోలీస్ రాజ్యమేలుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. ఎమ్మెల్యేలు కార్లలోనే అసెంబ్లీకి రావాలన్న నిబంధన ఏమీ లేదని, నడుచుకుంటూ వచ్చినా వారిని అనుమతించాల్సిందేనని చెప్పారు.
చీఫ్ మార్షల్ పేరుతో ప్రభుత్వం చూపిన లేఖపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. అది ప్రభుత్వ అఫిడవిట్లో ప్రస్తావించలేదన్నారు. మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును ప్రస్తావించారు. నల్ల చీరలు ధరించిన మహిళా ఎమ్మెల్యేలను కూడా అదుపులోకి తీసుకున్నారని, నినాదాలు లేని టీ షర్టు ధరించిన సభ్యుడినీ అడ్డుకున్నారని, ఎమ్మెల్సీ మధుసూదనాచారి తెల్ల వస్త్రాలు ధరించినా కూడా అడ్డుకున్నారని పేర్కొన్నారు. వాటికి సంబంధించిన ఫొటోలను పరిశీలించాలని న్యాయమూర్తిని కోరారు. ఘటనపై స్వతంత్ర విచారణ జరిగితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు.
ఘటన ఉదయం సుమారు 9.30 గంటలకు జరిగితే పోలీసులకు సమాచారం సాయంత్రం 4 గంటలకు అందిందని ఎఫ్ఐఆర్లో పేరొన్న అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గ ప్రజల తరఫున శాసనసభకు హాజరై ప్రజా సమస్యలను ప్రస్తావించడం, చర్చల్లో పాల్గొనడం తమ విధిలో భాగమని, ఆ విధిని నిర్వర్తించకుండా పోలీసులు అడ్డుకోవడం చట్టాలను కాలరాయడమేనని చెప్పారు. రాజ్యాంగంలోని 14వ అధికరణం కింద పిటిషన్ దాఖలు చేసే అర్హత రాజకీయ పార్టీకి లేదన్న ఏజీ వాదనను తప్పుపట్టారు. బీఆర్ఎస్ తరఫున పిటిషన్ దాఖలు చేయలేదని, పార్టీ ఎమ్మెల్యేల తరఫున ఆ పార్టీ శాసనసభాపక్ష ఉపనేతగా పిటిషన్ వేశారని చెప్పారు.
అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్‌రెడ్డి వాదిస్తూ.. రాజకీయ కారణంగానో, నల్ల దుస్తులు ధరించారనే ఏకైక కారణంతోనో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై పోలీసులు చర్యలు తీసుకోలేదని చెప్పారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో అసెంబ్లీ చుట్టూ నాలుగు కిలోమీటర్ల పరిధిలో నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయని తెలిపారు. శాంతిభద్రతలకు భంగం కలిగించే అవకాశం ఉన్న సభలు, సమావేశాలు, ఊరేగింపులు, ప్రదర్శనలపై నిషేధం ఉన్నదని చెప్పారు. బీఆర్ఎస్ సభ్యులు అసెంబ్లీకి కార్లలో కాకుండా అందరూ ఒకేసారి వచ్చే ప్రయత్నం చేశారని, దీనికితోడు వారు ధరించిన నల్ల టీషర్ట్‌లపై ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు ఉండటంతో అడ్డుకోవాల్సి వచ్చిందని వివరించారు.
నల్ల టీషర్టులపై రాజకీయ నినాదాలు ము ద్రించుకొని సమూహంగా రావడం స్పీకర్ జారీచేసి న బులెటిన్ – 34లోని నిబంధనలకు విరుద్ధమని తెలిపారు. సభ్యులు నినాదాలు చేయడం, ప్లకార్డులు, కరపత్రాలు, సభా కార్యకలాపాలకు సంబం ధం లేని ఇతర సాహిత్యాన్ని ప్రదర్శించడం నిషేధించారని, టీషర్టుపై ముద్రించిన రాజకీయ నినాదం కూడా ఒక రకమైన ప్రదర్శనేనని చెప్పారు. కాబట్టి ఇది రూల్ 316 పరిధిలోకి వస్తుందని తెలిపారు. అసెంబ్లీ ప్రాంగణంలో శాంతిభద్రతలను నిర్వహించే బాధ్యత చీఫ్ మార్షల్దేనని, అవసరమైనప్పుడు పో లీసుల సహాయం తీసుకునే అధికారం ఆయనకు ఉ న్నదని అన్నారు. ఈ మేరకు చీఫ్ మార్షల్ పోలీసుల కు సమాచారం అందించారని చెప్పారు.
