ఆదిలాబాద్, జూలై 27(నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ జిల్లాలో ప్రతిపాదిత జాయింట్ యూజర్ ఎయిర్ ఫీల్డ్ (సివిల్-వైమానిక దళ సంయుక్త విమానాశ్రయం) నిర్మాణానికి సం బంధించిన భూసేకరణ, మౌలిక వసతుల కల్పన, శాఖల సమన్వయ పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. సోమవారం ఆదిలాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో విమానాశ్రయ నిర్మాణానికి సం బంధించిన భూసేకరణ, రహదారి మళ్లింపు, విద్యుత్ టవర్లు, తాగునీటి వ్యవస్థలు, ఇతర మౌలిక వసతుల ఏర్పాటుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు రూ.2,278.14 కోట్ల అంచనా వ్యయంతో పరిపాలనా అనుమతు లు మంజూరు చేసిందన్నారు. మొత్తం 2,009.23 ఎకరాల విస్తీర్ణంలో భారత వైమానిక దళ శిక్షణ కేంద్రంతోపాటు పౌర విమానయాన సేవలు, ఎంఆర్వో(మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్ హాల్) కేంద్రం, కార్గో కాం ప్లెక్స్‌లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
ప్రాజెక్టు అమలులో భాగంగా భూసేకరణ, ప రిహారం చెల్లింపులు, శాఖల పరిధిలోని మౌ లిక వసతుల మళ్లింపు పనులను వేగవంతం గా పూర్తి చేయాలని సూచించారు. ఆదిలాబాద్-అనుకుంట రహదారి మళ్లింపు పనులను రూ.35 కోట్లతో చేపట్టనున్నట్లు తెలిపారు. అలాగే పవర్ గ్రిడ్ కార్పొరేషన్ పరిధిలోని 765 కేవీ హైటెన్షన్ విద్యుత్ టవర్ల మళ్లింపునకు రూ.310 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. ఇరిగేషన్, మిషన్ భగీరథ శాఖల పరిధిలోని వాగుల మళ్లింపు, తాగునీటి వ్యవస్థల పునర్నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరైనట్లు పేరొన్నారు. అదనపు కలెక్టర్లు ఆర్ఎస్ చిత్రు, రాజేశ్వర్, డిప్యూటీ కలెక్టర్ వంశీకృష్ణ, ఆర్డీవో జగదీశ్వర్ రావు, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ ప్రభాకర్, ఆర్ అండ్ బీ ఎస్ఈ వెంకట వేణు, విద్యుత్ శాఖ ఎస్ఈ శేషారావు, నీటి పారుదల శాఖ ఎస్ఈ ప్రభు కల్యాణ్, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్‌గౌడ్, సబ్ రిజిస్ట్రార్ శ్రీలత పాల్గొన్నారు.