పోలీసులు అకడి పరిస్థితిని అదుపులో ఉంచేందుకు మాత్రమే ప్రయత్నించారని, ఉద్దేశపూర్వకంగా ఎమ్మెల్యేలను అడ్డుకోలేదని, గాయపర్చలేదని తెలిపారు. పోలీసు సిబ్బందికి కూడా గాయాలయ్యాయన్నారు. మహిళా పోలీసులు ముందువరుసలో ఉన్నారన్నారు. పోలీసులు ఏర్పాటు చేసిన భద్రతా వలయాన్ని దాటి ఎమ్మెల్యేలు ముందుకు వెళ్లే క్రమంలో తోపులాట జరిగిందని చెప్పారు. మహిళా ఎమ్మెల్యేలపై ఉద్దేశపూర్వకంగా దాడి చేశారన్న ఆరోపణలను ఖండించారు. ఎడిట్ చేయని వీడియోను పరిశీలించాలని కోరారు. శాసనసభ వ్యవహారాల్లో స్పీకర్‌కు ఉన్న అధికారాలను, పార్లమెంటరీ ప్రివిలేజెస్, సభా వ్యవహారాల్లో స్పీకర్ అధికారాలకు సంబంధించిన సుప్రీంకోర్టు, ఢిల్లీ హైకోర్టు తీర్పులను ప్రస్తావించారు.
ఎమ్మెల్యేలు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు ఉన్న నల్ల టీ షర్ట్లు ధరించారన్న కారణంతోనే, వారిని అసెంబ్లీ ఆవరణలోకి వెళ్లకుండా గేటు వద్దనే పోలీసులు అడ్డుకున్నారని ప్రభుత్వం చెప్తున్నదని, మరి చీరలు ధరించిన ఇద్దరు మహిళా ఎమ్మెల్యేలను ఎందుకు అడ్డుకున్నారని న్యాయమూర్తి నిలదీశారు. వారిద్దరూ నల్ల టీషర్టులు ధరించలేదు కదా? అని ప్రశ్నించారు. ‘ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డిని పోలీసులు మెడ పట్టుకొని నెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? చీరపట్టుకొని లాగారని మరో మహిళా ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి కంటతడి పెట్టుకునే పరిస్థితులు ఎందుకు వచ్చాయి?’ అని నిలదీశారు.
ఇద్దరు మహిళా ఎమ్మెల్యేల దుస్తులపై ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు ఏమీ లేనప్పుడు ఏ విధంగా ఆంక్షలు విధించారని మండిపడ్డారు. అదుపులోకి తీసుకురావడానికి మరే మార్గం లేదా? మెడ పట్టుకొని నెట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది?.. అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మహిళలను అదుపులోకి తీసుకునేప్పుడు అనుసరించాల్సిన విధానం ఇదేనా, మహిళా ఎమ్మెల్యేలతో పోలీసులు ఇలా వ్యవహరిస్తారా, మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా?’ అని ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఎమ్మెల్సీ మధుసూదనాచారి కూడా నల్ల దుస్తులు ధరించలేదని ధర్మాసనం గుర్తుచేసింది. అయినా ఆయనను చట్టసభలోకి ఎందుకు అనుమతించలేదని ప్రశ్నించింది. ‘నల్ల దుస్తులే అభ్యంతరమైతే.. నల్ల దుస్తులు ధరించని ఈ సభ్యుడిని ఎందుకు అడ్డుకున్నారు?’ అని నిలదీసింది.